గుర్తింపుకార్డులు తప్పనిసరి
తమిళసినిమా: సూపర్‌స్టార్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేకుంటే వారు ఎంతటి వీరాభిమానులైనా నోఎంట్రీ. ఏమిటిదంతా అనేగా మీ ఆసక్తి. రజనీకాంత్ రేపటి (సోమవారం)నుంచి ఐదురోజుల పాటు ఆయన అభిమానులను జిల్లాల వారిగా కలవనున్నారు. చాలా కాలం తరువాత ఆయన అభిమానుల కల నెరవేరబోతోంది. అయితే ఈ పరిణామం రాజకీయవర్గాల్లో గట్టి కలవరానికే దారి తీస్తోంది.
రజనీకాంత్ రోజుకు మూడు జిల్లాలకు చెందిన అభిమానులు చొప్పున ఈ నెల 19 తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి మంచి విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపం వేదిక కానుంది. అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులను అందించడం జరిగింది.
అవి ఉన్న వారికే అనుమతి అని, గుర్తింపు కార్డులు లేని వారు దయచేసి రావద్దని శనివారం రజనీకాంత్ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా రజనీకాంత్‌తో మాట్లాడాలని ప్రయత్నించడం గానీ, రాజకీయ ప్రస్తావన తీసుకురావడం గానీ, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం లాంటివి చేయకూడదని నిబంధనలు విధించడం జరిగిందని సమాచారం.