arvi Deshpande
-
మాటల యుద్ధం
శాసనమండలిలో రాష్ట్ర విద్యారంగానికి సంబంధించి సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రులు కిమ్మెన రత్నాకర్, ఆర్వీ దేశ్‌పాండే సమాధానలిచ్చారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లపై ఉన్న ఆరోపణలకు సంబంధించి మధుసూదన్ ప్రశ్నించినప్పుడు మాటల యుద్ధం కొనసాగింది. పరిస్థితి గందరగోళానికి దారితీయడంతో అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. - సాక్షి, బెంగళూరు ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు విడుదల చేయనున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... తమ ప్రాంతాల్లో పాఠశాల దుస్థితిని ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన వాటికి అదనమని పేర్కొన్నారు. ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అన్నారు. మూడు నెలల్లోపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన దాదాపు పూర్తి అవుతుందని అన్నారు. కాగా, రాష్ట్ర వ్యాపంగా 44,200 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ఉప కులపతులపై ఆరోపణలు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల(వీసీ)పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 17 విశ్వవిద్యాలయాలు ఉండగా మాజీ, ప్రస్తుత వీసీలలో ఎనిమిది మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. వీరికి సంబంధించి దర్యాప్తు నివేదికలు అందిన వెంటనే పరిషత్‌లో ప్రవేశపెడుతామన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగిందని, ఆ నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. దీంతో సభ్యులంతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ అధికారి అవినీతి సంబంధించి రిపోర్టు అందలేదని చెప్పడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇందుకు అధికార పక్షం అభ్యంతరం తెలిపారు. ఈ దశలో వాగ్వాదం చోటు చేసుకుని గందరగోళానికి దారితీసింది. చివరకు అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ‘డీమ్డ్’ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం డీమ్డ్ విశ్వవిద్యాలయాల వల్ల ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే అంగీకరించారు. అయితే ‘డీమ్డ్’కు అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది డీమ్డ్ యూనివర్శిటీలు ఉన్నాయన్నారు. కాగా, వివిధ పథకాల కింద ప్రతి ఏడాది రాష్ట్రంలోని వైద్య, దంతవైద్య, ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్య కోర్సులకు సంబంధించి దాదాపు 4,800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. -
సౌధ కిటకిట
ముగిసిన ఎన్నికల ప్రక్రియ కార్యాలయాలకు హాజరైన మంత్రులు సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువైన విధానసౌధ తిరిగి పూర్వ రూపును సంతరించుకుంటోంది. మంత్రులు, అధికారులు ఒక్కొక్కరుగా సౌధకు వస్తున్నారు. దీంతో వారితో కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే ప్రజలతో విధానసౌధ సోమవారం కిటకిటలాడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఒకటిన్నర నెలలుగా విధానసౌధలోని తమ కార్యాలయాల వైపు ఒక్క మంత్రి కూడా కన్నెత్తి చూడలేదు. అదేవిధంగా విధానసౌధలోని కార్యాలయాల్లో ఉన్న ఉన్నత ప్రభుత్వ అధికారుల్లో అధిక శాతం మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో విధానసౌధలోని మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకోవ డానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. దీంతో విధానసౌధ నెలన్నర రోజులుగా బోసిపోయి కనిపించింది. అయితే ఈనెల 17న రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అటుపై గుడ్‌ఫ్రైడే, శని, ఆది వారాలు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఎవరూ విధానసౌధ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండేతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా విధానసౌధలోని తమ కార్యాలయాలకు సోమవారం విచ్చేశారు. తమ శాఖల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు తదితర విషయాల అధికారులతో సమాలోచనలు జరిపారు. చాలా రోజుల తర్వాత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో తమ సమస్యలను చెప్పుకోవడానికి విధానసౌధకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో సౌధ చాలా రోజుల తర్వాత మొదటిసారిగా సోమవారం కిటకిటలాడింది. -
‘అతిథు’లకు గౌరవవేతనం పెంపు
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని పీయూసీ కాలేజీల్లో అతిథి ఉపన్యాసకులుగా పనిచేస్తున్న వారి గౌరవ వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఉన్నత విద్య శాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే స్పష్టం చేశారు. గురువారం విధానపరిషత్తో శూన్యవేళ ఎమ్మెల్సీలు వై.ఎ.నారాయణస్వామి, అరుణ్షాపూర్, గణేష్ కార్ణిక్ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ అతిథి ఉపన్యాకులను ప్రభుత్వోద్యుగులుగా నియమించుకోవడం కుదరదని, అయితే వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవవేతనాన్ని మాత్రం పెంచనున్నట్లు చెప్పారు. 2,14,536 రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో 2009-2013 వరకూ 2,14,536 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పరిషత్‌కు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ వివరించారు. ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ పరిశీలనలో తేలిందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాల్లో 45,526 మంది చనిపోయారన్నారు. వీరిలో 38,607 మంది పురుషులుకాగా, మహిళలు 6,919 మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 1016 హత్యాచార కేసులు నమోదయినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గణేష్ కార్ణిక్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ హత్యాచార కేసుల్లో 964 కేసుల్లో ప్రధాన దోషులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలోని పోలీసు శాఖలో మొత్తం 21,956 ఖాళీలు ఉన్నాయని పరిషత్‌కు లిఖిత పూర్వకంగా మంత్రి తెలియజేశారు. దశలవారిగా వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. భూమి లోపల నుంచి హైటెన్షన్ వైర్లు హై టెన్షన్ వైర్ల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి డీ.కే శివకుమార్ తెలిపారు. సమస్య పరిష్కారంలో భాగంగా భూమి లోపల నుంచి హై టెన్షన్ వైర్లను తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఈ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉందన్నారు. పరీక్షల వేళ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ రుసుం మార్పు పరిశీలిస్తాం మైసూరు ప్యాలెస్‌ను చూసేందుకు వచ్చే విదేశీ పర్యాటకుల ప్రవేశ రుసుంను మార్చే విషయం పరిశీలిస్తామని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. ప్యాలెస్‌ను చూడటానికి వచ్చే పర్యాటకులు ప్యాలెస్ విశేషాలను వివరించే ఆడియోకిట్ను తప్పక ఖరీదు చేయాలనే నిబంధన ఉందన్నారు. అంతేకాకుండా వారి నుంచి ఎక్కువ మొత్తంలో ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మరితిబ్బేగౌడ పరిషత్‌కు తెలియజేశారు. ఈ విషయమై పరిశీలించి చర్చలు తీసుకుంటామని పరిషత్‌కు మంత్రి తెలిపారు.