
జల్లికట్టు బిల్లుకు ఆమోదం
చెన్నై: జల్లికట్టు కోసం తమిళులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు దిగివచ్చాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో అన్నా డీఎంకే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
జల్లికట్టు నిర‍్వహణకు తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించిన సంగతి తెలిసింది. కేంద్రం ఈ ఆర్డినెన్స్ను తిరిగి తమిళనాడుకు పంపగా, ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. కాగా జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో తమిళులు శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.