మూఢాచారాలకు చెల్లుచీటీ
► పటిష్టమైన ‘మూఢాచారాల నిషేధ చట్టం’ రూపకల్పన
► త్వరలో రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు
► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: సమాజాభివృద్ధికి ఆటంకంగా పరిణమించిన మూఢాచారాలను నిర్మూలించేందుకు మహారాష్ట కంటే పటిష్టమైన మూఢాచారాల నిషేధ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ‘మూఢాచారాలు శాస్త్రీయపరమైన ఆలోచనలకు గొడ్డలిపెట్టు’ అనే అంశంపై బెంగళూరులోని జ్ఞానజ్యోతి సభాంగణలో కర్ణాటక న్యాయవాదుల పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కకు నీరు పోసి మాట్లాడారు.
సమాజంలో నమ్మకాలు ఉండవచ్చని, అయితే అవి మూఢనమ్మకాలుగా మారకూడదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం మూఢాచారాల నిషేధ చట్టం అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ అంశంపై చర్చ సైతం జరిగిందని తెలిపారు. మరోవైపు ఇలాంటి చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదనే డిమాండ్ కూడా చాలామంది నుంచి వినిపిస్తోందని అన్నారు. అయినా మూఢాచారాల నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూఢాచారాల నిషేధ చట్టం ఇప్పటికే మహారాష్ట్రలో అమల్లో ఉందని, ఈ నేపథ్యంలో కర్ణాటకలో మరింత పటిష్టమైన చట్టాన్ని రూపొందించాల్సిందిగా న్యాయనిపుణులను ఆదేశించినట్లు తెలిపారు. ‘నేను మూఢాచారాలను నమ్మను. నా పెళ్లి జరిగింది రాహుకాలంలో, పురోహితుల మాట విని మా మామగారు నా వివాహాన్ని ఉదయం 9.30-10.30గంటల మధ్యన నిర్ణయించారు.
అయితే ఆ సమయానికి అతిథులు హాజరుకావడం ఆలస్యం కావడంతో పాటు అది భోజన సమయం కూడా కాకపోవడంతో నేను మధ్యాహ్నం 12.30గంటలకు రాహుకాలంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టానంటూ చర్చ జరిగింది. అయినా ఆ సమయంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొని అలాగే చేశాను’ అని సీఎం చెప్పారు. మూఢనమ్మకాలు కేవలం ప్రజలను, వారి మనోస్థైర్యాన్ని బలహీనపరుస్తాయని, అందువల్ల విద్యావంతులు ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలకు నిరసనగా తమ గళాన్ని వినిపించాలని సూచించారు.
మరో రెండేళ్లు నేనే సీఎం......
రానున్న మరో రెండేళ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందనేది కేవలం గాలి వార్తలు మాత్రమేనని కొట్టిపారేశారు.