నేడు కొడనాడుకు జయ
♦ అనారోగ్యంతో విశ్రాంతికని ప్రచారం
♦ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండానే పయనం
♦ నేటి పారిశ్రామిక సదస్సుకు గైర్హాజరు?
అనేక సమస్యలతో ఏడాదిగా సతమతమైన అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి కోసం నేడు కొడనాడు ఎస్టేట్‌కు
పయనం అవుతున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో కొడనాడుకు చేరుకునేలా ఆమె ప్రయాణం ఖరారైంది. అనారోగ్యం కారణంగా చికిత్సతోపాటు విశ్రాంతి తీసుకునేందుకే ఆమె వెళుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజకీయ, అధికార కార్యకలాపాలతో అవిశ్రాంతంగా పనిచేసినపుడల్లా కొడనాడుకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం జయలలితకు అలవాటు. నీలగిరి జిల్లాలో భాగమైన కొడనాడు, ఊటీ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం అబ్బురపరుస్తుంది. జయ రాజ కీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలోనే కొడనాడు ఎస్టేట్‌ను సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు కొడనాడు ఎస్టేట్‌లో కొంతకాలం గడుపుతారు. 18 ఏళ్లుగా చెన్నై ఆతరువాత బెంగళూరు ప్రత్యేక కోర్టులో సాగిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు గత ఏడాది కొలిక్కి వచ్చి జయను జైలు పాలు చేసింది. సుమారు మూడువారాల పాటూ కర్నాటకలో జయ జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి చెన్నైకి చేరుకున్నా 9 నెలల పాటూ ఇంటికే పరిమితం అయ్యారు.
మే 11 వ తేదీన కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా తీర్పు చెప్పిన తరువాత సైతం బాహ్యప్రపంచంలోకి రాలేదు. ముఖ్యమంత్రిగా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నట్లుగా వ్యవహరించారు. అదే సమయంలో జయ అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత మే 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయటకు వచ్చారు. గత నెల 22వ తేదీన ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పొల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎమ్మెల్యే అయ్యేది ఎప్పుడో?
జయ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం దృష్ట్యా ఆర్కేనగర్ ఉప ఎన్నిక హడావిడిగా ముంచుకొచ్చింది. ఈనెల 27 వ తేదీన పోలింగ్, 30వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తికాగా 1.5 లక్షల పైచిలుకు మెజార్టీతో అమ్మ అఖండ విజయం సాధించారు. అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని ఆశించి సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఆనాటి కార్యక్రమం రద్దయింది. ఈనెల 1 వ తేదీన అన్నాడీఎంకే అధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులతో చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి అమ్మ హాజరవుతారని ఆశించారు.
పోయెస్‌గార్డన్ నుంచి గిండీ, రాజ్‌భవన్ మీదుగా చెన్నై ట్రేడ్ సెంటర్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సైతం జయ హాజరుకాకపోవడంతో మంత్రి పన్నీర్‌సెల్వం జయ సందేశాన్ని చదివి వినిపించారు. జయ అనారోగ్యంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆర్కేనగర్ ఎన్నిక ఫలితాలు వెలువడి నాలుగురోజులైనా ప్రమాణం తేదీ ఖరారు కాలేదు. రామనాథపురం జిల్లాలో కముదిలో 648 మెగావాట్ల సోలార్ విద్యుత్ పథకం అమలుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త అదాని గ్రూపుతో గతనెల 30వ తేదీన జయ భేటీ వాయిదా పడింది.
సచివాలయానికి జయ రాకపోవడం వల్లనే సమావేశాన్ని వాయిదావేశారు. చెన్నైలోనే వేచిచూసిన అదాని అధికారులు తిరిగి వెళ్లిపోయారు. ఈనెల 4వ తేదీన జయ సమక్షంలో ఒప్పందం జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే ఉదయం 11 గంటలకు జయ కొడనాడు పయనం అవుతుండగా ఒప్పందం జరుగుతుందా అనే అనుమానాలు చోటుచేసుకున్నాయి. ఈనెల 4వ తేదీ ఉదయం 11.50 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా కొడనాడు ఎస్టేట్‌కు బయలుదేరుతున్నారు. జయ నెచ్చెలి శశికళ సైతం ఆమె వెంట వెళుతున్నారు.
ఈ ఆయోమయ పరిస్థితిపై సచివాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కొడనాడుకు వె ళ్లి అక్కడి నుండే పరిపాలన చేస్తారని, 15 లేదా 20 రోజుల పాటూ అక్కడ విశ్రాంతి తీసుకుని నెలాఖరుకు చెన్నై చేరుకుంటారని చెప్పారు. జయ రాగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని, అదే సమయంలో ఎమ్మెల్యేగా జయ ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు.