
అనాథ పిల్లల కోసం ప్రార్థించా
మానవసేవే మాధవ సేవ అంటారు. అలాంటి మానవ సేవలోనూ ముందున్న నటి హన్సిక తన ప్రతి పుట్టిన రోజుకు ఒక అనాథను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే 30 మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని చేపట్టిన హన్సిక మాధవ సేవతో పాటు మానవ సేవను చేసుకున్నారు.
ఇటీవల ఆమె నటుడు కమలహాసన్, శివకార్తికేయన్‌లతో పాటు తిరుచెందూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం హన్సిక తన తల్లి మోనా, సోదరుడు ప్రసాద్‌లతో కలిసి తిరుచెందూర్‌లోని ఆరుముఖ కుమారస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.ఆలయ నిర్వాహకులకు ముందుగానే సమాచారం అందజేయడంతో హన్సికతో కుమారస్వామికి విశేష అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.హన్సిక కుమారస్వామికి ఆరు రకాల అభిషేకాలు చేశారు.
అలా సుమారు ఐదు గంటల సేపు విశేష పూజలు నిర్వహించారు. రెండు గంటల సేపు కుమారస్వామి ముందు ధ్యానంలో గడిపారు. తను దత్తత తీసుకున్న పిల్లల శ్రేయస్సు కోరుతూ కుమారస్వామిని ప్రార్థించినట్లు హన్సిక ఈ సందర్భంగా వెల్లడించారు. తిరుచెందూర్ కుమారస్వామిని దర్శించుకోవాలన్న తన చిరకాల కోరిక ఇప్పటికి నెరవేరిందని మనసుకు చాలా ప్రశాంత చేకూరినట్లుగా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం హన్సిక విజయ్ సరసన నటించిన భారీ సాంఘిక జానపద చిత్రం పులి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.