- ముగిసిన ఎన్నికల ప్రక్రియ
- కార్యాలయాలకు హాజరైన మంత్రులు
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువైన విధానసౌధ తిరిగి పూర్వ రూపును సంతరించుకుంటోంది. మంత్రులు, అధికారులు ఒక్కొక్కరుగా సౌధకు వస్తున్నారు. దీంతో వారితో కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే ప్రజలతో విధానసౌధ సోమవారం కిటకిటలాడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఒకటిన్నర నెలలుగా విధానసౌధలోని తమ కార్యాలయాల వైపు ఒక్క మంత్రి కూడా కన్నెత్తి చూడలేదు.
అదేవిధంగా విధానసౌధలోని కార్యాలయాల్లో ఉన్న ఉన్నత ప్రభుత్వ అధికారుల్లో అధిక శాతం మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో విధానసౌధలోని మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకోవ డానికి వచ్చే ప్రజల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. దీంతో విధానసౌధ నెలన్నర రోజులుగా బోసిపోయి కనిపించింది. అయితే ఈనెల 17న రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.
అటుపై గుడ్‌ఫ్రైడే, శని, ఆది వారాలు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఎవరూ విధానసౌధ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండేతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా విధానసౌధలోని తమ కార్యాలయాలకు సోమవారం విచ్చేశారు.
తమ శాఖల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు తదితర విషయాల అధికారులతో సమాలోచనలు జరిపారు. చాలా రోజుల తర్వాత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో తమ సమస్యలను చెప్పుకోవడానికి విధానసౌధకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో సౌధ చాలా రోజుల తర్వాత మొదటిసారిగా సోమవారం కిటకిటలాడింది.