అకాల వర్షాలకు కుదేలైన రైతులకు ఢిల్లీ సర్కార్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
♦ త్వరలోనే ప్రకటిస్తామన్న సీఎం కేజ్రీవాల్
♦ రైతులకు భరోసా ఇవ్వాలని సూచన
♦ వెంటనే తోడ్పాటు అందిచాలి: మాకెన్
న్యూఢిల్లీ: అకాల వర్షాలకు కుదేలైన రైతులకు ఢిల్లీ సర్కార్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ‘అనుకోని వడగళ్ల వానలతో పంటలు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అతి త్వరలోనే ఉపశమన ప్యాకేజీ ప్రకటిస్తుంది.’ అని ఢిల్లీ ముఖ్య మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలోని గ్రామ నియోజకవర్గాలైన మాటియాలా, నజాఫ్‌ఘర్, ముంద్కా, నరేలా ఎమ్మెల్యేలతో శుక్రవారం భేటీ అయ్యారు. దేశ రాజధాని శివారుల్లో ఉండే తమ నియోజకవర్గాలే వర్షాల వల్ల సష్టపోయాయని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు.
ప్రభుత్వం బాధిత రైతుల వెంట ఉందనే భరోసా ఇవ్వండని కేజ్రీవాల్ వారికి సూచించారు. ప్రభుత్వం త్వరలోనే బాధిత రైతులు నష్ట పరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకుంటుందనే ధైర్యం ఇవ్వాలని పురమాయించారు. అకాల వర్షాల వల్ల వేల ఎకరాల పంట భూములు నాశనమయ్యాయని సీఎంకు నజాఫ్‌ఘర్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ వివరించారు. బాధితులందరినీ ఆదుకుంటామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.
ప్రభావిత గ్రామాలను సందర్శించిన మాకెన్
వర్షాల ప్రభావిత మూడు గ్రామాలను ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ సందర్శించారు. బాధిత రైతులకు వెంటనే ప్రత్యేక తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.