ముంబై : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కేవలం 20 రోజుల్లోనే నగర సాధారణ వర్షపాతంలో 54 శాతం మేర వర్షం కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. శాంటా క్రుజ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 137 మి.మీల వర్షం కురిసిందని, రాగల 24 గంటల్లో 150 మి.మీల మేర వర్షపాతం నమోదుకావచ్చని స్కైమెట్ తెలిపింది. సోమవారం ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాల కారణంగా ఈరోజు(మంగళవారం) కూడా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ముంబై యూనివర్సిటీలోని అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశారు.
ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డబ్బా వాలాలు కూడా ఈ రోజు తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నారు. పశ్చిమ రైల్వే మంగళవారం పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పట్టాలపై వర్షపు నీరు నిలవడంతో లోకల్ ట్రైన్‌లు అలస్యంగా నడుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మొకాలిలోతు మేర నీరు చేరడంతో ప్రజలు తమ అవసరాల కోసం బయటకు రావాలంటే భయపడుతున్నారు. శనివారం సాయంత్రం రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా ఓ మహిళ బైక్‌పై నుంచి కిందపడి ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలసిందే. ఇప్పటికే గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోగా, పలు బ్రిడ్జిలకు పగుళ్లు వచ్చాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు పడుతాయని వాతవరణ శాఖ తెలిపింది. అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment