Kodanadu estate
-
జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసులో అనేక రహస్యాలు పాతి పెట్టబడ్డాయని, పునర్విచారణతో వెలుగులోకి వస్తున్నాయని పోలీసుల తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్య, దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదంగా మరణించడంతో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ కేసును గత పాలకులు మమా అనిపించారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు ఈ ఘటనపై పునర్విచారణ చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువు వివేక్‌తోపాటుగా 230 మందిని విచారణ వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పునర్విచారణను త్వరితగతిన ముగించే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది హసన్ మహ్మద్ జిన్నా హాజరై కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ఈ కేసులో అనేక రహస్యాలు, సమాచారాలు పాతి పెట్టబడ్డాయని, ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నట్టు వివరించారు. విచారణ సరైన కోణంలో వెళ్తోందని, ఈ సమయంలో ఎలాంటి గడువు విధించవద్దని కోరారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు -
సంచలన కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్‌లో ఉన్న పలటియల్ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంతరంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్‌లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ -
బెయిల్ రద్దు చేయండి మహాప్రభో..!
సాక్షి, చెన్నై: తనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. కొడనాడు కేసు నిందితుడు ఊటీ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. వివరాలు.. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గతంలో జరిగిన హత్య, దోపిడీ గురించి తెలిసిందే. ఈ కేసులో సయన్, మనోజ్‌తో పాటుగా పలువురిని అరెస్టు చేసి పోలీసులు కేసును ముగించారు. అయితే, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఈ కేసు మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ వేగవంతం అయిన నేపథ్యంలో బెయిల్ మీదున్న నిందితులు ఒకొక్కరుగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని విచారణ బృందానికి తెలియజేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అరెస్టయ్యి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన వాలయార్ మనోజ్ తాజాగా తన బెయిల్ ను రద్దు చేయాలని, కటకటాల్లోకి నెట్టాలని ఊటీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే, మనోజ్‌కు బెయిల్ ఇచ్చిన క్రమంలో కొన్ని కఠిన నిబంధనల్ని కోర్టు విధించింది. వీటి ప్రకారం కేరళకు చెందిన ఈ మనోజ్ ఊటీలోనే ఉండాల్సి ఉంటుంది. తాజాగా తనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి, కటకటాల్లోకి నెట్టాలని మనోజ్ వేడుకోవడం వెనుక ఈ నిబంధనలూ ఓ కారణంగా తేలింది. బుధవారం దాఖలు చేసిన తన పిటిషన్లో మనోజ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు ఊటీలో బస చేయడానికి అద్దె గదులు కూడా ఇవ్వడం లేదని, తినేందుకు ఆహారం కూడా కరువైందని, విచారణ ఓ వైపు ఉంటే, ఆకలి కష్టాలు మరోవైపు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని పేర్కొన్నాడు. కాగా ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టాలని ఊటీ కోర్టు నిర్ణయించింది. -
కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరించి.. ప్రతిపక్షంపై కుట్రలకు పాల్పడుతోందని అన్నాడీఎంకే ఆరోపించింది. ఈమేరకు ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవాలని గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను గురువారం చెన్నైలో కలిసి వినతిపత్రం సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అప్పుడప్పుడూ నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లో విశ్రాంతి కోసం వెళ్లేవారు. ఆమె మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాలకు సంబంధించి సయాన్ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. బెయిల్‌పై బయట ఉన్న సయాన్‌ను పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. ఒక ముఖ్యనేత ఆదేశాల మేరకే కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో దాచి ఉంచిన ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లేందుకు వెళ్లినప్పుడు.. సెక్యూరిటీ గార్డును హత్యచేసినట్లు ఆ కేసులో ప్రధాన నిందితుడైన సయాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆస్తి పత్రాలను ఎడపాడికి అందజేసినట్లు కూడా అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ అంశాన్ని బుధవా రం నాటి అసెంబ్లీ సమావేశంలో ఎడపాడి లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవడంతో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం సహా పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు చెన్నైలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను గురువారం కలుసుకున్నారు. మా నేతలపై తప్పుడు కేసులు– ఎడపాడి అన్నాడీఎంకే నేతలపై డీఎంకే ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి, కుట్రపూరిత చర్యలకు పాల్పడు తోందని గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎడపాడి పళనిస్వామి మీడియా వద్ద ఆరోపించారు. తమ పారీ్టకి చెందిన మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి ఇళ్లలో డీఎంకే ప్రభుత్వం తనిఖీలు చేయించి అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం ఇంకా కొనసాగుతోందని అన్నారు. కొడనాడు కేసు కోర్టులో విచారణ తుదిదశకు చేరుకోగా, ప్రభుత్వం కొత్తగా విచారణ ప్రారంభించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొన్నామని సీఎం స్టాలిన్ సమర్థించుకుంటున్నారు. కాగా నిందితులంతా కేరళకు చెందిన పాత నేరస్తులని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎడపాడి దుయ్యబట్టారు. ఈ కేసులో తనతోపాటూ కొందరు అన్నాడీఎంకే నేతలను సైతం ఇరికించే ప్రయత్నాలు సాగుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. డీఎంకే ప్రభుత్వ కక్షసాధింపు ధోరణిని అడ్డుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సమరి్పంచామని ఎడపాడి వెల్లడించారు. -
‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్‌లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్మెన్ ఓం బహదూర్ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్ అనే మరో వాచ్మెన్ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పే వీడియోలు.. అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్‌లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్‌లో ఉండేవని మాథ్యూస్ తెలిపారు. ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు. -
నిఘా నీడలో కొడనాడు
► ప్రత్యేక చెక్ పోస్టులు ► సీసీ కెమెరాలు ► భద్రత కట్టుదిట్టం సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ను నిఘా వలయంలోకి తీసుకొచ్చేందుకు నీలగిరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రత్యేక చెక్ పోస్టులు ఆ మార్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. 20 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉన్న నీలగిరి జిల్లా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ కోతగిరి సమీపంలోని కొడనాడు ఎస్టేట్ తేయాకు తోటల నడుమ సుందరంగా రూపుదిద్దుకుని ఉంది. 1,600 ఎకరాల విస్తీర్ణంలో పన్నెండుకు పైగా మార్గాలతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఈ పరిసరాలు కనిపిస్తుంటాయి. తేయాకు తోటల మధ్య ఓ పాత బంగ్లా, మరో కొత్త బంగ్లా, సమీపంలో హెలిప్యాడ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 55 వేల చదరపు అడుగులతో నిర్మితమైన కొత్త బంగ్లా అమ్మ జయలలితకు ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. అమ్మ బతికి ఉన్నంత కాలం ఈ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నాయి. 80 వరకు నిఘా నేత్రాలు అప్పట్లో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు సంకేతాలున్నాయి. అయితే, ఇప్పుడు అక్కడ అవేమీ లేవు. అమ్మ లేని దృష్ట్యా, భద్రతను వెనక్కు తీసుకుని ప్రైవేటు సేనలను రంగంలోకి దించారు. ఇదే అదనుగా గత నెల ఈ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఓం బహూదూర్ హత్య, దోపిడీ, నిందితుడి అనుమానస్పద మృతి, ప్రమాదాలు...ఇలా ఒకదాని తర్వాత మరో ఘటన వెలుగు చూస్తుండడంతో కొడనాడులో ఏదో మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం ఊపందుకుంది. బుధవారం అయితే, ఇక్కడ ఐటీ దాడులు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఖండించారు. అయితే, ఆ బంగ్లాలోకి వాహనాల్లో వచ్చి వెళ్లిన వాళ్లు ఎవరో అన్న ప్రశ్న బయలు దేరింది. అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు మానవ రహిత(డ్రోన్) విమానాల్లో పొందుపరిచిన కెమెరాల ద్వారా ఎస్టేట్‌ను అనుక్షణం పరిశీలిస్తున్నట్టు వెలుగులోకి రావడంతో నీలగిరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరుస ఘటనలు, రోజుకో ఆరోపణలు, తేయాకు రోజుకు వెయ్యి కిలోల మేరకు మాయం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి నిర్ణయించారు. నీలగిరి ఎస్పీ మురళీ రంభ ఆదేశాల మేరకు భద్రతావలయంలోకి కొడనాడును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మార్గాల్లో శుక్రవారం నుంచి తాత్కాలిక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలాగే, 20 చోట్ల నిఘా కెమెరాల్ని అమర్చి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆ కొడనాడు వైపుగా ఏ వాహనం వచ్చినా పూర్తి వివరాలు సేకరించడం, అటు వైపుగా ఇతర వాహనాల పయనం సాగినా, వాటి నంబర్ల నమోదు, అందులో ఉన్న వారి వివరాలు, ఇలా ముందు జాగ్రత్తగా అన్ని భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. -
కొడనాడుపై ఐటీ కన్ను
► నిందితుని వాంగ్మూలంతో తనిఖీలు ► పోలీసులకు సైతం ప్రవేశం నో ► సమస్యగా మారిన సయాన్ ఆస్పత్రి బిల్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు సంచలనాలకు మించి సంచలనాలకు దారితీస్తుండగా కొడనాడు ఎస్టేట్‌పై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) సైతం గురిపెట్టినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఎస్టేట్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించగా వారంతా ఐటీ అధికారులుగా అనుమానిస్తున్నారు. నీలగిరి జిల్లా కొడనాడులో జయలలితకు సొంతమైన ఎస్టేట్‌లోకి గత నెల 23వ తేదీన 11 మందితో కూడిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డును హతమార్చి, మూడు గదుల్లోని దాచి ఉంచిన భారీ నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది అరెస్ట్ కాగా, జయలలిత కారు మాజీ డ్రైడర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరో వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత, శశికళ పడక గదుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు కంటైనర్ లారీల్లో పట్టుబడిన రూ.570 కోట్లలో మిగిలిన రూ.900 కోట్ల నగదు ఎస్టేట్‌లోని అనేక గదుల్లో దాచిపెట్టి ఉండగా, ఈ సొత్తును దోచుకునేందుకే ఎస్టేట్‌లోకి జొరబడినట్లు పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసులకు చెప్పారు. అంతేగాక ఎస్టేట్‌లోని అనేక ర్యాకులు, సూట్‌కేసుల్లోని కట్టలు కట్టలు నగుదును చూసి తాము బిత్తరపోయామని వారు తెలిపారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు 3 వాహనాల్లో కొడనాడు ఎస్టేట్‌లోకి వెళ్లారు. ఈ రెండు వాహనాల్లో సుమారు పది మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు లోపలికి వెళ్లగా 11 ప్రవేశద్వారాలను మూసివేశారు. ఇతరులు ఎవ్వరూ ప్రవేశించగకుండా సుమారు అరకిలోమీటరు దూరంలో బ్యారికేడ్లను అడ్డుగా పెట్టి పట్టపగలు అంతాగోప్యంగా సాగడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎస్టేట్ వద్ద గుమిగూడారు. అయితే ఎస్టేట్‌లోని వ్యక్తులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. ఎస్టేట్‌లో తనిఖీలు జరుగుతున్నాయాని కోయంబత్తూరు ఐటీ అధికారిని ప్రశ్నించగా తమ కార్యాలయం నుండి ఎవ్వరూ వెళ్లలేదు, చెన్నై నుండి ఎవరైనా వచ్చారా అనే సమాచారం తన వద్ద లేదని అన్నాడు. ఎస్టేట్ లోపల ఐటీ తనిఖీలు సాగుతున్నాయని ఎవ్వరూ ధృవీకరించలేదు. సయాన్ బిల్లు కట్టం : తల్లిదండ్రులు ఇదిలా ఉండగా, ఎస్టేట్ దోపిడీలో ప్రధాన నిందితుడు సయాన్ కోయంబత్తూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో గత 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అతనికి ఊపిరితిత్తులు, వీపుపై ఏర్పడిన గాయానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇంత వరకు సయాన్కు జరిగిన చికిత్సకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చయింది. విరిగిన కాలు ఎముకకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన చికిత్సకు డబ్బు కట్టాల్సిందిగా సయాన్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ‘పాల్‌ఘాట్‌లోని ఆసుపత్రిలో చేర్చకుండా ఎందుకు కోయంబత్తూరు తీసుకెళ్లారు. మమ్మల్ని సంప్రదించకుండా ప్రయివేటు ఆసుప్రతిలో ఎందుకు చేర్చారు, మా వద్ద డబ్బులు లేవు మీరే కట్టుకోండి’ అని పోలీసులకు సమాధానం ఇచ్చారు. సయాన్‌ను కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే ఎస్టేట్ దోపిడీ రహస్యాలు బైటకు పొక్కుతాయని వెనకడుగు వేస్తున్నారు. సయాన్ ఆరోగ్యం కుదుటపడగానే దోపిడీపై వాంగ్మూలం సేకరించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి ఉంటుంది. డబ్బులు కడితేనే ఆసుపత్రి వారు డిశ్చార్జ్‌కు అనుమతిస్తారు. సయాన్ బిల్లు సమస్యను ఎలా అ«ధిగమించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
క్రైం సినిమాలా కొడనాడు
► నిందితుడు సయాన్‌పై హత్యాయత్నం ► పొల్లాచ్చి నేత పాత్రపై నిందితుని వాంగ్మూలం ► శశికళను విచారించనున్న పోలీస్ అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీగార్డు హత్య తదనంతర పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఈ సంఘటనల వెనుక అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రితోపాటు పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం జరగడం అధికార పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తుండగా, ప్రధాన నిందితుడు సయాన్‌పై హత్యాయత్నం జరగడం రాష్ట్రంలో కలకలం రేపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: కొడనాడు ఎస్టేట్ సంఘటనలో మొత్తం 11 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడైన జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్ కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. కనకరాజ్ తరువాత ద్వితీయ సూత్రధారి సయాన్‌పై పోలీసులు ఆధారపడి ఉన్నారు. దోపిడీ ఉదంతానికి ముఖ్యసాక్షిగా భావిస్తూ, అతను కోలుకుంటే అనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సయాన్ చికిత్స పొందుతున్న కోయంబత్తూరులోని ఒక ప్రయివేటు ఆçస్పత్రి గోడ దూకి గుర్తు తెలియని యువకుడు గురువారం అర్ధరాత్రి ప్రవేశించాడు. యువకుడు రావడం గుర్తించిన పోలీసులు వెంటపడడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆస్పత్రి గోడను దూకే క్రమంలో ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు కోవై ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 25 ఏళ్లు కలిగిన ఆ వ్యక్తి కేరళకు చెందిన యువకుడుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను స్పృహలో లేనందున పోలీసుల విచారణకు సాధ్యం కాలేదు. దోపిడీలో పొల్లాచ్చి నేత: నిందితుని వాంగ్మూలం తమిళనాడు పోలీసులు కేరళలో అరెస్ట్ చేసిన మరో నిందితుడు మనోజ్‌ను పోలీసులు విచారించగా పలు రహస్యాలను వెల్లడించాడు. ప్రత్యేకంగా ఎటువంటి ఉద్యోగం, వృత్తి లేని తాను తమిళనాడులో రేషన్ బియ్యంను కేరళకు అక్రమంగా తరలించి జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పాడు. కేరళ–కోయంబత్తూరు సరిహద్దులో నివస్తుండే తనకు కేరళ రాష్ట్రం తిరుచందూరుకు చెందిన సయాన్, జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్‌తో స్నేహం ఏర్పడిందని తెలిపాడు. వీరి ద్వారా తమిళనాడు పొల్లాచ్చికి చెందిన అన్నాడీఎంకే ముఖ్యనేతతోనూ పరిచయమైందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి ఉన్నతపదవిలో ఉన్నట్లు తెలిపాడు. కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీకి సహకరించాలని కనకరాజ్ కోరడంతో ఎనిమిది మందితో కూడిన కిరాయి గ్యాంగును కేరళ నుంచి రప్పించినట్లు ఒప్పుకున్నాడు. తనను పోలీసులు వెంటాడుతున్నారని తెలుసుకుని పొల్లాచ్చి నేతను ఆశ్రయించగా, ప్రస్తుతం తాను ఏ వర్గంలో ఉన్నానో కూడా తెలియడం లేదు, సెల్ఫోన్లో మాట్లాడితే పోలీసులు ట్రాక్ చేస్తారు, కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండమని ఆయన సలహా ఇచ్చాడని మనోజ్ పోలీసులకు వివరించాడు. మనోజ్ ఇచ్చిన వాంగ్యూలం ఆధారంగా శశికళ, ఇళవరసిలతోపాటూ పొల్లాచ్చి నేతను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న టింబర్ వ్యాపారి సజీవన్ దుబాయ్ నుండి కోయంబత్తూరుకు వచ్చి మీడియాతో మాట్లాడారు. 2006–11 మధ్య కాలంలో కొడనాడు ఎస్టేట్‌లో చెక్కపని చేసేందుకు వెళ్లానని, నా పనితీరును జయలలిత, శశికళ మెచ్చుకున్నారని తెలిపాడు. ఎస్టేట్ బంగ్లా గురించి అణువణువూ తనకు తెలుసనే విషయాన్ని కొట్టివేయడం లేదు, అయితే కొడనాడు బంగ్లా తనకు ఆలయం వంటిదైతే జయలలిత దైవంతో సమానంగా భావిస్తున్నానని అన్నాడు. దోపిడి జరిగినపుడు తాను దుబాయ్‌లో ఉండటంతో సందేహిస్తున్నారని చెప్పాడు. ప్రస్తుతం కొడనాడు ఎస్టేట్ బంగ్లా శశికళ చేతుల్లో ఉందని, ఆమె నియమించిన వారే అక్కడ విధులు నిర్వరిస్తున్నారని అన్నాడు. కేసు దిశ మారుస్తున్నారు: మిల్లర్ కొడనాడు సంఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మిల్లర్ ఖండించారు. కేసు విచారణ సరైన కోణంలో సాగుతూ అసలు నేరస్తులను పోలీసుల సమీపిస్తున్న దశలో కొందరు వ్యక్తులు విచారణ దిశను మారుస్తూ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. -
ఈ డ్యూటీలు మాకొద్దు
