హైక్లాస్ దొంగలు
♦ ఫ్లైట్లో వచ్చి బెంగళూరులో చోరీలు
♦ రైల్లో ఫస్ట్‌క్లాస్‌లో తిరుగుముఖం!
♦ ఇద్దరు ఢిల్లీ చోరుల పట్టివేత
♦ రూ. 18 లక్షల సొత్తు స్వాధీనం
బనశంకరి : ఎంతో స్టైల్‌గా వ్యాపారవేత్తల తరహాలో ఇద్దరు వ్యక్తులు సూట్లు, బూట్లు ధరించి విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. విలాసవంతమైన హోటల్‌లో దిగి కొద్దిరోజుల తరువాత రైళ్లో మొదటి తరగతి టికెట్‌లు బుక్ చేసుకొని దర్జాగా తిరిగివెళ్లిపోతారు.అయితే ఇద్దరు ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చేది ఏదో వ్యాపారం అనుకుంటే పొరపాటే. వారు వచ్చేది బెంగళూరులో దొంగతనాలు చేయడానికి.ఢిల్లీకి చెందిన నహీమ్, ఉస్మాన్ అనే ఇద్దరు ఘరానా చోరులు బెంగళూరులో దిగిన తరువాత వీధి వీధి తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ఇంటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం తమ చేతివాటంతో ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకొని ఫస్ట్‌క్లాస్ రైళ్లో తిరిగి ఢిల్లీకి వెళ్లి విక్రయించి జల్సా జీవితాన్ని గడుపుతారు. ఇలా చోరీలకు బాగా అలవాటు పడ్డ
ఇద్దరు నిందితుల్లో ఒకడైన ఉస్మాన్ ఇటీవల బెంగళూరుకు చేరుకొని నగరంలోని సుబ్రహ్మణ్యపురలో చోరీలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్థానికులకు పట్టుబడడంతో దేహశుద్ది చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఖాకీలు తమదైన శైలిలో విచారణ చేయగా వీరు మామూలు దొంగలు కాదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి విమానాల్లో రాకపోలు సాగిస్తూ బెంగళూరును కొల్లగొడుతున్న వైనం వివరించాడు. మరో నిందితుడు నహీమ్ కూడా చోరీల్లో పాలుపంచుకున్నట్లు అంగీకరించాడు. నహీమ్ ఇటీవల బెంగళూరులోని పరప్పన జైల్లో బందీగా సహచరుడు ఉస్మాన్‌ను పరామర్శించడానికి వచ్చాడు. వెంటనే పోలీసులు నహీమ్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ దొంగల ద్వయం నుంచి రూ.18 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.