
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసులో అనేక రహస్యాలు పాతి పెట్టబడ్డాయని, పునర్విచారణతో వెలుగులోకి వస్తున్నాయని పోలీసుల తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్య, దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదంగా మరణించడంతో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ కేసును గత పాలకులు మమా అనిపించారు.
ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు ఈ ఘటనపై పునర్విచారణ చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువు వివేక్‌తోపాటుగా 230 మందిని విచారణ వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పునర్విచారణను త్వరితగతిన ముగించే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు.
ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది హసన్ మహ్మద్ జిన్నా హాజరై కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ఈ కేసులో అనేక రహస్యాలు, సమాచారాలు పాతి పెట్టబడ్డాయని, ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నట్టు వివరించారు. విచారణ సరైన కోణంలో వెళ్తోందని, ఈ సమయంలో ఎలాంటి గడువు విధించవద్దని కోరారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు.
చదవండి: పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు