కలర్‌లోనే కళర్ ఫుల్ జీవితం...
Published Sun, Mar 16 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
అన్నింట్లోకి వేడి రంగు అంటే ఇదే. అతిగా స్పందించే గుణం ఉన్నవారు, కాస్త విపరీత ధోరణి ఉన్నవారు ఈ రంగును ఎక్కువగా ఎంచుకుంటారు. ఇది కోపానికి, ప్రమాదానికి, మంటలకు కూడా చిహ్నం గానూ ఉపయోగిస్తారు రక్తపు రంగును పోలి ఉంటుంది కాబట్టి... దీన్ని సామర్థ్యానికి, ప్రాణానికి గుర్తుగానూ నిర్వచిస్తారు. అతి ఇష్టానికి, అతి వ్యామోహానికి కూడా ఈ రంగు చిహ్నమే. అత్యుత్సాహం తెచ్చుకోవాలన్నా, తీవ్రమైన ఆసక్తిని ప్రేరేపించుకోవాలన్నా, మరింత శక్తిసామర్థ్యాలు సంతరించుకోవాలన్నా, కలల సాకారానికి అవసరమైన అనూహ్యమైన పట్టుదలను తెచ్చుకోవాలన్నా... ఏదో రూపంలో రెడ్‌ను మన ఆహార్యంలో భాగం చేసుకోవాలని కలర్‌థెరపిస్ట్‌లు సూచిస్తున్నారు. మనల్ని మనం బోల్డ్‌గా, డైనమిక్‌గా వ్యక్తీకరించుకోవాలంటే ఓ చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని మన శరీరంపై ధరించినా చాలట.
పింక్ అంటే ఆహ్లాదం...
ఎరుపు తెలుపుల కాంబినేషన్‌గా మనం చెప్పుకునే కలర్ పింక్. ఈ కలర్... ఆవేశాన్ని తగ్గించేందుకు పనికొస్తుందంటారు. అందుకే కొన్ని కారాగారాల్లో ఖైదీల మానసిక ప్రవర్తన, తెగింపు ధోరణిలను సరిదిద్దేందుకు గాఢమైన పింక్‌ను వినియోగిస్తారట. శ్రద్ధచూపే తత్వాన్ని, దయ, ప్రేమ పూర్వక మనస్తత్వాన్ని, అంగీకారధోరణిని పింక్ ప్రతిబింబిస్తుంది. అస్తవ్యస్థ మనస్తత్వాన్ని చక్కదిద్దుకోవాలన్నా, ఆహ్లాదకరంగా ఉండాలన్నా పింక్‌ను మన జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంత చిత్తం కలిగిన, వేధింపులకు తావివ్వని వ్యక్తిగా మనల్ని మనం చెప్పుకోవాలంటే పింక్‌ను ధరించాలంటున్నారు. బేషరతు ప్రేమను అందించడం, రొమాంటిక్‌గా ఉండడం, ఆశావాహ దృక్పథం పింక్‌కు ప్రతిబింబాలని చెప్పవచ్చు.
వైట్ అంటే రైట్...
పూర్తి స్వచ్ఛతకు, కచ్చితత్వానికి ప్రతిబింబం శ్వేతవర్ణం. అమాయకత్వానికి, సంపూర్ణత్వానికి అర్థంగా దీనిని చెప్పవచ్చట. ఇది ఎటువంటి భావనలను ప్రేరేపించనప్పటికీ, సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉపకరిస్తుందట. మైండ్‌ను ఒక ఖాళీ పేపర్‌లా మార్చి తద్వారా ఊహాశక్తికి ఊపునిస్తుందట. దాపరికం లేని తత్వానికి తనను తాను ప్రతిబింబంలా చెప్పుకోవాలనుకుంటున్నవారు, ఇతరుల అభిప్రాయాలను స్వచ్ఛందంగా ఆహ్వానించేవారు తెలుపును జీవనశైలిలో భాగం చేసుకుంటారని కలర్‌సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. తెలుపు రంగును అనేకమైన అంశాలకు ప్రారంభంగా భావిస్తారు. అందుకే దీన్ని ప్రారంభ కలర్ అని కూడా అంటారు. ఒత్తిడి నివారణకు సైతం ఇది ఉపయుక్తమైనదట. చీకటికి శత్రువుగానూ వర్ణిస్తారు.
బ్రౌన్‌తో షైన్...
ఎరుపు, నీలం, పసుపు వర్ణాల మిశ్రమంగా బ్రౌన్‌ను చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ ఎనర్జీని రెడ్ అందిస్తే, ఎల్లో, బ్లూ కలర్‌లు మానసిక దృక్పథాన్ని నిలకడగా ఉంచేందుకు ఉపకరిస్తాయి. అయితే అధికంగా బ్రౌన్ కలర్ వినియోగం కాస్త డల్‌నెస్‌ను అందిస్తుంది. ఒక వ్యక్తి లోప్రొఫైల్‌లో, వెనుకగా ఉండిపోవడానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే సహజత్వాన్ని కూడా అనుభూతించేలా చేస్తుంది. సంప్రదాయబద్ధులుగా ఉండాలన్నా, గుంపులో గోవిందాలా కలగలిసిపోవాలన్నా... బ్రౌన్‌ను మనం జీవితంలో భాగం చేసుకోవాలి. స్థిరత్వాన్ని, స్పష్టమైన ఆలోచనల్ని కలిగిస్తాయని బ్రౌన్ జెమ్‌స్టోన్స్‌కు పేరు. మన నిజమైన గుణానికి ముసుగులా కూడా బ్రౌన్ ఉపయోగపడుతుందట. మన గురించి మనం అధికంగా ఊహించుకోకుండా ఉండడానికి డౌన్ టు ఎర్త్ అనే ఫీలింగ్ కలిగించుకోవడానికి ఈ రంగు ఉపయుక్తం.
గోల్డ్‌కు తిరుగులేదు...
విజయానికి, లక్ష్యాలను చేరుకున్నదానికి చిహ్నంగా గోల్డ్‌కలర్‌ను వినియోగిస్తారు. అలాగే విలాసానికి, నాణ్యతకు, ప్రతిష్టకు కూడా ఇది ప్రతిబింబం. ఈ రంగుకు సూర్యశక్తిని గ్రహించే గుణం ఉంది కాబట్టి, ఇది అత్యంత ఆరోగ్యకరమైన రంగుగా కూడా పేర్కొంటున్నారు. అందుకేనేమో ఈ రంగులో ఉండే లోహమైన బంగారానికి ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్. అత్యంత ఆకర్షణీయమైన రంగు కూడా కావడంతో నలుగురిలో పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్నవారు దీనిని ఏదో ఒక రూపంలో తమ జీవనశైలిలో భాగం చేసుకుంటారు.. విశేషమేమిటంటే జీవితం మీద అత్యంత ప్రేమ కలిగించే ఈ రంగుకే ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే లక్షణం కూడా ఉంటుందట. అందుకేనేమో... దేవాలయాల్లో విగ్రహాలు, ధ్వజస్థంభాలు... ఇవన్నీ ఎక్కువగా ఈ రంగులో కనిపిస్తాయి.
Advertisement
Advertisement