తుంగభద్ర నదిలో తెప్ప మునిగి 10మంది గల్లంతు
ఒకరి మృతి మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు
శివమొగ్గ: వినాయకవిగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉండ్రాల్లయ్యను సాగనంపేందుకు వెళ్లిన వారిలో 10 మంది తుంగభద్ర జలాల్లో గల్లంతయ్యారు. దీంతో జిల్లాలోని హాడోనహళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు....జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూరంలోనున్న హాడోనహళ్లి గ్రామంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గౌరీ గణేశుల విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గ్రామంలోని తుంగభధ్ర నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 23 మంది యువకులు చిన్నపాటి తెప్పలో నదిలోకి వెళ్లారు. గౌరీవిగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం వినాయక విగ్రహాల కోసం గట్టుకు చేరుకున్నారు. ప్రతిమలను తీసుకొని అదేతెప్పలో నదీ గట్టు నుంచి వంద అడుగుల దూరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా అనుకోని విధంగా తెప్పలోకి నీరు ప్రవేశించి మునగడం ప్రారంభించింది. కంగారుపడ్డ 23 మంది యువకుల్లో 12 మంది నదిలోకి దూకి ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు.
మిగిలిన 11 మంది యువకులు పడవతో పాటు నదిలో మునిగిపోయారని ఒడ్డుకు చేరుకున్న 12 మంది యువకుల్లో ఒకరైన సంతోష్, ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల యువకుల కుటుంబీకులు, గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన యువకుల కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సాయంత్రానికి ఒక మృత దేహం లభించగా అతన్ని ఇంజనీరింగ్ చదువుతున్న మంజునాథ్‌గా గుర్తించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.నిమజ్జనం కోసం నదిలోకి వెళ్లి గల్లంతైన యువకుల కుటుం సభ్యుల ఆక్రందనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.