
నిఘా నీడలో కొడనాడు
► ప్రత్యేక చెక్ పోస్టులు
► సీసీ కెమెరాలు
► భద్రత కట్టుదిట్టం
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ను నిఘా వలయంలోకి తీసుకొచ్చేందుకు నీలగిరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రత్యేక చెక్ పోస్టులు ఆ మార్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. 20 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉన్న నీలగిరి జిల్లా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ కోతగిరి సమీపంలోని కొడనాడు ఎస్టేట్ తేయాకు తోటల నడుమ సుందరంగా రూపుదిద్దుకుని ఉంది. 1,600 ఎకరాల విస్తీర్ణంలో పన్నెండుకు పైగా మార్గాలతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఈ పరిసరాలు కనిపిస్తుంటాయి. తేయాకు తోటల మధ్య ఓ పాత బంగ్లా, మరో కొత్త బంగ్లా, సమీపంలో హెలిప్యాడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 55 వేల చదరపు అడుగులతో నిర్మితమైన కొత్త బంగ్లా అమ్మ జయలలితకు ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. అమ్మ బతికి ఉన్నంత కాలం ఈ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నాయి. 80 వరకు నిఘా నేత్రాలు అప్పట్లో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు సంకేతాలున్నాయి.
అయితే, ఇప్పుడు అక్కడ అవేమీ లేవు. అమ్మ లేని దృష్ట్యా, భద్రతను వెనక్కు తీసుకుని ప్రైవేటు సేనలను రంగంలోకి దించారు. ఇదే అదనుగా గత నెల ఈ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు ఓం బహూదూర్ హత్య, దోపిడీ, నిందితుడి అనుమానస్పద మృతి, ప్రమాదాలు...ఇలా ఒకదాని తర్వాత మరో ఘటన వెలుగు చూస్తుండడంతో కొడనాడులో ఏదో మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం ఊపందుకుంది. బుధవారం అయితే, ఇక్కడ ఐటీ దాడులు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనిని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఖండించారు. అయితే, ఆ బంగ్లాలోకి వాహనాల్లో వచ్చి వెళ్లిన వాళ్లు ఎవరో అన్న ప్రశ్న బయలు దేరింది.
అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు మానవ రహిత(డ్రోన్) విమానాల్లో పొందుపరిచిన కెమెరాల ద్వారా ఎస్టేట్‌ను అనుక్షణం పరిశీలిస్తున్నట్టు వెలుగులోకి రావడంతో నీలగిరి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరుస ఘటనలు, రోజుకో ఆరోపణలు, తేయాకు రోజుకు వెయ్యి కిలోల మేరకు మాయం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి నిర్ణయించారు.
నీలగిరి ఎస్పీ మురళీ రంభ ఆదేశాల మేరకు భద్రతావలయంలోకి కొడనాడును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మార్గాల్లో శుక్రవారం నుంచి తాత్కాలిక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలాగే, 20 చోట్ల నిఘా కెమెరాల్ని అమర్చి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆ కొడనాడు వైపుగా ఏ వాహనం వచ్చినా పూర్తి వివరాలు సేకరించడం, అటు వైపుగా ఇతర వాహనాల పయనం సాగినా, వాటి నంబర్ల నమోదు, అందులో ఉన్న వారి వివరాలు, ఇలా ముందు జాగ్రత్తగా అన్ని భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు.