
కూల్చివేసిన ఇంటిని దీనంగా చేస్తున్న బాధితురాలు కావ్య
కర్ణాటక, మాలూరు : పట్టణంలోని ఇందిరా నగర్‌లో ఓ ఇంటిని దౌర్జన్యంగా కూలివేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ... పట్టణంలోని మునికృష్ణప్పకు ఆశ్రయ పథకం కింద 1992లో పురసభ నుంచి స్థలం మంజూరైంది. ఈ స్థలంలో మునికృష్ణప్ప కూతురు జయమ్మ భర్త అరుణ్ సింగ్‌లు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం వీరు మరణించగా వారి కుమార్తె కావ్య ఒక్కతే ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం కావ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి ఇందిరా నగర్‌కే చెందిన వనితా, మంజుల, విజయమ్మలు ఆ ఇంటి స్థలం తమకు చెందిందని వివాదం సృష్టించారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు జరుగుతోంది.
ఈ క్రమంలో మంగళ వారం వనిత, మంజుల, విజయమ్మలు మరో 13 మందితో కలిసి వచ్చి ఇంట్లో ఉన్న కావ్యను బయటకు లాగి జేసీబీతో ఇంటిని నేలమట్టం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన కావ్యపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కావ్యకు న్యాయం చేయాలని 100 మందికి పైగా స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పురసభ సభ్యులు తంగరాజ్ తదితరులు వచ్చి చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment