సాక్షి, ముంబై: నగర శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న ఉప్పు భూముల్లో నివాస గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ బృహత్ నిర్ణయం వల్ల శివారు ప్రాంతాల్లో వృథాగా ఉన్న సుమారు మూడు వేల ఎకరాల స్థలాలు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించేందుకు మార్గం సుగమమైందన్నారు.
నగరంలో సొంత గూడు లేక అద్దె ఇంట్లో ఉంటున్న వేలాది పేదలకు గిట్టుబాటయ్యే ధరలకు ఈ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుకానుంది. ముంబై చుట్టూ ఉన్న సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న స్థలాల్లో రైతులు ఉప్పు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడ ఉప్పు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి కొన్ని ఎకరాల స్థలాలు వృథాగా ఉన్నాయి. ఈ స్థలాల్లో గృహ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇందుకోసం మూడు వేల ఎకరాల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పేరుపై బదిలీ చేయడానికి ఆమోదం లభించింది. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల స్థలాలపై గత కొంత కాలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది.
అందులో మూడు వేల ఎకరాల స్థలాలపై నివాస సముదాయాలు నిర్మించేందుకు మార్గం సుగమమైంది. నగరానికి ఆనుకుని ఉన్న 10 శివారు ప్రాంతాల్లో 59 చోట్ల స్థలాలున్నాయి. వీటిని అభివృద్ధి పనుల కోసం ఖాళీ చేస్తే అనేక ఎకరాల స్థలాలు అందుబాటులోకి వస్తాయి. ఇదే తరహాలో మూతపడిన మిల్లు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని మాడా ద్వారా ట్రాన్సిట్ క్యాంపులు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంది.
ఈ మూడు వేల ఎకరాల స్థలాల్లో 1,672 ఎకరాల స్థలం మాత్రమే ఇళ్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉందనే విషయం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. మిగతా భూములు నివాసాలకు పనికిరావని తేలింది. అయితే ఆ స్థలాలను రాళ్లు, మట్టితో నింపితే కొంత ఉపయోగపడవచ్చని స్పష్టం చేసింది. మొత్తం స్థలాల్లో 31 శాతం నివాసాలకు, మిగతా వాణిజ్య, పరిశ్రమలు, ఇతర సంస్థలకు వినియోగించుకోవచ్చని తెలిపింది.
నివాసాలుగా ఉప్పు భూములు
Published Tue, Jan 28 2014 11:04 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Advertisement