సాక్షి, ముంబై: నగరంలో గురువారం వివిధ తెలుగు సంఘాలు 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా పతాకావిష్కరణతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్ర మహాసభలో: దాదర్‌లోని ఆంధ్ర మహాసభ అండ్ జింఖానాలో గురువారం స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆ సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సునీల్ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, 2013లో 10,12 తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహాసభ లీజు రెన్యువల్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. బీఎంసీ విధించిన రూ.15 లక్షల జరిమానాను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. 2012 మే 18వ తేదీన ఆంధ్ర మహాసభ నిర్వహించిన ‘సంగీత భారతీయం’ కార్యక్రమంలో 12 గంటలపాటు నిర్విరామంగా పాటలు పాడిన హైదరాబాద్‌కు చెందిన గాయకుడు బాపు శాస్త్రి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయబడింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్, షీల్డును మేయర్ చేతుల మీదుగా శాస్త్రికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశ భక్తిపాటలు, వివిధ సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పదో తరగతిలో మెరిట్‌లో వచ్చిన విద్యార్థులను మేయర్ సన్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె.బాబురావు, వివిధ శాఖల పదాధికారులు గట్టు నర్సయ్య, నడిమెట్ల ఎల్లప్ప, గజం సుదర్శన్, బడుగు విశ్వనాథ్, మంతెన రమేశ్ హాజరయ్యారు.
ఓం పద్మశాలి సేవా సంఘంలో: ఖరాస్ బిల్డింగులోని ఓం పద్మశాలి సేవా సంఘ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం పతాకావిష్కరణ గావించారు. కార్యక్రమానికి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, ఉపాధ్యక్షుడు అంబల్ల గోవర్ధన్ తదితరులు హాజరయ్యారు. అక్కడే ఉన్న ఓం పద్మశాలి విజయ సంఘం-కమ్మర్‌పల్లి కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చింత రామ్‌ప్రసాద్, కమిటి సభ్యులు వేముల నారాయణ, చింత అంజయ్ పాల్గొన్నారు. ఖరాస్ బిల్డింగ్‌లోని మోర్తాడ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయం ఎదుట అధ్యక్షుడు కామని హన్మాండ్లు జెండా ఎగరవేశారు. స్థానికులు యెల్ది సుదర్శన్, అరుట్ల మల్లేశ్ తదితరులు హాజరయ్యారు.
ఆంధ్ర ప్రజాసంఘంలో: పశ్చిమ గోరేగావ్‌లోని హనుమాన్ నగర్‌లో ‘ఆంధ్ర ప్రజా సంఘం’ ఆధ్వర్యంలో శివసేన శాఖ ప్రముఖుడు సునీల్ చవాన్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జె.మన్మదరావు, ప్రధాన కార్యదర్శి వి.జే.రావు, సభ్యులు పాల్గొన్నారు. గోరేగావ్‌లోని బైబిల్ మిషన్ చర్చ్ రెవరెండ్ డాక్టర్ పి.బి.బాధర్ బాబు ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథులుగా పి.సత్యశీల్, వినాయక్ బాబు, భాస్కర్‌రావు, నిర్మల జ్యోతి, స్వామికుమారి తదితరులు హాజరయ్యారు. ‘తెలుగు యువసేన ’ ఆధ్వర్యంలో సుభాష్‌నాకావద్ద శివసేన నాయకుడు సునీల్ చవాన్ పాల్గొని జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు ప్రకాశ్‌స్వామి, కో-ఆర్డినేటర్ వెంకటేశ్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.
విశాలాంధ్ర సంఘంలో: తూర్పు మలాడ్‌లోని గోవింద్‌నగర్‌లో విశాలాంధ్ర సంఘం కార్యాలయ ఆవరణలో ఆ సంఘం స్టీరింగ్ సభ్యుడు దేవరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు సురేళ్ల బాబు, ప్రధాన కార్యదర్శి గోగి కేశరరావు, విశ్వనాథం, నాగభూషణం హాజరయ్యారు.
నాయ్‌గావ్‌లో: నాయ్‌గావ్‌లో పద్మశాలి యువక సంఘం అధ్యక్షుడు కోడి చంద్రమౌళి జెండావిష్కరణ చేశారు. విద్యార్థులకు బహుమతులు పంచారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, సంఘం ధర్మకర్తల చైర్మన్ పాపని సుదర్శన్, మేనేజింగ్ ట్రస్టీ గాడిపెల్లి గణేశ్, సభ్యులు హాజరయ్యారు.
వర్లీలో: వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి ఆవరణలో సంఘం ట్రస్టీ చైర్మన్ మంతెన రమేశ్ జెండా ఎగరవేశారు. అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, వీరబత్తిన చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ‘తెలుగు మున్నూరు కాపు సేవా సంఘం ఆవరణలో ఆ సంఘం అధ్యక్షుడు శెకెల్లి రాములు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీంద్ర, ఉపాధ్యక్షుడు రాజేశం, అజయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులు సిరినేని సత్తయ్య, గుర్తుల రమణ్ పాల్గొన్నారు.
సైన్‌లోని ప్రతీక్షానగర్‌లో: ప్రతీక్షాన గర్‌లోని ‘ముంబై తెలుగు సేవా సంఘం’లో స్థానిక ఎన్సీపీ నాయకుడు మానవ్ వెంకటేశ్ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో సంఘం సంస్థాపక అధ్యక్షుడు కొమ్ము రంగరాజు, ప్రస్తుత అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి వాసం నారాయణ పాల్గొన్నారు.
బోరివలిలో: తూర్పు బోరివలిలోని రాజేంద్రనగర్ తెలుగు చైతన్య పాఠశాల ఆవరణలో తెలంగాణ యువజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో గంగాధర్ చాట్ల, ఉప్పు భూమన్న, గాజుల మహేశ్, పెంట గంగన్న, పురశెట్టి గోపాల్, గంగాధరి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
వాషిలో: వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రాంగణంలో అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో కోశాధికారి చిస్తు చిరంజీవులు, సంయుక్త కార్యదర్శి వై.వి.నారాయణరెడ్డి, సంయుక్త కోశాధికారి సుబ్రమణ్యం, సభ్యులు రమణారెడ్డి,మూర్తి. ఆర్.కె.రెడ్డి పాల్గొన్నారు.