► హడలెత్తిస్తున్న కొడనాడు ఎస్టేట్ ► కట్టలు..కట్టలుగా నగదు ► శిరతావూరు బంగ్లాలో డ్యూటీలొద్దంటూ పోలీసుల వేడుకోలు ► నిందితులకు మాజీ మంత్రి సహకారం! దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్, బంగ్లా అంటేనే పోలీసులు హడలిపోతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, దోపిడీలతో బెంబేలెత్తిపోతున్నారు. అమ్మకు చెందిన శిరతావూరు బంగ్లాలో భయం..భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ డ్యూటీలు మాకొద్దు బాబోయ్.. అంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. కొడనాడు సంఘటన నిందితులు పారిపోయేందుకు మాజీ మంత్రి సహకరించినట్లు బైటపడడంతో పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అధికారిక లెక్కల ప్రకారం రూ.130 కోట్ల స్థిర, చరాస్థులు ఉన్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనపుడు జయ ఇంటి నుంచి కోట్లరూపాయల విలువైన నగలు, పట్టు చీరలు, చెప్పులు తదితర వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వస్తువులు బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు విచారణలో తీర్పు వెలువడి శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలు కెళ్లారు. జయ మరణంతో ఆమె వారసులకు ఈ సొత్తును అందజేసేందుకు కోర్టు నిరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా, జయలలితకు స్థిరాస్థుల్లో ఒకటైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోకి ఇటీవల పది మంది దుండగులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ను కిరాతకంగా హతమార్చారు. మరో గార్డు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. 13 ప్రవేశ ద్వారాలు, వాటికున్న సెక్యూరిటీ గార్డులను దుండగులు ఏమాత్రం లెక్కచేయకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా, జయలలితకు చెందిన చెన్నై సమీపంలో శిరుతావూరులోని మరో బంగ్లాకు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను భయాందోళనలకు గురి చేసింది. ఈ బంగ్లాకు ఒక డీఎస్పీ, నలుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు చూస్తున్నారు. జయలలిత మరణం తరువాత కూడా భారీ బందోబస్తు కొనసాగుతోంది. బంగ్లా చుట్టూ ఆరుచోట్ల కుర్చీలు వేసుకుని పంటభూముల వైపు వెళ్లే ప్రజలను, ఇళ్ల స్థలాల కోసం వచ్చేవారిని విచారించి గానీ అనుమతించడం లేదు. కొడనాడు ఘటన తరువాత వీరిలో భయం పట్టుకుంది. తమను మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మీకు ఎటువంటి ప్రమాదం లేదు, ధైర్యంగా ఉండండి అని అధికారులు సముదాయించి పంపుతున్నారు. ఒక పోలీసు కానిస్టేబుల్ మాట్లాడుతూ, వర్దా తుపాన్ వచ్చినపుడు గొడుగులు కూడా లేకుండా వందమంది బందోబస్తు విధులు నిర్వర్తించగా, కనీసం ఒక్క అధికారి కూడా తమను పరామర్శించలేదని వాపోయాడు. రాత్రి వేళల్లో పనిచేసేవారికి కనీసం టార్చ్లైట్లు కూడా ఇవ్వలేదని అన్నాడు. శశికళ బంధువులు తరచూ వచ్చి వెళుతున్నారు, జయలలితకు సంబంధించిన ప్రాంతాల్లో తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నామని చెప్పాడు. ప్రభుత్వానికి సంబంధించని వారు నివసించిన ఈ బంగ్లాకు పోలీసు బందోబస్తు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలు డబ్బు: కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా దాచిపెట్టిన డబ్బును దోచుకునేందుకే సాహసం చేశామని ఈ సంఘటనలో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులు వాంగ్మూలంలో చెప్పారు. కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీలో 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. 8,9 నిందితులు జమ్షీర్ ఆలి (32), జిత్తన్‌జాయ్ (20)లను పోలీసులు విచారించగా అనేక విషయాలను బైటపెట్టారు. కొడనాడు ఎస్టేట్ గురించి తమకు పెద్దగా తెలియదు, జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ నేతృత్వంలో తాము పనిచేశామని తెలిపారు. మనోజ్ నాయకత్వంలో మొత్తం 9 మంది కేరళ నుంచి వచ్చామని తెలిపారు. ఎస్టేట్‌లోకి ప్రవేశించేపుడు సెక్యూరీటీ గార్డులు అడ్డుకోగా కనకరాజ్ వారితో సంప్రదింపులు జరిపి లక్షల రూపాయలు ఇస్తాని ఆశపెట్టినట్లు చెప్పారు. అయితే వారు నిరాకరించడంతో దుడ్డుకర్రలతో తలపై మోదగా స్పృహతప్పిపోయారని తెలిపారు. స్పృహరాగానే ఒక సెక్యూరిటీ గార్డు పారిపోగా, మరో గార్డు ఓం బహదూరును కత్తితో నరికి చంపివేసినట్లు తెలిపారు. ఎస్టేట్ భవంతితోని జయలలిత, శశికళ బెడ్రూంలలోకి ప్రవేశించి అక్కడి ర్యాక్, సూట్‌కేసుల్లో కట్టలు కట్టలుగా నగదు, మరో మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు ఉండగా, వాటిని కనకరాజ్ తీసుకుని అందరం కలిసి తెల్లారేలోగా తప్పించుకున్నుట్లు వారు తెలిపారు. కొడనాడు ఎస్టేట్ నుంచి దొంగలించిన నగదు నుంచి కనకరాజ్ తమకు చెరి రూ.2లక్షలు ఇచ్చాడని, మిగిలిన సొత్తు, డాక్యుమెంట్లు ఆయన వద్దనే ఉన్నాయని వివరించారు. కోవై ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్న మరో ప్రధాన నిందితుడు సయాన్ ప్రాణాలు కాపాడితేగానీ కేసు చిక్కుముడి వీడదని పోలీసులు భావిస్తూ వైద్యులకు సూచిస్తున్నారు. మాజీ మంత్రికి సంబంధాలు: నిందితులు జమ్షీర్ ఆలి (32), జిత్తన్‌జాయ్ (20)లను పోలీసులు విచారించే ముందు వారి సెల్‌ఫోన్ నంబర్లను తనిఖీ చేయగా తమిళనాడుకు చెంది ఒక మాజీ మంత్రి పేరు బైటపడినట్లు తెలుస్తోంది. కొడనాడు సంఘటన జరిగిన తరువాత వీరిద్దరూ పారిపోతుండగా వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. తమకు పలానా మాజీ మంత్రి తెలుసని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించారు, సదరు మాజీ మంత్రి వారిద్దరూ తనకు తెలిసిన వారు అని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు. అయితే ఆ తరువాత కేరళలో పట్టుకున్నారు. దీంతో కొడనాడు సంఘటనలో రాజకీయ ప్రముఖల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకుని మాజీ మంత్రిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, వాచ్‌మన్ హత్య
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం గుట్టుచప్పుడు కాకుండా ముందుగా ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ మాయం చేస్తున్నారు. అందులోభాగంగా సోమవారం తెల్లవారుజామున కొడనాడులో జయలలితకు అత్యంత ఇష్టమైన ఎస్టేట్‌లో దోపిడీ జరిగింది. అక్కడున్న ఇద్దరు వాచ్‌మన్‌లపై తీవ్రంగా దాడిచేసి వారిలో ఒకరిని చంపి ఎస్టేట్‌లో ఉన్న కీలకమైన పత్రాలను తీసుకెళ్లిపోయారు. సుమారు వారం రోజుల క్రితమే చెన్నై శివార్లలోని సిరుతాపూర్ బంగ్లాకు నిప్పు పెట్టినప్పుడు కూడా అందులో కొన్ని పత్రాలు కాలిపోయాయి, మరికొన్ని మాయమయ్యాయి. ఇప్పుడు కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ జరిగినా.. అందులో పత్రాలు తప్ప మరేమీ పోలేదు. ఈ ఎస్టేట్‌లో జయలలితకు అత్యంత నమ్మకస్తుడైన ఓం బహదూర్ అనే నేపాలీ వ్యక్తి గత 30 ఏళ్లుగా కాపలా ఉంటున్నాడు. అతడిని హతమార్చి, అతడితో పాటు ఉన్న మరో వాచ్‌మన్‌ను తీవ్రంగా గాయపరిచిన దుండగులు.. ఎస్టేట్‌లో జయలలిత ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి చాలా వర్గాలు ప్రయత్నించాయి. కొన్ని ఆస్తులు ప్రస్తుతం శశికళ వర్గీయుల చేతుల్లో ఉన్నాయి. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోటలు, సిరుతాపూర్ బంగ్లా, చెన్నై పోయెస్ గార్డెన్స్.. వీటన్నింటి విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు వీటిమీద హక్కుల కోసం తెరవెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వరుసపెట్టి దాడులు, పత్రాల చోరీ జరుగుతున్నట్లు జయలలిత సన్నిహితులు చెబుతున్నారు. -
జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, వాచ్‌మన్ హత్య