ఈ డ్యూటీలు మాకొద్దు | Accused in Kodanad Estate murder case brought to Kotagiri | Sakshi
Sakshi News home page

ఈ డ్యూటీలు మాకొద్దు

Published Fri, May 5 2017 2:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ఈ డ్యూటీలు మాకొద్దు - Sakshi

ఈ డ్యూటీలు మాకొద్దు

►  హడలెత్తిస్తున్న కొడనాడు ఎస్టేట్‌
► కట్టలు..కట్టలుగా నగదు
► శిరతావూరు బంగ్లాలో డ్యూటీలొద్దంటూ పోలీసుల వేడుకోలు
► నిందితులకు మాజీ మంత్రి సహకారం!


దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్, బంగ్లా అంటేనే పోలీసులు హడలిపోతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, దోపిడీలతో బెంబేలెత్తిపోతున్నారు. అమ్మకు చెందిన శిరతావూరు బంగ్లాలో భయం..భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ డ్యూటీలు మాకొద్దు బాబోయ్‌.. అంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. కొడనాడు సంఘటన నిందితులు పారిపోయేందుకు మాజీ మంత్రి సహకరించినట్లు బైటపడడంతో పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అధికారిక లెక్కల ప్రకారం రూ.130 కోట్ల స్థిర, చరాస్థులు ఉన్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనపుడు జయ ఇంటి నుంచి కోట్లరూపాయల విలువైన నగలు, పట్టు చీరలు, చెప్పులు తదితర వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వస్తువులు బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు విచారణలో తీర్పు వెలువడి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ జైలు కెళ్లారు. జయ మరణంతో ఆమె వారసులకు ఈ సొత్తును అందజేసేందుకు కోర్టు నిరీక్షిస్తోంది.

ఇదిలా ఉండగా, జయలలితకు స్థిరాస్థుల్లో ఒకటైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోకి ఇటీవల పది మంది దుండగులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ను కిరాతకంగా హతమార్చారు. మరో గార్డు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. 13 ప్రవేశ ద్వారాలు, వాటికున్న సెక్యూరిటీ గార్డులను దుండగులు ఏమాత్రం లెక్కచేయకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా, జయలలితకు చెందిన చెన్నై సమీపంలో శిరుతావూరులోని మరో బంగ్లాకు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను భయాందోళనలకు గురి చేసింది. ఈ బంగ్లాకు ఒక డీఎస్పీ, నలుగురు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు చూస్తున్నారు.

జయలలిత మరణం తరువాత కూడా భారీ బందోబస్తు కొనసాగుతోంది. బంగ్లా చుట్టూ ఆరుచోట్ల కుర్చీలు వేసుకుని పంటభూముల వైపు వెళ్లే ప్రజలను, ఇళ్ల స్థలాల కోసం వచ్చేవారిని విచారించి గానీ అనుమతించడం లేదు. కొడనాడు ఘటన తరువాత వీరిలో భయం పట్టుకుంది. తమను మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మీకు ఎటువంటి ప్రమాదం లేదు, ధైర్యంగా ఉండండి అని అధికారులు సముదాయించి పంపుతున్నారు. ఒక పోలీసు కానిస్టేబుల్‌ మాట్లాడుతూ, వర్దా తుపాన్‌ వచ్చినపుడు గొడుగులు కూడా లేకుండా వందమంది బందోబస్తు విధులు నిర్వర్తించగా, కనీసం ఒక్క అధికారి కూడా తమను పరామర్శించలేదని వాపోయాడు. రాత్రి వేళల్లో పనిచేసేవారికి కనీసం టార్చ్‌లైట్లు కూడా ఇవ్వలేదని అన్నాడు.

శశికళ బంధువులు తరచూ వచ్చి వెళుతున్నారు, జయలలితకు సంబంధించిన ప్రాంతాల్లో తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నామని చెప్పాడు. ప్రభుత్వానికి సంబంధించని వారు నివసించిన ఈ బంగ్లాకు పోలీసు బందోబస్తు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలు డబ్బు:
కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా దాచిపెట్టిన డబ్బును దోచుకునేందుకే సాహసం చేశామని ఈ సంఘటనలో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులు వాంగ్మూలంలో చెప్పారు. కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీలో 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 8,9 నిందితులు జమ్షీర్‌ ఆలి (32),  జిత్తన్‌జాయ్‌ (20)లను పోలీసులు విచారించగా అనేక విషయాలను బైటపెట్టారు. కొడనాడు ఎస్టేట్‌ గురించి తమకు పెద్దగా తెలియదు, జయలలిత కారు డ్రైవర్‌ కనకరాజ్‌ నేతృత్వంలో తాము పనిచేశామని తెలిపారు. మనోజ్‌ నాయకత్వంలో మొత్తం 9 మంది కేరళ నుంచి వచ్చామని తెలిపారు.

ఎస్టేట్‌లోకి ప్రవేశించేపుడు సెక్యూరీటీ గార్డులు అడ్డుకోగా కనకరాజ్‌ వారితో సంప్రదింపులు జరిపి లక్షల రూపాయలు ఇస్తాని ఆశపెట్టినట్లు చెప్పారు. అయితే వారు నిరాకరించడంతో దుడ్డుకర్రలతో తలపై మోదగా స్పృహతప్పిపోయారని తెలిపారు. స్పృహరాగానే ఒక సెక్యూరిటీ గార్డు పారిపోగా, మరో గార్డు ఓం బహదూరును కత్తితో నరికి చంపివేసినట్లు తెలిపారు.

ఎస్టేట్‌ భవంతితోని జయలలిత, శశికళ బెడ్‌రూంలలోకి ప్రవేశించి అక్కడి ర్యాక్, సూట్‌కేసుల్లో కట్టలు కట్టలుగా నగదు,  మరో మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు ఉండగా, వాటిని కనకరాజ్‌ తీసుకుని అందరం కలిసి తెల్లారేలోగా తప్పించుకున్నుట్లు వారు తెలిపారు. కొడనాడు ఎస్టేట్‌ నుంచి దొంగలించిన నగదు నుంచి కనకరాజ్‌ తమకు చెరి రూ.2లక్షలు ఇచ్చాడని, మిగిలిన సొత్తు, డాక్యుమెంట్లు ఆయన వద్దనే ఉన్నాయని వివరించారు. కోవై ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్న మరో ప్రధాన నిందితుడు సయాన్‌ ప్రాణాలు కాపాడితేగానీ కేసు చిక్కుముడి వీడదని పోలీసులు భావిస్తూ వైద్యులకు సూచిస్తున్నారు.

మాజీ మంత్రికి సంబంధాలు:
 నిందితులు జమ్షీర్‌ ఆలి (32),  జిత్తన్‌జాయ్‌ (20)లను పోలీసులు విచారించే ముందు వారి సెల్‌ఫోన్‌ నంబర్లను తనిఖీ చేయగా తమిళనాడుకు చెంది ఒక మాజీ మంత్రి పేరు బైటపడినట్లు తెలుస్తోంది. కొడనాడు సంఘటన జరిగిన తరువాత వీరిద్దరూ పారిపోతుండగా వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నారు.

తమకు పలానా మాజీ మంత్రి తెలుసని సెల్‌ఫోన్‌ ద్వారా సంప్రదించారు, సదరు మాజీ మంత్రి వారిద్దరూ తనకు తెలిసిన వారు అని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు. అయితే ఆ తరువాత కేరళలో పట్టుకున్నారు. దీంతో కొడనాడు సంఘటనలో రాజకీయ ప్రముఖల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకుని మాజీ మంత్రిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement