రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి నిమిత్తం ఆదివారం కొడనాడుకు బయలుదేరారు. మీనంబాక్కం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు పన్నీరు సెల్వం,
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి నిమిత్తం ఆదివారం కొడనాడుకు బయలుదేరారు. మీనంబాక్కం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ ఆమెకు వీడ్కోలు పలికారు. కొడనాడు ఎస్టేట్‌లో బ్రహ్మరథం పడుతూ జయలలితకు అక్కడి నేతలు స్వాగతం పలికారు.
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రధాని సింహాసనంపై కూర్చోవడం లక్ష్యంగా రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత కొంత కాలంగా వ్యూహ రచనలో నిమగ్నం అయ్యా రు. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి 40 స్థానాల కైవశమే లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఒంటి చేత్తో అభ్యర్థులను గెలిపించాలన్న కాంక్షతో నెలన్నరపాటు తీవ్ర ప్రచారం చేశారు. అవిశ్రాంతంగా ఆమె లోక్‌సభ పనుల్లో దూసుకెళ్లినా, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్నది మే 16 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎన్నికలు ముగియడంతో ఇన్నాళ్లు పడ్డ శ్రమ నుంచి కాస్త విశ్రాంతి తీసుకునే రీతిలో కార్యాచరణను జయలలిత సిద్ధం చేసుకున్నారు.
పయనం:విశ్రాంతి నిమిత్తం ప్రతి ఏటా తాను వెళ్లే నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లడానికి జయలలిత నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం కొడనాడు ఎస్టేట్‌కు జయలలిత పయనం అయ్యారు. సరిగ్గా 11.45 గంటలకు పోయేస్ గార్డెన్‌నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ 12.15గంటలకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు బయలు దేరారు. పార్టీ ప్రిసీడి యం చైర్మన్ మధుసూదనన్, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి, వైద్యలిం గం, వలర్మతి, పళనియప్పన్, పార్టీ నాయకులు, కార్యకర్త లు పెద్ద ఎత్తున తరలి వచ్చి వీడ్కోలు పలికారు. కొడనాడు నుంచి నేరుగా పార్లమెంట్‌లో అడుగు పెట్టాలంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించడం విశేషం.
బ్రహ్మరథం: కోయంబత్తూరు చేరుకున్న జయలలిత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొడనాడుకు బయలు దేరారు. అక్కడి హెలిపాడ్ నుంచి కారులో ఎస్టేట్‌కు బయలుదేరిన ఆమెకు పార్టీ నాయకులు,
అటవీ గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎస్టేట్ దారి పొడవున సచివాలయం, పార్లమెంట్ చిహ్నాలతో హోర్డింగ్‌లను హోరెత్తించారు. సచివాలయం నుంచి సీఎంగా కొడనాడుకు, కొడనాడు నుంచి పార్లమెంట్‌లోకి ప్రధానిగా అడుగు పెట్టాలని కాంక్షిస్తూ, హోర్డింగ్‌లలో పేర్కొనడం విశేషం. దారి పొడవున అటవీ గ్రామాల ప్రజల పారంపర్య సంగీతాలు, నృత్య ప్రదర్శనలతో జయలలితకు ఘన స్వాగతం పలికారు. నీలగిరి జిల్లా పార్టీ నాయకులు కలై సెల్వన్, లక్ష్మనన్, ఎంపీ కేఆర్ అర్జునన్, ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తరలి వచ్చి జయలలితకు బ్రహ్మరథం పట్టారు. కొద్ది రోజులు ఇక్కడి నుంచి జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్ని పరిశీలించనున్నారు.