
అనగనగా ఓ 70 లక్షలు..!
పెనమలూరు బీసీ ఖాతాలోకి రూ.70 లక్షలు అనధికారికంగా జమ
బ్యాంక్ ఆన్ లైన్ తప్పిదం వల్లే..
డబ్బంతా ఖర్చు చేసేసిన మహిళ.. పోలీసుల విచారణ
పెనమలూరు: మీ బ్యాంకు ఖాతాకు మీ ప్రమేయం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా రూ.లక్షల్లో సొమ్ము జమ అయితే ఎలా ఉంటుంది. ముందు ఆశ్చర్యం.. ఆనక ఆనందం కలుగుతుంది కదూ. కృష్ణా పెనమలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) బ్యాంకు ఖాతాలోకి అనధికారికంగా సొమ్ము అలాగే వచ్చింది. అది రూ.లక్షో, రెండు లక్షలో కాదు.. ఏకంగా రూ.70 లక్షలు. దీంతో ఆమె రెండు ఇళ్లు, రెండు స్థలాలు, ఎకరం పొలం, 2 వాహనాలు కొనుగోలు చేసేసింది. చివరకు అది బ్యాంకు ఆన్ లైన్ తప్పిదం వల్లే జరిగిందని తేలడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది.
మండలంలోని శివారు గ్రామానికి చెందిన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆ గ్రామంలో పేదలకు బ్యాంకుల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తుంటుంది. ఆమెకు పెనమలూరులోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. పింఛన్ సొమ్ము ఆమె ఖాతాలో జమ కాగానే, లబ్ధిదారుల ఖాతాకు మారుస్తుంది. కాగా, కొద్దిరోజుల కిందట ఆమె ఖాతాకు పలు దఫాలుగా రూ.70 లక్షల వరకూ డబ్బు జమ అయ్యింది. ఆశ్చర్యానికి గురైన ఆమె విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా భర్తతో కలిసి మొత్తం డ్రా చేసి ఇళ్లు, స్థలాలు, పొలం, వాహనాలు కొనేసింది.
బ్యాంకు అధికారుల పరుగులు..
వేరే ఖాతాలో జమ కావాల్సిన సొమ్ము బీసీ ఖాతాలోకి వెళ్లిందని ఆలస్యంగా మేల్కొన్న బ్యాంకు అధికారులు పరుగులు పెట్టారు. సాఫ్ట్‌వేర్ సమస్య వల్లే ఇలా జరిగిందని, ఇది ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సొమ్ముగా పేర్కొంటున్నారు. కాగా హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. బీసీ వద్ద కొంత సొమ్ము రికవరీ చేశారని తెలిసింది. అయితే, ఆస్తులు కొనుగోలు చేయడంతో అవి అమ్మి సొమ్ము జమ చేస్తానని సదరు బీసీ పత్రాలు అందజేసిందని చెబుతున్నారు.