కొడనాడుపై ఐటీ కన్ను
► నిందితుని వాంగ్మూలంతో తనిఖీలు
► పోలీసులకు సైతం ప్రవేశం నో
► సమస్యగా మారిన సయాన్ ఆస్పత్రి బిల్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు సంచలనాలకు మించి సంచలనాలకు దారితీస్తుండగా కొడనాడు ఎస్టేట్‌పై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) సైతం గురిపెట్టినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఎస్టేట్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించగా వారంతా ఐటీ అధికారులుగా అనుమానిస్తున్నారు. నీలగిరి జిల్లా కొడనాడులో జయలలితకు సొంతమైన ఎస్టేట్‌లోకి గత నెల 23వ తేదీన 11 మందితో కూడిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డును హతమార్చి, మూడు గదుల్లోని దాచి ఉంచిన భారీ నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు.
ఈ కేసుకు సంబంధించి 9 మంది అరెస్ట్ కాగా, జయలలిత కారు మాజీ డ్రైడర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరో వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత, శశికళ పడక గదుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు కంటైనర్ లారీల్లో పట్టుబడిన రూ.570 కోట్లలో మిగిలిన రూ.900 కోట్ల నగదు ఎస్టేట్‌లోని అనేక గదుల్లో దాచిపెట్టి ఉండగా, ఈ సొత్తును దోచుకునేందుకే ఎస్టేట్‌లోకి జొరబడినట్లు పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసులకు చెప్పారు. అంతేగాక ఎస్టేట్‌లోని అనేక ర్యాకులు, సూట్‌కేసుల్లోని కట్టలు కట్టలు నగుదును చూసి తాము బిత్తరపోయామని వారు తెలిపారు.
ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు 3 వాహనాల్లో కొడనాడు ఎస్టేట్‌లోకి వెళ్లారు. ఈ రెండు వాహనాల్లో సుమారు పది మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు లోపలికి వెళ్లగా 11 ప్రవేశద్వారాలను మూసివేశారు. ఇతరులు ఎవ్వరూ ప్రవేశించగకుండా సుమారు అరకిలోమీటరు దూరంలో బ్యారికేడ్లను అడ్డుగా పెట్టి పట్టపగలు అంతాగోప్యంగా సాగడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
దీంతో పెద్ద ఎత్తున పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎస్టేట్ వద్ద గుమిగూడారు. అయితే ఎస్టేట్‌లోని వ్యక్తులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. ఎస్టేట్‌లో తనిఖీలు జరుగుతున్నాయాని కోయంబత్తూరు ఐటీ అధికారిని ప్రశ్నించగా తమ కార్యాలయం నుండి ఎవ్వరూ వెళ్లలేదు, చెన్నై నుండి ఎవరైనా వచ్చారా అనే సమాచారం తన వద్ద లేదని అన్నాడు. ఎస్టేట్ లోపల ఐటీ తనిఖీలు సాగుతున్నాయని ఎవ్వరూ ధృవీకరించలేదు.
సయాన్ బిల్లు కట్టం : తల్లిదండ్రులు
ఇదిలా ఉండగా, ఎస్టేట్ దోపిడీలో ప్రధాన నిందితుడు సయాన్ కోయంబత్తూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో గత 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అతనికి ఊపిరితిత్తులు, వీపుపై ఏర్పడిన గాయానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇంత వరకు సయాన్‌కు జరిగిన చికిత్సకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చయింది. విరిగిన కాలు ఎముకకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన చికిత్సకు డబ్బు కట్టాల్సిందిగా సయాన్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
‘పాల్‌ఘాట్‌లోని ఆసుపత్రిలో చేర్చకుండా ఎందుకు కోయంబత్తూరు తీసుకెళ్లారు. మమ్మల్ని సంప్రదించకుండా ప్రయివేటు ఆసుప్రతిలో ఎందుకు చేర్చారు, మా వద్ద డబ్బులు లేవు మీరే కట్టుకోండి’ అని పోలీసులకు సమాధానం ఇచ్చారు. సయాన్‌ను కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే ఎస్టేట్ దోపిడీ రహస్యాలు బైటకు పొక్కుతాయని వెనకడుగు వేస్తున్నారు. సయాన్ ఆరోగ్యం కుదుటపడగానే దోపిడీపై వాంగ్మూలం సేకరించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి ఉంటుంది. డబ్బులు కడితేనే ఆసుపత్రి వారు డిశ్చార్జ్‌కు అనుమతిస్తారు. సయాన్ బిల్లు సమస్యను ఎలా అ«ధిగమించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.