సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని పీయూసీ కాలేజీల్లో అతిథి ఉపన్యాసకులుగా పనిచేస్తున్న వారి గౌరవ వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఉన్నత విద్య శాఖ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే స్పష్టం చేశారు. గురువారం విధానపరిషత్‌తో శూన్యవేళ ఎమ్మెల్సీలు వై.ఎ.నారాయణస్వామి, అరుణ్‌షాపూర్, గణేష్ కార్ణిక్ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ అతిథి ఉపన్యాకులను ప్రభుత్వోద్యుగులుగా నియమించుకోవడం కుదరదని, అయితే వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవవేతనాన్ని మాత్రం పెంచనున్నట్లు చెప్పారు.
2,14,536 రోడ్డు ప్రమాదాలు
రాష్ట్రంలో 2009-2013 వరకూ 2,14,536 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పరిషత్‌కు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ వివరించారు. ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ పరిశీలనలో తేలిందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాల్లో 45,526 మంది చనిపోయారన్నారు. వీరిలో 38,607 మంది పురుషులుకాగా, మహిళలు 6,919 మంది ఉన్నారన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది 1016 హత్యాచార కేసులు నమోదయినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గణేష్ కార్ణిక్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ హత్యాచార కేసుల్లో 964 కేసుల్లో ప్రధాన దోషులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలోని పోలీసు శాఖలో మొత్తం 21,956 ఖాళీలు ఉన్నాయని పరిషత్‌కు లిఖిత పూర్వకంగా మంత్రి తెలియజేశారు. దశలవారిగా వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
భూమి లోపల నుంచి హైటెన్షన్ వైర్లు
హై టెన్షన్ వైర్ల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి డీ.కే శివకుమార్ తెలిపారు. సమస్య పరిష్కారంలో భాగంగా భూమి లోపల నుంచి హై టెన్షన్ వైర్లను తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఈ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉందన్నారు. పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రవేశ రుసుం మార్పు పరిశీలిస్తాం
మైసూరు ప్యాలెస్‌ను చూసేందుకు వచ్చే విదేశీ పర్యాటకుల ప్రవేశ రుసుంను మార్చే విషయం పరిశీలిస్తామని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. ప్యాలెస్‌ను చూడటానికి వచ్చే పర్యాటకులు ప్యాలెస్ విశేషాలను వివరించే ఆడియోకిట్‌ను తప్పక ఖరీదు చేయాలనే నిబంధన ఉందన్నారు. అంతేకాకుండా వారి నుంచి ఎక్కువ మొత్తంలో ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మరితిబ్బేగౌడ పరిషత్‌కు తెలియజేశారు. ఈ విషయమై పరిశీలించి చర్చలు తీసుకుంటామని పరిషత్‌కు మంత్రి తెలిపారు.
‘అతిథు’లకు గౌరవవేతనం పెంపు
Published Fri, Jan 31 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement