వచ్చే నెల 6 నుంచి 'జై ఆంధ్రప్రదేశ్'
హైదరాబాద్ : రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది. నవంబర్ 6నుంచి ఐదు బహిరంగ సమావేశాలను నిర్వహించనుంది. వీటిలో మొదటిది ఆరోతేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఈ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వ విఫలమైన తీరును, అవినీతి రాజకీయాలను ఎండగట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ జై ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికే పరిమితమై పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, వాటి అమలులో మాత్రం శూన్యం కనిపిస్తుందన్నారు.
అన్ని వైపుల నుంచి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఎండగడుతున్న ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి భారీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఐదు సమావేశాలను నిర్వహిస్తున్నామని, వాటిలో మొదటిది నవంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో జరగనుందని వెల్లడించారు. వరుసగా జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రబలిన అవినీతిని, ప్రత్యేకహోదా సాధనలో ప్రభుత్వం విఫలమైన తీరును చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీలోని సీనియర్ నేతలందరూ, అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారని తెలిపారు.