threfts
-
దర్జాగా చోరీలు!
మేడికొండూరు: వరుస దొంగతనాలతో మేడికొండూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గురువారం అర్థరాత్రి సిరిపురం వద్ద ఉన్న ఇందిరా ఏజెన్సీస్ దుకాణంలో దొంగలు విజృంభించి నాలుగు విలువైన టీవీలను అపహరించారు. గ్రామానికి చెందిన నాగభైరు సురేష్ ఇందిరా ఏజెన్సీస్ పేరిట ఎలక్ట్రానిక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కూత వేటు దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఏదో పని ఉందని వచ్చి చూసేసరకి షట్టరు తాళాలు పగలగొట్టటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం పరిసరాలను పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నమోదయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించి టివీలు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఒక వ్యక్తి ముఖానికి మాస్కు, చేతి వేలిముద్రలు పడకుండా గ్లౌజులు వేసుకొంటున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు నాలుగు విలువైన టీవీలు పోయాయని బాధితుడు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో పోలీసులు సరైన గస్తీ కాయకపోవడంతో దొంగలు విజృంభిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దొంగల బెడదతో రాత్రివేళల్లో నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బుర్ఖా గ్యాంగ్ అరెస్ట్
మంత్రాలయం రూరల్: బుర్ఖా వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను మంగళవారం మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ డి.రాము, ఎస్ఐ శ్రీనివాసనాయక్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కర్ణాటక నుంచి బుర్ఖా వేసుకుని చోరీలు చేసే కొంతమంది మహిళలు మంత్రాలయం వైపు వచ్చారని స్థానిక కానిస్టేబుల్ రంగన్నకు సమాచారం వచ్చింది. విషయాన్ని సీఐ, ఎస్‌ల దృష్టికి తీసుకుపోగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్, తుంగభద్ర నది తీరంలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రాయాచూర్లోని జహీరాబాద్ కాలనీకి చెందిన హుస్సేన్‌బీ, రహేనా, సుల్తానా, జైతున్బీ బుర్ఖాలు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారు. వీరిని ఎమ్మిగనూరు జడ్జి వాసుదేవ్ ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. దొంగ ముఠా సమాచాకాన్ని సేకరించిన కానిస్టేబుల్ రంగన్నకు సీఐ రివార్డు ప్రకటించారు. -
‘చోరీ’ సెర్చ్!
మలక్‌పేట ప్రాంతానికి చెందిన ప్రతాప్ ఆన్లైన్లో ఈ–కామర్స్ సైట్ ద్వారా సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొన్నాడు. కూకట్పల్లి నివాసి శ్రీకాంత్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి ఓ ద్విచక్ర వాహనం ఖరీదు చేశాడు. ఈ రెండూ చోరీ సొత్తులే కావడంతో కొన్ని రోజుల తర్వాత వీరి వద్దకు వచ్చిన పోలీసులు రికవరీ చేసుకువెళ్లారు. అవి చోరీ వస్తువులని తెలియక కొన్నామని మొత్తుకున్నా ఫలితం లేదు. దీంతో అటు ఖరీదు చేయడానికి వెచ్చించిన డబ్బు, ఇటు వస్తువు రెండూ నష్టపోవాల్సి వచ్చింది. సెకండ్ హ్యాండ్లో ఏదైనా సెల్‌ఫోన్, వాహనం ఖరీదు చేసే ముందు అవి ఎక్కడైనా చోరీకి గురైనవా? కాదా? అని తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం లేని కారణంగానే ఇలా జరిగింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఓ సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’లో ఈమేరకు ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్త వస్తువుల క్రమవిక్రయాలు ఏ స్థాయిలో జరుగుతాయో... సెకండ్ హ్యాండ్ మార్కెట్ సైతం దాదాపు అదే స్థాయిలో ఉంటోంది. తరచు వాహనం/సెల్‌ఫోన్ మోడల్స్‌ను మార్చడం కొందరికి హాబీ కావడంతో పాటు కొత్తవి కొనుగోలు చేసుకునే స్థోమత లేని వాళ్ళూ సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, రామ్‌కోఠి, కింగ్‌కోఠి తదితర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లు వెలిశాయి. ఇక్కడకు అనునిత్యం అనేక మంది వచ్చి తాము వినియోగిస్తున్న సెల్‌ఫోన్/వాహనం అమ్మేయడమో, సెకండ్ హ్యాండ్‌కు ఖరీదు చేసుకుని వెళ్ళడమో జరుగుతోంది. దీన్ని చోరులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన వాహనాలు/సెల్ఫోన్లను తీసువచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇలాంటి చోరీ సొత్తును ఖరీదు చేస్తున్న వినియోగదారులు రికవరీల సందర్భంలో నిండా మునుగుతున్నారు. యాప్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు... ఇలాంటి వ్యవహారాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం చోరీ అయిన సెల్‌ఫోన్/వాహనాల వివరాలతో పాటు గుర్తుతెలియని వాహనాల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ వివరాలు ఏదో ఓ చోట ఉండే ప్రయోజనం శూన్యమని, డేటాబేస్ రూపంలో సెర్చ్ ఆప్షన్‌తో ఆన్లైన్ ఏర్పాటు చేసింది. పోలీసు అధికారిక యాప్ ‘హాక్–ఐ’ ద్వారా ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ పేరుతో ఇది ఏర్పాటైంది. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుల రూపంలో, పోలీసు యాప్ ‘లాస్ట్ రిపోర్ట్’ ద్వారా తమ దృష్టికి వచ్చిన వాహనం/సెల్‌ఫోన్ చోరీలు, పోగొట్టుకోవడాలకు సంబంధించిన రిపోర్టుల్ని క్రోడీకరిస్తున్నారు. వీటిని వాహనాలకు సంబంధించిన ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబర్లతో ఈ సెర్చ్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఖరీదు చేసే ముందు సెర్చ్... మరోపక్క వాహనాలు/సెల్ఫోన్ల పోగొట్టుకున్న వారు సైతం ఈ ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ ద్వారా వాటి వివరాలను డేటాబేస్‌లో పొందుపరచవచ్చు. ఫిర్యాదు చేసినా, ఇలా పొందుపరిచినా తక్షణం ఆ వివరాలు అప్డేట్ అవుతాయి. ఈ డేటాబేస్ హాక్–ఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ వ్యాపారులు తమ వద్దకు ఆయా వస్తువుల్ని అమ్మడానికి వచ్చే వారి నుంచి వీలైనంత వరకు గుర్తింపుకార్డు ప్రతులు, సెల్‌ఫోన్ నెంబర్లని తీసుకుంటున్నారు. నేరగాళ్ళు తెలివిగా వ్యవహరిస్తూ ఇవీ నకిలీవి, తాత్కాలికమైనవి ఇస్తుండటంతో ఆనక ఆయా వస్తువులు చోరీ సొత్తని తెలిసినా వ్యాపారులు, ఖరీదు చేసిన వారు ఏమీ చేయలేక మిన్నకుండిపోవాల్సి వస్తోంది. అయితే ఈ యాప్‌లోని లింకును వినియోగించుకోవడం ద్వారా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనం/సెల్‌ఫోన్ ఎవరైనా అమ్మడానికి వచ్చినప్పుడు దాని వివరాలు సెర్చ్ చేసి చోరీ సొత్తా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. వినియోగదారులు సైతం సెకండ్ హ్యాండ్‌వి కొనేప్పుడు ఈ సెర్చ్ ద్వారా సరిచూసుకుని ఖరీదు చేసే అవకాశం ఏర్పడింది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్త లింకేజ్... ప్రస్తుతం ‘థెఫ్ట్/లాస్ట్ ఆర్టికల్ సెర్చ్’ లింకులో నగరంలోని చోరీ వాహనాలు/సెల్ఫోన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన వివరాలు పొందుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు పూర్తయి, లింకేజీ వస్తే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసుస్టేషన్లలోని వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఓ ప్రాంతం/రాష్ట్రంలో చోరీ చేసి మరో చోట విక్రయించే వారికీ చెక్ చెప్పడానికి అవకాశం లభిస్తుంది. -
చిటికెలో బండి మాయం చేస్తారు..
