‘ముత్తూట్’ దొంగల కోసం.. ‘గ్రేహౌండ్స్’
- నక్సలైట్లను గాలించేవారు తొలిసారిగా నిందితుల కోసం రంగంలోకి..
- టాక్టికల్ వింగ్‌లను కూడా బరిలోకి దింపిన సైబరాబాద్ పోలీసులు
- ‘పటాన్‌చెరు’ నుంచే వచ్చి.. వెళ్లినట్టుగా చెబుతున్న సీసీటీవీ ఫుటేజీలు
- దోపిడీ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం దొంగల పనేనని అనుమానం
సాక్షి, హైదరాబాద్: ‘ముత్తూట్ ఫైనాన్స్’లో భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. నక్సలైట్లను పట్టుకునేందుకు బరిలోకి దిగే వీరిని తొలిసారిగా ఓ దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దింపడం గమనార్హం. అలాగే నిందితులు తారసపడిన సమయంలో ఎదుర్కొనే తీరుపై శిక్షణ పొందిన ‘టాక్టికల్ వింగ్’ల ద్వారా కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం దోపిడీ సమయంలో నిందితులు వ్యవహరించిన తీరుతో సిమీ ఉగ్రవాదులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీకి వచ్చి.. వెళ్లిన తీరును పరిశీలించిన పోలీసులు వీరు పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉంటారన్న నిర్ధారణకు వచ్చారు.
పటాన్‌చెరు నుంచే రాక.. పోక
ముఠా సభ్యులు దోపిడీకి వినియోగించిన ఏపీ23ఎం3107 నంబర్ గల నల్ల కారు పటాన్‌చెరు నుంచే వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం ఉదయం 8.55 గంటలకు పటాన్‌చెరు దాటినట్టు, ఉదయం 8.59 నిమిషాలకు బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ముందు ఆగినట్టు సీసీటీవీ ఫుటేజీతో స్పష్టమవుతోంది. వారు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి బుధవారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఘటనాస్థలికి తొమ్మిది గంటలకు చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే పని ముగించుకుని తిరిగి పటాన్‌చెరు మీదుగానే 9.35 గంటలకు వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు చెబుతున్నాయి. శంకర్‌పల్లి మీదుగా వీరు వెళ్లిన వాహనం కర్ణాటకలోని సెడామ్ వరకు వెళ్లినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆ వాహనం ఎటు వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రం గంలోకి దిగిన 16 బృందాలు ఈ ముఠాను పట్టుకునేందుకు శతాథా ప్రయత్ని స్తున్నాయి. ముత్తూట్ సిబ్బంది చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వేసిన ఊహ చిత్రాలను కర్ణాటకలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపించారు.
‘రోడ్డు ప్రమాదం’వారి డ్రామానేనా...
దోపిడీ జరిగిన సమయంలోనే ముత్తూట్ కార్యాలయానికి సమీపంలో ఓ బైక్ ప్రమాదం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలంతా అక్కడే గుమికూడి ఉన్నారు. ఈ సమయంలోనే దొంగలు తమ పనికానిచ్చేసి ఎంచక్కా వెళ్లి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కావాలనే ఈ రోడ్డు ప్రమాదం నాటకానికి తెరలేపి భారీ దోపిడీ చేసి ఉంటారా? అన్న దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.