ముఖ్యమంత్రి జయలలిత కొడనాడులో విశ్రాంతి ముగించుకుని బుధవారం చెన్నైకు వచ్చేశారు. మీనంబాక్కం విమానాశ్రయంలో ఆమెకు ఆ పార్టీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. అత్యధిక స్థానాల్లో తమ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా సర్వేలు స్పష్టం చేస్తుండడంతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.
సాక్షి, చెన్నై : ప్రధాని పీఠం లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికలను రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఎన్నికల పర్వం ముగియడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు కొడనాడు ఎస్టేట్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యవహారాలను సమీక్షిస్తూ వచ్చారు. పార్టీ బలోపేతం, పార్టీలో కొందరు నేతల నిర్లక్ష్యం, ఎన్నికల్లో నేతల పని తీరును రహస్యంగా సమీక్షించారు. మంత్రి వర్గంలో మార్పులు, పార్టీలో ప్రక్షాళన దిశగా కసరత్తులు పూర్తి చేసి ఉన్నారు. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రావడం అన్నాడీఎంకేలో ఆనందాన్ని నింపినట్టు అయింది. 40 కి 40 రాకున్నా, 30 వరకు రావచ్చన్న సర్వేలతో సంబరాలకు ఆ పార్టీ వర్గాలు సిద్ధం అవుతున్నాయి. దీంతో కొడనాడులో ఉన్న జయలలిత ఆగమేఘాలపై చెన్నైకి వచ్చేందుకు నిర్ణయించారు.
బ్రహ్మరథం :
పదిహేను రోజులకు పైగా కొడనాడు ఎస్టేట్‌కు పరిమితమైన జయలలిత బుధవారం మధ్యాహ్నం చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. ఈసందర్భంగా ఆమెకు కొడనాడులో ఘనంగా పార్టీ నేతలు వీడ్కోలు పలికా రు. కొడనాడు నుంచి చెన్నైకి, అక్కడి నుంచి ప్రధానిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టే విధంగా ఫ్లక్సీలు పెద్ద ఎత్తున దారి పొడవున ఏర్పాటు చేయడం విశేషం. పార్టీ నేతలు కలై సెల్వన్, ఏకే సెల్వ రాజ్, అర్జునన్‌ల నేతృత్వంలో పెద్ద ఎత్తున మేళ తాళాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో జయలలితకు వీడ్కోలు పలికారు. రోడ్డు మార్గంలో కోయంబత్తూరు చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్నారు. జయలలితకు మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, మునుస్వామి, వైద్యలింగం, వలర్మతి, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్‌తో పాటుగా పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు స్వాగతం పలికారు.
ఆత్రుతగా ఉంది:
జయలలిత రాకతో మీడియా హడావుడి ఆరంభం అయింది. కేంద్రంలో మోడీ హవాను, రాష్ట్రంలో అన్నాడీఎంకేకు అత్యధిక సీట్లు రాబోతున్నట్టుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వే గురించి ఆమెను కదిలించడం లక్ష్యంగా మీడియా పోయేస్ గార్డెన్‌లోని ఆమె ఇంటి వద్దకు చేరుకుంది. మీడియాను చూడగానే తన కాన్వాయ్ వేగాన్ని జయలలిత తగ్గించారు. తన ఇంటి ముందు మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ఏ మేరకు ఎదురు చూపుల్లో ఉన్నారో, తానుకూడా అదే విధంగా వేచి ఉన్నట్టు చెప్పారు. మోడీ హవా, ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రశ్నలు సంధించగా, వాటి జోలికి వెళ్లదలచుకోవడం లేదని, ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతానంటూ దాట వేస్తూ ముందుకు కదిలారు.
చెన్నైకి జయ
Published Thu, May 15 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement