Kodanad
-
నేడు కొడనాడుకు జయ
♦ అనారోగ్యంతో విశ్రాంతికని ప్రచారం ♦ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండానే పయనం ♦ నేటి పారిశ్రామిక సదస్సుకు గైర్హాజరు? అనేక సమస్యలతో ఏడాదిగా సతమతమైన అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి కోసం నేడు కొడనాడు ఎస్టేట్‌కు పయనం అవుతున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో కొడనాడుకు చేరుకునేలా ఆమె ప్రయాణం ఖరారైంది. అనారోగ్యం కారణంగా చికిత్సతోపాటు విశ్రాంతి తీసుకునేందుకే ఆమె వెళుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజకీయ, అధికార కార్యకలాపాలతో అవిశ్రాంతంగా పనిచేసినపుడల్లా కొడనాడుకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం జయలలితకు అలవాటు. నీలగిరి జిల్లాలో భాగమైన కొడనాడు, ఊటీ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం అబ్బురపరుస్తుంది. జయ రాజ కీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలోనే కొడనాడు ఎస్టేట్‌ను సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు కొడనాడు ఎస్టేట్‌లో కొంతకాలం గడుపుతారు. 18 ఏళ్లుగా చెన్నై ఆతరువాత బెంగళూరు ప్రత్యేక కోర్టులో సాగిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు గత ఏడాది కొలిక్కి వచ్చి జయను జైలు పాలు చేసింది. సుమారు మూడువారాల పాటూ కర్నాటకలో జయ జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి చెన్నైకి చేరుకున్నా 9 నెలల పాటూ ఇంటికే పరిమితం అయ్యారు. మే 11 వ తేదీన కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా తీర్పు చెప్పిన తరువాత సైతం బాహ్యప్రపంచంలోకి రాలేదు. ముఖ్యమంత్రిగా వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నట్లుగా వ్యవహరించారు. అదే సమయంలో జయ అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత మే 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయటకు వచ్చారు. గత నెల 22వ తేదీన ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పొల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యే అయ్యేది ఎప్పుడో? జయ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం దృష్ట్యా ఆర్కేనగర్ ఉప ఎన్నిక హడావిడిగా ముంచుకొచ్చింది. ఈనెల 27 వ తేదీన పోలింగ్, 30వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తికాగా 1.5 లక్షల పైచిలుకు మెజార్టీతో అమ్మ అఖండ విజయం సాధించారు. అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని ఆశించి సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఆనాటి కార్యక్రమం రద్దయింది. ఈనెల 1 వ తేదీన అన్నాడీఎంకే అధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులతో చెన్నై ట్రేడ్ సెంటర్లో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి అమ్మ హాజరవుతారని ఆశించారు. పోయెస్గార్డన్ నుంచి గిండీ, రాజ్‌భవన్ మీదుగా చెన్నై ట్రేడ్ సెంటర్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సైతం జయ హాజరుకాకపోవడంతో మంత్రి పన్నీర్‌సెల్వం జయ సందేశాన్ని చదివి వినిపించారు. జయ అనారోగ్యంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆర్కేనగర్ ఎన్నిక ఫలితాలు వెలువడి నాలుగురోజులైనా ప్రమాణం తేదీ ఖరారు కాలేదు. రామనాథపురం జిల్లాలో కముదిలో 648 మెగావాట్ల సోలార్ విద్యుత్ పథకం అమలుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త అదాని గ్రూపుతో గతనెల 30వ తేదీన జయ భేటీ వాయిదా పడింది. సచివాలయానికి జయ రాకపోవడం వల్లనే సమావేశాన్ని వాయిదావేశారు. చెన్నైలోనే వేచిచూసిన అదాని అధికారులు తిరిగి వెళ్లిపోయారు. ఈనెల 4వ తేదీన జయ సమక్షంలో ఒప్పందం జరుగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే ఉదయం 11 గంటలకు జయ కొడనాడు పయనం అవుతుండగా ఒప్పందం జరుగుతుందా అనే అనుమానాలు చోటుచేసుకున్నాయి. ఈనెల 4వ తేదీ ఉదయం 11.50 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా కొడనాడు ఎస్టేట్‌కు బయలుదేరుతున్నారు. జయ నెచ్చెలి శశికళ సైతం ఆమె వెంట వెళుతున్నారు. ఈ ఆయోమయ పరిస్థితిపై సచివాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కొడనాడుకు వె ళ్లి అక్కడి నుండే పరిపాలన చేస్తారని, 15 లేదా 20 రోజుల పాటూ అక్కడ విశ్రాంతి తీసుకుని నెలాఖరుకు చెన్నై చేరుకుంటారని చెప్పారు. జయ రాగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని, అదే సమయంలో ఎమ్మెల్యేగా జయ ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. -
చెన్నైకి జయ
ముఖ్యమంత్రి జయలలిత కొడనాడులో విశ్రాంతి ముగించుకుని బుధవారం చెన్నైకు వచ్చేశారు. మీనంబాక్కం విమానాశ్రయంలో ఆమెకు ఆ పార్టీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. అత్యధిక స్థానాల్లో తమ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా సర్వేలు స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. సాక్షి, చెన్నై : ప్రధాని పీఠం లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికలను రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఎన్నికల పర్వం ముగియడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు కొడనాడు ఎస్టేట్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యవహారాలను సమీక్షిస్తూ వచ్చారు. పార్టీ బలోపేతం, పార్టీలో కొందరు నేతల నిర్లక్ష్యం, ఎన్నికల్లో నేతల పని తీరును రహస్యంగా సమీక్షించారు. మంత్రి వర్గంలో మార్పులు, పార్టీలో ప్రక్షాళన దిశగా కసరత్తులు పూర్తి చేసి ఉన్నారు. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రావడం అన్నాడీఎంకేలో ఆనందాన్ని నింపినట్టు అయింది. 40 కి 40 రాకున్నా, 30 వరకు రావచ్చన్న సర్వేలతో సంబరాలకు ఆ పార్టీ వర్గాలు సిద్ధం అవుతున్నాయి. దీంతో కొడనాడులో ఉన్న జయలలిత ఆగమేఘాలపై చెన్నైకి వచ్చేందుకు నిర్ణయించారు. బ్రహ్మరథం : పదిహేను రోజులకు పైగా కొడనాడు ఎస్టేట్‌కు పరిమితమైన జయలలిత బుధవారం మధ్యాహ్నం చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. ఈసందర్భంగా ఆమెకు కొడనాడులో ఘనంగా పార్టీ నేతలు వీడ్కోలు పలికా రు. కొడనాడు నుంచి చెన్నైకి, అక్కడి నుంచి ప్రధానిగా పార్లమెంట్లో అడుగు పెట్టే విధంగా ఫ్లక్సీలు పెద్ద ఎత్తున దారి పొడవున ఏర్పాటు చేయడం విశేషం. పార్టీ నేతలు కలై సెల్వన్, ఏకే సెల్వ రాజ్, అర్జునన్ల నేతృత్వంలో పెద్ద ఎత్తున మేళ తాళాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో జయలలితకు వీడ్కోలు పలికారు. రోడ్డు మార్గంలో కోయంబత్తూరు చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్నారు. జయలలితకు మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, మునుస్వామి, వైద్యలింగం, వలర్మతి, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్తో పాటుగా పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు స్వాగతం పలికారు. ఆత్రుతగా ఉంది: జయలలిత రాకతో మీడియా హడావుడి ఆరంభం అయింది. కేంద్రంలో మోడీ హవాను, రాష్ట్రంలో అన్నాడీఎంకేకు అత్యధిక సీట్లు రాబోతున్నట్టుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే గురించి ఆమెను కదిలించడం లక్ష్యంగా మీడియా పోయేస్ గార్డెన్‌లోని ఆమె ఇంటి వద్దకు చేరుకుంది. మీడియాను చూడగానే తన కాన్వాయ్ వేగాన్ని జయలలిత తగ్గించారు. తన ఇంటి ముందు మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ఏ మేరకు ఎదురు చూపుల్లో ఉన్నారో, తానుకూడా అదే విధంగా వేచి ఉన్నట్టు చెప్పారు. మోడీ హవా, ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రశ్నలు సంధించగా, వాటి జోలికి వెళ్లదలచుకోవడం లేదని, ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతానంటూ దాట వేస్తూ ముందుకు కదిలారు. -
కొడనాడుకు జయ
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి నిమిత్తం ఆదివారం కొడనాడుకు బయలుదేరారు. మీనంబాక్కం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ ఆమెకు వీడ్కోలు పలికారు. కొడనాడు ఎస్టేట్‌లో బ్రహ్మరథం పడుతూ జయలలితకు అక్కడి నేతలు స్వాగతం పలికారు. సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రధాని సింహాసనంపై కూర్చోవడం లక్ష్యంగా రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత కొంత కాలంగా వ్యూహ రచనలో నిమగ్నం అయ్యా రు. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి 40 స్థానాల కైవశమే లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఒంటి చేత్తో అభ్యర్థులను గెలిపించాలన్న కాంక్షతో నెలన్నరపాటు తీవ్ర ప్రచారం చేశారు. అవిశ్రాంతంగా ఆమె లోక్‌సభ పనుల్లో దూసుకెళ్లినా, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్నది మే 16 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎన్నికలు ముగియడంతో ఇన్నాళ్లు పడ్డ శ్రమ నుంచి కాస్త విశ్రాంతి తీసుకునే రీతిలో కార్యాచరణను జయలలిత సిద్ధం చేసుకున్నారు. పయనం:విశ్రాంతి నిమిత్తం ప్రతి ఏటా తాను వెళ్లే నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లడానికి జయలలిత నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం కొడనాడు ఎస్టేట్‌కు జయలలిత పయనం అయ్యారు. సరిగ్గా 11.45 గంటలకు పోయేస్ గార్డెన్నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ 12.15గంటలకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు బయలు దేరారు. పార్టీ ప్రిసీడి యం చైర్మన్ మధుసూదనన్, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి, వైద్యలిం గం, వలర్మతి, పళనియప్పన్, పార్టీ నాయకులు, కార్యకర్త లు పెద్ద ఎత్తున తరలి వచ్చి వీడ్కోలు పలికారు. కొడనాడు నుంచి నేరుగా పార్లమెంట్లో అడుగు పెట్టాలంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించడం విశేషం. బ్రహ్మరథం: కోయంబత్తూరు చేరుకున్న జయలలిత అక్కడి నుంచి హెలికాప్టర్లో కొడనాడుకు బయలు దేరారు. అక్కడి హెలిపాడ్ నుంచి కారులో ఎస్టేట్‌కు బయలుదేరిన ఆమెకు పార్టీ నాయకులు, అటవీ గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎస్టేట్ దారి పొడవున సచివాలయం, పార్లమెంట్ చిహ్నాలతో హోర్డింగ్‌లను హోరెత్తించారు. సచివాలయం నుంచి సీఎంగా కొడనాడుకు, కొడనాడు నుంచి పార్లమెంట్‌లోకి ప్రధానిగా అడుగు పెట్టాలని కాంక్షిస్తూ, హోర్డింగ్‌లలో పేర్కొనడం విశేషం. దారి పొడవున అటవీ గ్రామాల ప్రజల పారంపర్య సంగీతాలు, నృత్య ప్రదర్శనలతో జయలలితకు ఘన స్వాగతం పలికారు. నీలగిరి జిల్లా పార్టీ నాయకులు కలై సెల్వన్, లక్ష్మనన్, ఎంపీ కేఆర్ అర్జునన్, ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తరలి వచ్చి జయలలితకు బ్రహ్మరథం పట్టారు. కొద్ది రోజులు ఇక్కడి నుంచి జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్ని పరిశీలించనున్నారు. -
‘అమ్మ’కు విశ్రాంతి
