
రేపు రాష్ట్రంలో..బంగారం బంద్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని బంగారం దుకాణాలు గురువారం మూత పడనున్నాయి. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొనుగులు చేసే వారికి పాన్ కార్డ్ తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకరోజు సమ్మెకు వర్తకులు సిద్ధం అయ్యారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో అఖిల భారత జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ట్రేడ్ ఫెడరేషన్ సౌత్ జోనల్ చైర్మన్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ, ఇది వరకు రూ. ఐదు లక్షలకు పైగా బంగారం కొనుగోలు చేసేవారికి పాన్‌కార్డ్ తప్పని సరి చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ మొత్తాన్ని పది లక్షలకు పెంచాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని, అయితే, ప్రస్తుతం రూ. రెండు లక్షలకు బంగారం కొనుగోలు చేసే వారు తప్పని సరిగా పాన్ కార్డు నెంబర్‌ను బిల్లులో పొందు పరచాలని కేంద్రం ఆదేశించడం విచారకరంగా పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, గత నెల 30 శాతం మేరకు వర్తకం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పాన్‌కార్డులు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. వివాహ శుభాకార్యాలు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలుకు వస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పాన్ కార్డులు లేని వాళ్లెందరో ఉన్నారని వివరించారు.
గతంలో బ్లాక్ మార్కెటింగ్ దిశలో ఉన్న ఈ వర్తకాన్ని తాము క్రమబద్ధీకరించి గాడిలో పెట్టి ఉన్నామని, ఈ సమయంలో కొత్త నిబంధనల వల్ల మళ్లీ బ్లాక్ మార్కెటింగ్‌కు దారి తీయడం ఖాయం అని వ్యాఖ్యానించారు. తద్వారా ప్రభుత్వానికే నష్టం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో వర్తకం తగ్గిన దృష్ట్యా, బంగారం ఉత్పత్తిలో ఉన్న కార్మికులు కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నదని వివరించారు. కేంద్రం దృష్టికి ఇది వరకే తాము సమస్యల్ని తీసుకెళ్లడం జరిగిందని, పాన్‌కార్డుకు మినహాయింపు ఇవ్వాలని కోరినా, ఇంతవరకు స్పందన లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఒక రోజు సమ్మెకు నిర్ణయించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం సమ్మె జరగనున్నదని, అయితే, తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం గురువారం దుకాణాల బంద్‌కు పిలుపు నివ్వడం జరిగిందన్నారు.
35 వేల దుకాణాలు మూత పడనున్నాయని, తదర్వాత వెయ్యి కిలోల వరకు బంగారం విక్రయం ఆగినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఒక శాతం, కేంద్రానికి పది శాతం మేరకు ఆదాయం గండి పడనున్నాదన్నారు. తాము బంద్‌కు పిలుపు నిచ్చిన విషయాన్ని వినియోగ దారులు పరిగణలోకి తీసుకోవాలని, ఎవ్వరూ బంగారం కొనుగోలు కోసం దుకాణాలకు రావద్దని సూచించారు. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే నిరసన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బంగారు వర్తకుల సంఘం నాయకులు జయంత్ లాల్ జైన్, రాజ్‌కుమార్ జైన్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.