సాక్షి, ముంబై: మెట్రో రైళ్ల వేగం పెంపు విషయంలో ఆ మార్గానికి ఆనుకుని ఉన్న పాత భవనాల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. వాటికి ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా చూడాలని సూచించింది. కాగా పనులు ముగిసిన నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తొలుత ఈ రైళ్ల వేగాన్ని గంటకు 50 కి.మీ.గా నిర్ణయించారు. అయితే ఈ వేగాన్ని గంటకు 80 కి.మీ. వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ మోనికా మథాని అనే మహిళ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మెట్రో రైళ్ల వేగం పెంచేముందు ఆ మార్గానికి ఆనుకుని ఉన్న పాత భవనాల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచి ఆదేశించింది. అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం ప్రతి భవనానికి ఇరువైపులా ఆరు మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. అయితే మెట్రో రైలు ప్రాజెక్టు భవనాలకు అత్యంత సమీపంలో ఉంది. రైళ్ల వేగం పెంపువల్ల వాటి కుదుపులకు పాత భవనాలకు పగుళ్లిచ్చే ప్రమాదం ఉందని మోనికా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భవనాలకు అత్యంత చేరువలోనే మెట్రో ప్రాజెక్టును నిర్మించారు. కనీసం ఆరు మీటర్ల ఖాళీ స్థలం కూడా లేదు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైరింజన్లు అక్కడికి వెళ్లలేవు. ఈ నేపథ్యంలో మెట్రోకు అగ్నిమాపక శాఖ జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పై కూడా మోనికా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌ఓసీ జారీ అనేది సాంకేతిక అంశమని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.
పాత భవనాల మాటేమిటి?
Published Fri, May 23 2014 10:30 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement