
ఐటీ అటాక్!
సాక్షి, చెన్నై : డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ గురి పెట్టింది. ఏక కాలంలో ఆ శాఖ వర్గాలు అటాక్ చేశారు. 40 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతతో ఈ దాడులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
డీఎంకేలో ఆర్థికంగా బలం కల్గిన నాయకుల్లో జగద్రక్షకన్ ఒకరు. ఒకప్పుడు అన్నాడీఎంకేలో రెండు సార్లు ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కిన జగద్రక్షకన్ మరో రెండు సార్లు డీఎంకే తరఫున గెలిచారు. యూపీఏలో డీఎంకే కీలక పాత్ర పోషించిన వేళ సహాయ మంత్రిగా పలు శాఖలకు పనిచేశారు. రాష్ట్రంలో ఈయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం కష్టతరమే.
ఆ మేరకు హోటళ్లు, ఇంజినీరింగ్, వైద్య, దంత వైద్య కళాశాలలు, భవనాలు, సంస్థల్ని కల్గి ఉన్నారు. ఆర్థిక, రాజకీయ బలం కల్గిన ఈ మాజీ మంత్రిని ఆదాయపన్ను శాఖ టార్గెట్ చేసి ఉన్నది. పన్నుల ఎగవేత ఆధారాలు తమ చేతికి చిక్కడంతో ఏకకాలంలో దాడులకు పాల్పడి ఇవన్నీ జగద్రక్షకన్ ఆస్తులా..? అన్నట్టుగా ప్రజలు విస్మయంలోపడాల్సిన పరిస్థితి.
ఐటీ దాడి : రాష్ట్రంలో జగద్రక్షకన్‌కు నలభై చోట్ల ఆస్తులు ఉన్నట్టుగా ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. బుధవారం ఉదయాన్నే నలభై బృందాలు వేర్వేరుగా రంగంలోకి దిగి, దాడులకు పాల్పడ్డాయి. అడయార్‌లోని ఆయన నివాసం, చెన్నై నగర శివారుల్లోని బాలాజీ మెడికల్ కళాశాల, ఠాకూర్ ఇంజినీరింగ్ కళాశాల, భారత్ వర్సిటీ, పుదుచ్చేరిలోని లక్ష్మి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, రాజీవ్ గాంధీ రోడ్డులోని అకార్డ్ హోటల్‌లతో పాటు నలభై చోట్ల ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతూ వస్తున్నాయి.
అలాగే, జగద్రక్షకన్ మేనేజర్లుగా పేర్కొంటున్న మనోజ్, వైర కుమార్, ఇలవరసన్‌లతో పాటుగా మరి కొందరి ఇళ్లలోనూ దాడులు జరిగాయి. అర్ధరాత్రి వరకు ఈ దాడులు సాగడం, పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక ఆధారాలు అధికారులకు చిక్కినట్టు సమాచారం. కీలక రికార్డులను, ఫైల్స్‌ను తనిఖీలు అనంతరం ఐటీ వర్గాలు తమ వెంట పట్టుకెళ్లి ఉన్నాయి.
కాగా, డీఎంకే మాజీమంత్రి ఆస్తులపై ఐటీ గురి పెట్టిన వ్యవహారం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. ఇందుకు కారణం, డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రులు మెజారిటీ శాతం ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే.