‘అమ్మకు ప్రతిరూపం చిన్నమ్మ’
చెన్నై: జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నాడీఎంకే నాయకురాలు సీఆర్ సరస్వతి అన్నారు. జయ మృతిపై అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం వాఖ్యానించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వమే సమాచారం తీసుకుందని వెల్లడించారు. న్యాయస్థానం అవసరమనుకుంటే కేంద్రం నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని సూచించారు. శశికళ నాయకత్వ పటిమ గురించి జయలలితే పలుమార్లు చెప్పారని సరస్వతి గుర్తు చేశారు. చిన్నమ్మ.. అమ్మ ప్రతిరూపమని, ఆమె పార్టీని సమర్థవంతంగా నడపగలరని పేర్కొన్నారు.
జయలలిత మరణంపై అన్నాడీఎంకే కార్యకర్తల్లో అనుమానాలున్నాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన జోసఫ్ తరపు న్యాయవాది గీత అన్నారు. జయ మరణం వెనుకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. జయను అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు. జయ స్నేహితురాలు శశికళ నటరాజన్, సీఎం పన్నీరు సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పీసీ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చినట్టు లాయర్ గీత వెల్లడించారు.