విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
చెన్నైలో ముంబయి ఫోన్ ప్రకంపనలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో బాంబులు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్స్ చెన్నై విమానాశ్రయంలో ప్రకంపనలు సృష్టించాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించి శనివారమంతా తనిఖీలు చేపట్టారు. దీంతో అన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి.
బెంగళూరు, ఢిల్లీ నుంచి బయలుదేరే జెట్ ఎయిర్‌వేస్ విమానాల్లో బాంబులు ఉన్నట్లు శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఒక అజ్ఞాత వ్యక్తి ముంబయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరే జెట్‌ఎయిర్‌వేస్ విమానాలతోపాటు అన్ని విమానాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ముంబయి, కోల్‌కత్తా, ఢిల్లీ, బెంగళూరు వెళ్లే విమానాలను ప్రత్యేకంగా పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు పోలీసు జాగిలాలతో ప్రయాణికుల లగేజీ, విమానాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.
విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేయనిదే అనుమతించలేదు. ద్రవ పదార్థాలతో పేలుడు సృష్టించే అవకాశాలను తోసిపుచ్చలేక అటువంటి అనుమానిత ద్రవపదార్థాలపై నిషేధం విధించారు. శనివారం తెల్లవారుజాము 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు నిరంతరంగా కొనసాగాయి. ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనిదే లోనికి అనుమతించలేదు. అనుమానితులను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి మరీ తనిఖీలు నిర్వహించారు. స్వదేశీ ప్రయాణికులు గంటకు బదులుగా గంటన్నర ముందుగా, అలాగే విదేశీ ప్రయాణికులు మూడుగంటలకు బదులుగా మరో అరగంట ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సందేశాలు పంపారు. విమానాశ్రయం నలుమూలల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు శనివారం రాత్రి 7 గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
హై అలర్ట్
Published Sun, Sep 6 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement