అయినా.. తగ్గలేదు!
అయినా.. తగ్గలేదు!
Published Tue, Oct 18 2016 11:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
గ్రీవెన్ సెల్‌కు 191 దరఖాస్తులు
కొత్త జిల్లాలు ఏర్పడినా గత స్థాయిలోనే రాక
వినతులు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో
హన్మకొండ అర్బన్ : వరంగల్ జిల్లా కలిసి ఉన్నప్పటికీ... విడిపోయి కొత్తగా ఏర్పడిన అర్బన్ జిల్లాలోనూ గ్రీవెన్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల సంఖ్యలో ఏ మాత్రం తేడా రాలేదు. 51మండలాలు ఉన్నప్పుడు వచ్చిన మాదిరిగానే 11 మండలాల వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం తొలిసారిగా నిర్వహించిన గ్రీవెన్స్ కు 191 దరఖాస్తులు రావడం గమనార్హం. ఉదయం 10.30 నుంచి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ లో వినతులు ఇచ్చేందుకు జనం క్యూలో నిలబడ్డారు. అయితే, కలెక్టర్ ఆమ్రపాలి 11.15 గంటలకు ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. జేసీ దయానంద్, డీఆర్వో శోభ ఇతర అధికారులు కూడా వినతిపత్రాలు స్వీకరించగా.. ప్రతీ దరఖాస్తును కలెక్టర్ నిశితంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. అయితే, కొన్ని దరఖాస్తులను కలెక్టర్ తన వద్దే ఉంచుకోవడం విశేషం. ఈ మేరకు గ్రీవెన్స్ కు వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు...
పహాణీలో పేర్లు రావట్లేదు..
మాకు గ్రామంలో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 1958నుంచి 2003వరకు మా కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయి. ఆ తర్వాత పహాణీల్లో ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు వస్తోంది. ఈ విషయంలో తహసీల్దార్, వీఆర్వోలకు చాలా సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
చిట్యాల పాపయ్య, పైడిపల్లి
నాలుగు నెలలుగా రేషన్ లేదు..
మాది కాజీపేట. రేషన్ షాపు నంబర్ 12లో మా కార్డు ఉంది. గత నాలుగు నెలలుగా మా కార్డు డిలీట్ అయ్యాయని సరుకులు ఇవ్వడంలేదు. గతంలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు చెప్పాం. అయినా ఫలితం లేదు. మాకు వెంటనే రేషన్ కార్డులు వచ్చేలా చూడాలి.
సిరిమళ్ల అనసూర్య, కాజీపేట
ఉద్యోగుల వేతనాలు ఇవ్వండి
సంవత్సర కాలంగా ఉన్న వేతన బకాయిలను చెల్లించాలి. గతంలో పీడీపై ఆరోపణలు రావడంతో మా వేతనాలు నిలిపివేశారు. ఆ తర్వాత ఇచ్చినా అరవై శాతమే చెల్లించారు. మిగతా 40 శాతం వేతనాలు వెంటనే చెల్లించేలా చూడాలి.
ఎన్ సీఎల్‌పీ ఉద్యోగులు
వరద బాధితులకు పరిహారం ఇవ్వండి
ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో నయీంనగర్ పెద్దమోరీ సమీప ప్రాంతాలో పూర్తిగా జలమయ్యాయి. తద్వారా తమ ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయినందున ఆదుకోవాలని స్థానిక కాలనీ ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితుల వెంట స్థానిక కార్పొరేటర్ దేవేందర్ ఉన్నారు.
40వ డివిజన్ ప్రజలు
పట్టా భూముల్లో నిర్మాణాలు తొలగించాలి
వరంగల్‌లోని సర్వేనెంబర్ 140, 142లోని పట్టాభూముల్లో సీపీఎం, సీపీఐ నాయకులు గుడిసెలు వేసుకున్నారు. ప్రస్తుతం శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో చాలాకాలం నుంచి అధికారులకు వినతులు ఇస్తున్నా సమస్య పరిష్కరం కావడం లేదు.
వెలుగు సుధాకర్, వరంగల్
మా సమస్యలు పరిష్కరించాలి
108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపు, పనికి తగిన వేతనం ఇవ్వాలనేది తమ డిమాండ్లు అని నాయకులు రమేష్, వెంకటేష్, సాంబయ్య, ప్రవీణ్, రాంబాబు తెలిపారు.
108 ఉద్యోగ సంఘం నాయకులు
ఎంజీఎంలో మందులు లేవు
పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాసుపత్రిలో గత 20 రోజుల నుంచి మందులు సరిగ్గా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో చొరవ తీసుకుని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, మంద వినోద్‌కుమార్, శ్రీనివాస్, రాజు, పోశాల పద్మ, వెంకటేశ్వరు తదితరులు కలెక్టర్‌ను కోరారు.
– గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల
సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు..
నాకు కాలు పూర్తిగా లేదు. పింఛన్ కోసం సదరం సర్టిఫికెట్ కావాలని ఎంజీఎంకు వెళ్తే ఇవ్వడం లేదు. గాయం ఉన్నందున ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటున్నారు. వాస్తవానికి నా కాలి గాయం పూర్తిగా తగ్గింది. అధికారులు సదరం సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్ వస్తుంది.
ఓరుగంటి రాజ్‌కుమార్, కాశిబుగ్గ
Advertisement