Jayalalithaa death case
-
అన్నీ రహస్యాలే.. జయ లలిత కేసులో అసలేం జరిగింది?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదని.. ఆమె మరణం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని జయ అభిమానులు ఆరేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ డెత్ మిస్టరీ కేసును పరిశోధించిన జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. శశికళ పాత్రపై దర్యాప్తు జరపాల్సిందేనన్న కమిటీ సిఫారసు కొత్త మంటలు రాజేసింది. చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ 2016 సెప్టెంబరు 22న నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ లతో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు తెలిసినా.. అంతా నిగూఢమే. సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బానే ఉందని రెండు మూడు రోజుల పాటు చెప్పుకొచ్చినా.. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెప్పారు. రోజుకో మలుపు నవంబరు 13న అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఆమె తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొనడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమవుతానని వెల్లడించినట్టు పేర్కొన్నారు. రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బానే ఉందని చెబుతూ వచ్చారు. పక్కా స్క్రిప్టింగ్ ప్రజలను ఊరడించడానికన్నట్లు రోజుకో సమాచారాన్ని కొద్దికొద్దిగా విడుదల చేశారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని.. వెల్లడించారు. నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది. చిత్రంగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. పుకార్లు షికార్లు ఇన్ని మలుపులు తిరగడంతో తమిళనాట రక రకాల పుకార్లు షికార్లు చేశాయి. జయలలితపై విష ప్రయోగం చేసిందని కొందరు ప్రచారం చేశారు. రోజుల తరబడి స్లో పాయిజన్ ఇచ్చి జయలలితను మట్టుబెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని పార్టీలో జయ విధేయులు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి. ఇంట్లో గొడవ జరిగిందా? జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా కుట్రలు జరిగాయని పుకార్లు పుట్టాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళపైనే ఎక్కుపెట్టారు. చెలి నెచ్చెలి జయలలితకు శశికళ తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే జయలలితను అడ్డు పెట్టుకుని శశికళ కుటుంబం ప్రభుత్వంలో చొచ్చుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పించడానికి కుట్ర పన్నినట్లు నిఘా బృందాలు ఉప్పందించాయి. ఈ పరిస్థితుల్లో శశికళ కుటుంబాన్ని ఇంటి నుండి సాగనంపారు జయలలిత. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మన్నార్ గుడి మాఫియాకు అడ్డుకట్ట వేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత శశికళకు మళ్లీ ఇంట్లో చోటిచ్చారు జయ. అదే జయలలిత కెరీర్ లో అతి పెద్ద తప్పిదమని శశికళను వ్యతిరేకించే వర్గాలు అంటాయి. నివేదికలో ఉన్నవేంటీ? ♦జయలలిత డిసెంబరు 4న మరణిస్తే డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు. ♦జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేదానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొన్నారు. ♦వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు ఎందుకు చేయలేదో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ♦ఆమెకు సరైన వైద్యం అందలేదని కూడా అన్నారు. ♦జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది లగాయితు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీగానే ఉంది జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. శరీరంపై గాట్లేంటీ? జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి? ఏమైనా గాయాలా? గాయాలైతే ఎవరు చేశారు? అన్న అనుమానాలు చక్కర్లు తిరిగాయి. అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అన్నారు. అంతలోనే రాజకీయమా? జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళ నాట అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రజలకైతే నిజాలు కావాలి. జయలలితను జీవితాంతం ఆదరించిన అభిమానులకు ఏం జరిగిందో తెలియాలి. తమ అభిమాన నాయకురాలి మరణ వార్త వెనుక కుట్ర ఉందంటేనే వారు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తేనే వారికి కొంతైనా తృప్తి ఉంటుంది. -
జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసులో అనేక రహస్యాలు పాతి పెట్టబడ్డాయని, పునర్విచారణతో వెలుగులోకి వస్తున్నాయని పోలీసుల తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్య, దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదంగా మరణించడంతో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ కేసును గత పాలకులు మమా అనిపించారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు ఈ ఘటనపై పునర్విచారణ చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువు వివేక్‌తోపాటుగా 230 మందిని విచారణ వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పునర్విచారణను త్వరితగతిన ముగించే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది హసన్ మహ్మద్ జిన్నా హాజరై కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ఈ కేసులో అనేక రహస్యాలు, సమాచారాలు పాతి పెట్టబడ్డాయని, ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నట్టు వివరించారు. విచారణ సరైన కోణంలో వెళ్తోందని, ఈ సమయంలో ఎలాంటి గడువు విధించవద్దని కోరారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు -
జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ విచారణ జోరును పెంచింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డిలకు శుక్రవారం సమన్లు జారీచేయడం ద్వారా విచారణ కీలకదశకు చేరుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ అనారోగ్యం, 75 రోజుల తరువాత ఆకస్మిక మరణం ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోసం తమిళనాడు ప్రభుత్వం తరపున వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు...ఇలా అమ్మకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందింది. జయకు కేవలం జ్వరం, డీ హైడ్రేషన్లతో స్వల్ప అనారోగ్యమేనని చేరిన వెంటనే అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. నిజాన్ని దాచాల్సి వచ్చింది.. అయితే అదంతా అబద్దమని, వాస్తవానికి జయ విషమ పరిస్థితిలో చేరారని అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జయకు తీవ్ర అనారోగ్యం అని ప్రకటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తుతాయనే ఆలోచనతో నిజాన్ని దాచాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతకు కొన్నినెలల ముందే మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సైతం అమ్మ ఆరోగ్యం విషయంలో అనేక అబద్ధాలు ఆడాం, మన్నించండి అని బహిరంగసభలో ప్రజలను వేడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు.. పెనుభూతాల నడుమ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 25వ తేదీన జయ మరణంపై విచారణ కమిషన్ వేసింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ ప్రారంభించారు. డీఎంకే వైద్యవిభాగ కార్యదర్శి డాక్టర్ శరవణన్ కమిషన్ ముందు హాజరై...అమ్మ చనిపోయిన స్థితిలో వేలిముద్రలు సేకరించి ఉప ఎన్నికలకు బీ ఫారం విడుదల చేశారని వాంగ్మూలం ఇచ్చి సంచలనం రేపారు. ఆ తరువాత జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ సీఎస్‌లు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు తదితర ముఖ్యులు తమ వాంగ్మూలం ఇచ్చారు. విచారణలో కీలక ఘట్టం.. ఇదిలా ఉండగా, విచారణలో భాగంగా శశికళ, ప్రతాప్ సీ రెడ్డి, ప్రీతారెడ్డిలకు కమిషన్ శుక్రవారం సమన్లు పంపడంతో జయ మరణంపై జరుగుతున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. జయ ఆసుపత్రికి వచ్చినపుడే విషమపరిస్థిలో ఉన్నారని ప్రతాప్ సీ రెడ్డి చెప్పగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఇంట్లో జయకు ఏమి జరిగిందనే ప్రశ్న తలెత్తింది. జయకు సీరియస్ అయిన సమయంలో శశికళ మాత్రమే ఉంది. జయ ఆసుపత్రిలో ఉండగా ఆమెకు అందుతున్న వైద్యసేవలను అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, అపోలో గ్రూప్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి పర్యవేక్షించారు. దీంతో విచారణ కమిషన్ ఈ ముగ్గురికీ సమన్లు జారీచేసింది. బెంగళూరు జైలు అధికారుల ద్వారా శశికళకు ఈ సమన్లు అందాయి. 15 రోజుల్లోగా బదులివ్వాలని శశికళను కమిషన్ ఆదేశించింది. శశికళ తరఫున ముందుగా ఆమె న్యాయవాది హాజరై వాంగ్మూలం ఇస్తారు. అందుకు కమిషన్ సంతృప్తి చెందని పక్షంలో శశికళను నేరుగా పిలిపించుకుని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారని సమాచారం. అలాగే ప్రతాప్ సీ రెడ్డికి పదిరోజుల గడువు ఇచ్చారు. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన కమిషన్ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే జయకు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన అన్ని బులెటిన్లు పదిరోజుల్లోగా కమిషన్ కు అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రీతారెడ్డి సమన్ల వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, జయవిచారణ కమిషన్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మూడునెలల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అనేక అంశాలు విచారణ రావాల్సిన కారణంగా గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
‘అమ్మకు ప్రతిరూపం చిన్నమ్మ’
చెన్నై: జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే నాయకురాలు సీఆర్ సరస్వతి అన్నారు. జయ మృతిపై అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం వాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వమే సమాచారం తీసుకుందని వెల్లడించారు. న్యాయస్థానం అవసరమనుకుంటే కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు. శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి గుర్తు చేశారు. చిన్నమ్మ.. అమ్మ ప్రతిరూపమని, ఆమె పార్టీని సమర్థవంతంగా నడపగలరని పేర్కొన్నారు. జయలలిత మరణంపై అన్నాడీఎంకే కార్యకర్తల్లో అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన జోసఫ్ తరపు న్యాయవాది గీత అన్నారు. జయ మరణం వెనుకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. జయను అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు. జయ స్నేహితురాలు శశికళ నటరాజన్, సీఎం పన్నీరు సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పీసీ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చినట్టు లాయర్ గీత వెల్లడించారు.