జగన్ విడుదలతో అన్నదానం
Published Thu, Sep 26 2013 3:28 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
సాక్షి, చెన్నై : జననేత జగన్ విడుదలతో చెన్నైలోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్ నేతృత్వంలో 20 రోజుల పాటు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బుధవారం లేడీ ఆండాల్ స్కూల్‌లోని విద్యార్థులకు అన్నదానం చేశారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఆయన విడుదలతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. చెన్నైలోని అభిమానులు సైతం బెయిల్ వచ్చిన రోజు నుంచి తమ ఆనందాన్ని సంబరాల రూపంలో పంచుకుంటున్నారు.
బాణసంచాల మోత మోగిస్తూ, స్వీట్లు పంచిపెడుతూ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. అదేవిధంగా చెన్నైలో వివిధ ఆశ్రమాల్లో ఉన్న పేదలకు 20 రోజుల పాటు అన్నదానం చేయడానికి పార్టీ తమిళనాడు విభాగం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా చేట్‌పట్ హ్యారింగ్టన్ రోడ్డులోని లేడీ ఆండాల్ స్కూల్‌లోని పేద విద్యార్థులకు బుధవారం అన్నదానం చేశారు. వైఎస్సార్ చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమానికి తమిళనాడు విభాగం నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్ శ్రీకారం చుట్టారు. పేద ఆశ్రమాలు, పేద విద్యార్థులు ఉండే ప్రదేశాల్ని గుర్తించి 20 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బాలాజీ, పాండియన్, రాజేంద్రన్, సతీష్, స్టాన్లీ జగన్, కృపానందన్, పళని, వెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో పలుచోట్ల జగన్ పోస్టర్లు
వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో ఆయనకు ఆహ్వానం పలుకుతూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతృత్వంలో ప్రత్యేకంగా ఆయిల్ ప్రింట్ ఆర్ట్స్ పోస్టర్లను సిద్ధం చేశారు. జగన్ ఈజ్ బ్యాక్ నినాదంతో జన సందోహానికి జగన్ నమస్కరించే విధంగా, ఆ దృశ్యాన్ని మహానేత వైఎస్ వీక్షించే రీతిలో ఆర్ట్ ప్రింట్‌గా ఈ పోస్టర్‌ను రూపొందించారు. పెరంబూరు, తండయార్‌పేట, రాయపురం, ప్యారిస్, సెంట్రల్, ఎగ్మూర్, నుంగబాక్కం, వళ్లువర్ కోట్టం, రాధాకృష్ణ సాలై, పురసై వాక్కం, చేట్ పట్, అడయార్, టీ.నగర్, వెస్ట్ మాంబలం, కోడంబాక్కం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అటు వైపు వెళ్లే వారిని ఆకర్షిస్తున్నాయి.
ఆనందంగా ఉంది
వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి జనంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని శరవణన్, జకీ ర్ హుస్సేన్ పేర్కొన్నారు. తమ నాయకుడు జైలు నుంచి బయటకు రావడంతో ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారడం తథ్యమన్నారు. ఆయన రాక సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టు అయిందన్నారు. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతృత్వంలో పార్టీ పటిష్టానికి, జగన్‌కు మద్దతుగా కార్యక్రమాల్ని వేగవంతం చేయనున్నామన్నారు. నగరం, శివారుల్లోని ఆశ్రమాల్ని ఎంపిక చేసి అందులోని పేదలకు 20 రోజుల పాటు అన్నదానం చేయనున్నామని పేర్కొన్నారు. నగరం అంతా జగన్ రాకను ఆహ్వానిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు.
Advertisement