సాక్షి, చెన్నై: తనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. కొడనాడు కేసు నిందితుడు ఊటీ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. వివరాలు.. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గతంలో జరిగిన హత్య, దోపిడీ గురించి తెలిసిందే. ఈ కేసులో సయన్, మనోజ్‌తో పాటుగా పలువురిని అరెస్టు చేసి పోలీసులు కేసును ముగించారు. అయితే, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఈ కేసు మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు.
విచారణ వేగవంతం అయిన నేపథ్యంలో బెయిల్ మీదున్న నిందితులు ఒకొక్కరుగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని విచారణ బృందానికి తెలియజేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అరెస్టయ్యి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన వాలయార్ మనోజ్ తాజాగా తన బెయిల్ ను రద్దు చేయాలని, కటకటాల్లోకి నెట్టాలని ఊటీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే, మనోజ్‌కు బెయిల్ ఇచ్చిన క్రమంలో కొన్ని కఠిన నిబంధనల్ని కోర్టు విధించింది.
వీటి ప్రకారం కేరళకు చెందిన ఈ మనోజ్ ఊటీలోనే ఉండాల్సి ఉంటుంది. తాజాగా తనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి, కటకటాల్లోకి నెట్టాలని మనోజ్ వేడుకోవడం వెనుక ఈ నిబంధనలూ ఓ కారణంగా తేలింది. బుధవారం దాఖలు చేసిన తన పిటిషన్‌లో మనోజ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు ఊటీలో బస చేయడానికి అద్దె గదులు కూడా ఇవ్వడం లేదని, తినేందుకు ఆహారం కూడా కరువైందని, విచారణ ఓ వైపు ఉంటే, ఆకలి కష్టాలు మరోవైపు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని పేర్కొన్నాడు. కాగా ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టాలని ఊటీ కోర్టు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment