క్రైం సినిమాలా కొడనాడు
► నిందితుడు సయాన్‌పై హత్యాయత్నం
► పొల్లాచ్చి నేత పాత్రపై నిందితుని వాంగ్మూలం
► శశికళను విచారించనున్న పోలీస్
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీగార్డు హత్య తదనంతర పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఈ సంఘటనల వెనుక అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రితోపాటు పలువురు నేతలు ఉన్నట్లు ప్రచారం జరగడం అధికార పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తుండగా, ప్రధాన నిందితుడు సయాన్‌పై హత్యాయత్నం జరగడం రాష్ట్రంలో కలకలం రేపింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొడనాడు ఎస్టేట్ సంఘటనలో మొత్తం 11 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడైన జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్ కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. కనకరాజ్ తరువాత ద్వితీయ సూత్రధారి సయాన్‌పై పోలీసులు ఆధారపడి ఉన్నారు. దోపిడీ ఉదంతానికి ముఖ్యసాక్షిగా భావిస్తూ, అతను కోలుకుంటే అనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో సయాన్ చికిత్స పొందుతున్న కోయంబత్తూరులోని ఒక ప్రయివేటు ఆçస్పత్రి గోడ దూకి గుర్తు తెలియని యువకుడు గురువారం అర్ధరాత్రి ప్రవేశించాడు. యువకుడు రావడం గుర్తించిన పోలీసులు వెంటపడడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆస్పత్రి గోడను దూకే క్రమంలో ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు కోవై ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 25 ఏళ్లు కలిగిన ఆ వ్యక్తి కేరళకు చెందిన యువకుడుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను స్పృహలో లేనందున పోలీసుల విచారణకు సాధ్యం కాలేదు.
దోపిడీలో పొల్లాచ్చి నేత: నిందితుని వాంగ్మూలం
తమిళనాడు పోలీసులు కేరళలో అరెస్ట్ చేసిన మరో నిందితుడు మనోజ్‌ను పోలీసులు విచారించగా పలు రహస్యాలను వెల్లడించాడు. ప్రత్యేకంగా ఎటువంటి ఉద్యోగం, వృత్తి లేని తాను తమిళనాడులో రేషన్ బియ్యంను కేరళకు అక్రమంగా తరలించి జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పాడు. కేరళ–కోయంబత్తూరు సరిహద్దులో నివస్తుండే తనకు కేరళ రాష్ట్రం తిరుచందూరుకు చెందిన సయాన్, జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్‌తో స్నేహం ఏర్పడిందని తెలిపాడు. వీరి ద్వారా తమిళనాడు పొల్లాచ్చికి చెందిన అన్నాడీఎంకే ముఖ్యనేతతోనూ పరిచయమైందని చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్యక్తి ఉన్నతపదవిలో ఉన్నట్లు తెలిపాడు. కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీకి సహకరించాలని కనకరాజ్ కోరడంతో ఎనిమిది మందితో కూడిన కిరాయి గ్యాంగును కేరళ నుంచి రప్పించినట్లు ఒప్పుకున్నాడు. తనను పోలీసులు వెంటాడుతున్నారని తెలుసుకుని పొల్లాచ్చి నేతను ఆశ్రయించగా, ప్రస్తుతం తాను ఏ వర్గంలో ఉన్నానో కూడా తెలియడం లేదు, సెల్‌ఫోన్‌లో మాట్లాడితే పోలీసులు ట్రాక్ చేస్తారు, కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండమని ఆయన సలహా ఇచ్చాడని మనోజ్ పోలీసులకు వివరించాడు. మనోజ్ ఇచ్చిన వాంగ్యూలం ఆధారంగా శశికళ, ఇళవరసిలతోపాటూ పొల్లాచ్చి నేతను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న టింబర్ వ్యాపారి సజీవన్ దుబాయ్ నుండి కోయంబత్తూరుకు వచ్చి మీడియాతో మాట్లాడారు. 2006–11 మధ్య కాలంలో కొడనాడు ఎస్టేట్‌లో చెక్కపని చేసేందుకు వెళ్లానని, నా పనితీరును జయలలిత, శశికళ మెచ్చుకున్నారని తెలిపాడు. ఎస్టేట్ బంగ్లా గురించి అణువణువూ తనకు తెలుసనే విషయాన్ని కొట్టివేయడం లేదు, అయితే కొడనాడు బంగ్లా తనకు ఆలయం వంటిదైతే జయలలిత దైవంతో సమానంగా భావిస్తున్నానని అన్నాడు. దోపిడి జరిగినపుడు తాను దుబాయ్‌లో ఉండటంతో సందేహిస్తున్నారని చెప్పాడు. ప్రస్తుతం కొడనాడు ఎస్టేట్ బంగ్లా శశికళ చేతుల్లో ఉందని, ఆమె నియమించిన వారే అక్కడ విధులు నిర్వరిస్తున్నారని అన్నాడు.
కేసు దిశ మారుస్తున్నారు: మిల్లర్
కొడనాడు సంఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మిల్లర్ ఖండించారు. కేసు విచారణ సరైన కోణంలో సాగుతూ అసలు నేరస్తులను పోలీసుల సమీపిస్తున్న దశలో కొందరు వ్యక్తులు విచారణ దిశను మారుస్తూ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.