సాక్షి, చెన్నై :అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి ఏటా నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు ముఖ్యమంత్రి జయలలిత వెళుతుంటారు. ప్రతి ఏటా వేసవిలో విశ్రాంతి నిమిత్తం ఆమె అక్కడకు వెళతారు. అధికారంలో లేని సమయంలో ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే వారు. అధికారంలోకి వచ్చాక, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించేవారు. ఇందు కోసం కొడనాడు ఎస్టేట్‌లో మినీ సచివాలయం సైతం ఏర్పాటు చేశారు. వ్యక్తిగత కార్యదర్శులు, ముఖ్య అధికారుల కోసం ఇక్కడ ప్రత్యేక వసతులు ఉన్నాయి. బిజీబిజీ: లోక్‌సభ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి క్షణం విశ్రాంతి లేకుండా జయలలిత కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు బాధ్యతలను స్వీకరించి, రేయింబవళ్లు కష్టపడ్డారు. తన సేనలను ఓ వైపు ప్రజల్లోకి పంపుతూ, మరో వైపు హెలికాప్టర్ ద్వారా గాల్లో చక్కర్లు కొడుతూ బహిరంగ సభల రూపంలో బిజీబిజీగా గడిపారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకునేందుకు జయలలిత నిర్ణయించారు. ఎటూ వేసవి కాలమే కాబట్టి, కొన్నాళ్లు కొడనాడులో గడిపేందుకు నిర్ణయించారు. దీంతో శనివారం కాసేపు సచివాలయంలో గడిపిన ఆమె అనంతరం పోయస్ గార్డెన్‌కు వెళ్లారు. ఆదివారం కొడనాడుకు బయలు దేరడానికి సిద్ధం అయ్యారు. ఆమె పర్యటన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో ఆమె వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలోని కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లనున్నారు. ఇది వరకు ఆమె వెంట రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు వెళ్లేవారు. అయితే, ఈ సారి వ్యక్తిగత కార్యదర్శుల్ని మాత్రం ఆమె వెంట బెట్టుకెళ్తున్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా, కొత్తగా ఏదేని కార్యక్రమాలు చేపట్టేందుకు, ప్రకటనలు, ఉత్తర్వులు ఇచ్చేందుకు వీలు లేదు. ఈ దృష్ట్యా, అధికారులను ఆమె పక్కన పెట్టేశారు. ఫలితాలను వెల్లడించే రోజున, తమకు లభించే ఆదరణ మేరకు ఆమె చెన్నైకు తిరుగు పయనం అయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఆస్పత్రుల బాట: జయలలిత విశ్రాంతికి సిద్ధం అయితే, ఆమె సేనలు పలువురు మంత్రులు ఆస్పత్రులబాట పట్టారు. తమ నియోజకవర్గాల పరిధిల్లోని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు తీవ్రంగానే శ్రమించారు. అభ్యర్థి ఓడిన పక్షంలో, ఎక్కడ తమ పదవులు ఊడుతాయోనన్న బెంగ మంత్రులను వెంటాడింది. దీంతో తమ వ్యక్తిగత వ్యవహారాలన్నీ పక్కన పెట్టి, గ్రామాల్లోను, తమకు పట్టున్న ప్రాంతాల్లోనూ తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే విధంగా మంత్రులు, ముఖ్య నాయకులు కుస్తీలు పట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో మంత్రులకు విశ్రాంతి లభించినా, అభ్యర్థి గెలుపు బెంగ వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఓట్ల వేటలో రేయింబవళ్లు పడ్డ శ్రమతో తాజాగా ఆస్పత్రుల బాట పట్టే పనిలో పలువురు మంత్రులు ఉన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి సంపత్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను చెన్నై థౌజండ్ లైట్స్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైనట్టు గుర్తించారు. ఆయనకు ఇది వరకు ఈ సమస్య ఉన్న దృష్ట్యా, ఆందోళన అవసరం లేదని వైద్యులు తేల్చారు. విశ్రాంతి తీసుకుంటే, అన్నీ సర్దుకుంటాయంటూ వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో మంత్రి కోయంబత్తూరులో అస్వస్థతకు గురయ్యా రు. పర్యావరణ శాఖ మంత్రిగా తోపు వెంకటాచలం అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్నూ వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మేఘాలయ హోం మంత్రి వజ్రి హృదయ సంబంధిత సమస్యతో థౌజండ్ లైట్స్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.