పీఎంపాలెం (భీమిలి): రోడ్డుపై నిలిపిన ద్విచక్రవాహనాలు చోరీ చేయడంలో ఘనత వహిం చిన నలుగురు ఘరానా దొంగలను పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశా రు. వీరితోపాటు ఒక బాల నేరస్తుడ్ని, చోరీ సోత్తు కొనుగోలు చేసినందుకు ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ కె. ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. ఈ ప్రాంతంలో ఇటీవల పార్కింగ్ చేసిన ద్విక్రవాహనాలు చోరీకి సంబంధించి అధికంగా ఫిర్యాదులు అందడంతో నేరవిభాగం ఎస్ఐలు సూరిబాబు, అప్పారావు ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు సమాచారం మేరకు బైకుల చోరీ ముఠాతో సంబంధం ఉన్న శివశక్తి నగర్‌కు చెందిన కళ్లేపల్లి రమేష్‌పై నిఘా వేసి శనివారం ఇక్కడి క్రికెట్ స్టేడియంకు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. శివవక్తినగర్ ప్రాంతానికే చెందిన రౌతు శ్రీనివాస్, డి.రవికుమార్, ఆర్ హెచ్ కాలనీకి చెందిన కాకర పోతురాజు, కొలకాని పవన్‌కుమార్‌లు ముఠాగా ఏర్పడి బైకులు విలువైన వస్తువుల చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన ద్విచక్రవాహనాలు, విలువైన వస్తు సామగ్రికి సంబంధించి పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదు కాగా భీమిలి పోలీస్ స్టేషన్లో 3, ఆనందపురం పోలీస్ స్టేషన్లో 3 కేసులు, పద్మనాభం, విజయనగరం పోలీస్ స్టేషన్లలో ఒక్కొకటి నమోదయినట్టు గుర్తించారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన శివశక్తి నగర్‌కు చెందిన రాంబాబు, నారాయణమూర్తిలను సైతం అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ తెలిపారు. 9 బైకులు స్వాధీనం నిందితుల వద్ద నుంచి వివిధ ప్రదేశాలలో చోరీ చేసిన సుమారు రూ. లక్ష విలువ చేసే 9 బైకులు స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ ఎస్ఐలు తెలిపారు. వీటితోపాటు వాటర్ పంపింగ్ చేసే 2 మో టార్లు, ఒక టీవీ, గ్రైండింగ్ మిషన్ మొదలైన విలువైన సామగ్రిని స్వాధీనపరచుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైమ్ విభాగం హెచ్‌సీ పైడిరాజు, పైడంనాయుడు, రాజేష్, అనిల్, బాలులను సీఐ అభినందించారు. -
హైక్లాస్ దొంగలు
♦ ఫ్లైట్‌లో వచ్చి బెంగళూరులో చోరీలు ♦ రైల్లో ఫస్ట్‌క్లాస్‌లో తిరుగుముఖం! ♦ ఇద్దరు ఢిల్లీ చోరుల పట్టివేత ♦ రూ. 18 లక్షల సొత్తు స్వాధీనం బనశంకరి : ఎంతో స్టైల్‌గా వ్యాపారవేత్తల తరహాలో ఇద్దరు వ్యక్తులు సూట్లు, బూట్లు ధరించి విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. విలాసవంతమైన హోటల్లో దిగి కొద్దిరోజుల తరువాత రైళ్లో మొదటి తరగతి టికెట్లు బుక్ చేసుకొని దర్జాగా తిరిగివెళ్లిపోతారు.అయితే ఇద్దరు ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చేది ఏదో వ్యాపారం అనుకుంటే పొరపాటే. వారు వచ్చేది బెంగళూరులో దొంగతనాలు చేయడానికి.ఢిల్లీకి చెందిన నహీమ్, ఉస్మాన్ అనే ఇద్దరు ఘరానా చోరులు బెంగళూరులో దిగిన తరువాత వీధి వీధి తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. ఇంటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం తమ చేతివాటంతో ఇళ్లలోకి చొరబడి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకొని ఫస్ట్‌క్లాస్ రైళ్లో తిరిగి ఢిల్లీకి వెళ్లి విక్రయించి జల్సా జీవితాన్ని గడుపుతారు. ఇలా చోరీలకు బాగా అలవాటు పడ్డ ఇద్దరు నిందితుల్లో ఒకడైన ఉస్మాన్ ఇటీవల బెంగళూరుకు చేరుకొని నగరంలోని సుబ్రహ్మణ్యపురలో చోరీలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్థానికులకు పట్టుబడడంతో దేహశుద్ది చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఖాకీలు తమదైన శైలిలో విచారణ చేయగా వీరు మామూలు దొంగలు కాదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి విమానాల్లో రాకపోలు సాగిస్తూ బెంగళూరును కొల్లగొడుతున్న వైనం వివరించాడు. మరో నిందితుడు నహీమ్ కూడా చోరీల్లో పాలుపంచుకున్నట్లు అంగీకరించాడు. నహీమ్ ఇటీవల బెంగళూరులోని పరప్పన జైల్లో బందీగా సహచరుడు ఉస్మాన్‌ను పరామర్శించడానికి వచ్చాడు. వెంటనే పోలీసులు నహీమ్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ దొంగల ద్వయం నుంచి రూ.18 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.