ఘనంగా ఫ్రెషర్స్ డే
కొరుక్కుపేట: కళాశాల స్థాయిలో ర్యాగింగ్ సంప్రదాయానికి చరమాంకం పలికే విధంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల విద్యార్థినులు కొత్త ఒర వడికి నాంది పలికారు. ఈ మేరకు సీనియర్ విద్యార్థినులు ఫ్రెషర్స్‌కు ఘన స్వాగతం పలికారు. చెన్నై, ప్యారీస్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో కొత్తగా చేరిన డిగ్రీ విద్యార్థినులకు స్వాగతం పలికే విధంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల వాతావరణంలోనికి అడుగుపెడుతున్న విద్యార్థినులకు అంతా శుభం జరగాలని కోరుతూ సీనియర్లు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోకి కొత్తగా చేరిన విద్యార్థినులను తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు.
అనంతరం విద్యార్థినులను కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహనశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ పి.బి.వనిత, కరస్పాండెంట్ కృష్ణారావు, అధ్యాపకులు, సీనియర్ విద్యార్థినులు ఘనస్వాగతం పలికారు. ర్యాగింగ్‌కు చరమాంకం పలికేలా మనమందరం స్నేహభావంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చే విధంగా నూతన విద్యార్థులకు సీనియర్లు చేసిన హంగామా ఆకట్టుకుంది. నూతన విద్యార్థినులకు రోజా పూలను అందించి తరగతి గదులకు ఆహ్వానించారు. కళాశాల ఆవరణలో కొత్త విద్యార్థినుల చేత మొక్కలను నాటించారు. ప్రిన్సిపాల్ మోహనశ్రీ మాట్లాడుతూ ఈ ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో 500 మంది చేరినట్లు తెలిపారు. నూతన విద్యార్థులకు అంతా శుభం జరగాలని, వారి లక్ష్యాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ విద్యార్థినులు వేసిన నృత్యాలు అలరించాయి. కళాశాల అధ్యాపకులు డాక్టర్ మైథిలీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.