డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయనపై ఇంకు దాడి జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం బయట ఈ దాడి జరగడం గమనార్హం.
ఇటీవల ఢిల్లీలో చికెన్గున్యా వ్యాధి తీవ్రంగా ప్రభలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంను వెంటనే ఢిల్లీకి తిరిగిరావాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. దీంతో ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ను కలవడానికి వెళ్లిన సమయంలో బ్రజేష్ శుక్లా అనే వ్యక్తి మనీష్ సిసోడియాపై ఇంకు చల్లాడు. 'ఢిల్లీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. ప్రజల సొమ్ముతో సిసోడియా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు' అంటూ ఇంకు దాడి చేసిన శుక్లా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.