పరవళ్లు తొక్కుతున్న నదులు
Published Wed, Aug 7 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
తిరుచ్చి, తంజావూరు, అరియలూరు, నాగపట్నం, కరూర్ జిల్లాల్లోని నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. మెట్టూరు ఉబరి నీరు, కొల్లిడం నది, ముక్కొంబు, కళ్లనై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావేరి మంగళవారం కాస్త శాంతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి, చెన్నై: కర్ణాటక, కేరళలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. ప్రధానంగా మెట్టూరు డ్యాం పొంగి పొర్లుతోంది. కావేరి ఉగ్ర తాండవంతో డ్యాం నీటిమట్టం 121 అడుగులు దాటింది. పూర్తిస్థాయిలో 120 అడుగులు మాత్రమే నీటి నిల్వలు ఉండాల్సిన దృష్ట్యా మిగులు జలాల్ని బయటకు విడుదల చేస్తున్నారు. మెట్టూరు డ్యామ్‌లోకి మంగళవారం సెకనుకు 1.36 లక్షల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అలాగే సెకనుకు 1.21 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కావేరి మంగళవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. కృష్ణరాయసాగర్, కపిని డ్యామ్‌ల నుంచి నీటి విడుదల శాతాన్ని సెకనుకు 90 వేల ఘనపుటడుగులకు తగ్గించడమే ఇందుకు కారణం. అయితే కావేరిలో అంతకంటే ఎక్కువగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలో కురుస్తున్న వర్షాలే ఈ పరిస్థితికి కారణం.
పొంచివున్న ముప్పు
కావేరి నీటితో మెట్టూరు డ్యాం నిండింది. ఈ నీటిని సాగుబడి నిమిత్తం కాలువల ద్వారా ఓ వైపు, ఉబరి నీటిని 16 గేట్ల ద్వారా మరోవైపు బయటకు పంపుతున్నారు. దీంతో మెట్టూరు నుంచి సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల గుండా కావేరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఈ తీరంలోని కొల్లినడం నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగే కళ్లనై, ముక్కోం బు, మాయనూరు, పడనై డ్యామ్‌లు, ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కావేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
తిరుచ్చి వద్ద లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి పురాతన వంతెనల మీదుగా రాకపోకల్ని నిలుపుదల చేశారు. తీరవాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత కావేరి కళకళలాడుతుండడంతో తిరుచ్చి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా తంజావూరు, అరియలూరు మీదుగా నాగపట్నం వద్ద సముద్రంలో నీళ్లు కలవనున్నాయి. వృథా కాని రీతిలో తీరంలోని చెరువులు, చిన్నచిన్న జలాశయాలకు కాలువల ద్వారా నీటిని మళ్లించే పనిలో నీటిపారుదల శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి.
Advertisement