వేతన పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ల కోరిక నెరవేరింది. వేతనాన్ని పెంచడానికి సీఎం జయలలిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూజీ వైద్యులకు రూ.8500 నుంచి 13 వేలకు వేతనాలను పెంచుతూ అసెంబ్లీలో మంగళవారం ప్రత్యేక ప్రకటన చేశారు.
సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజీ, పీజీ వైద్యులు 4088 మంది తమ సేవలను అందిస్తున్నారు. వీరికి నెల వేతనంగా రూ.8500(యూజీ), రూ.18000 (పీజీ) అందిస్తున్నారు. అయితే, ఇవి తమకు కంటి తుడుపు చర్యేనంటూ జూనియర్లు కొంత కాలంగా గగ్గోలు పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో యూజీ జూనియర్ డాక్టర్లకు రూ.20 వేలు, పీజీ జూనియర్ డాక్టర్లకు రూ.45 వేల వరకు వేతనాలు ఇస్తున్నారని, తమకు ఆ మేరకు వేతనా లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పలు రూపాల్లో తమ నిరసనల్ని జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తూ వచ్చారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో చివరకు తమ సమస్యలు సీఎం జయలలిత దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా గత నెల ఒక రోజు సమ్మె చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల్లో తమకు వేతన పెంపు ప్రకటన వెలువడుతుందా? అన్న ఆశతో ఎదురు చూశారు. ఈ సమావేశాల్లో వెలువడే ప్రకటన మేరకు నిరవధిక సమ్మె లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే, సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనతో జూనియర్ డాక్టర్ల కోరికను నెరవేర్చే యత్నం చేశారు. వేతన పెంపు : పక్క రాష్ట్రాలతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్‌ను జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే, ఆ రాష్ట్రాల్లోని వేతనాల జోలికి ప్రభుత్వం వెళ్ల లేదు. యూజీ డాక్టర్లకు వేతనాన్ని రూ.8500 నుంచి రూ.13 వేలకు పెంచుతూ సీఎం జయలలిత ప్రకటించారు. అలాగే, పీజీ వైద్యులకు ఏడాదికా ఏడాది చొప్పున వేతన పెంపునకు చర్యలు తీసుకున్నారు.
పీజీ మొదటి సంవత్సరం డాక్టర్లకు రూ.18 నుంచి 25 వేలుగా, రెండో సంవత్సరం రూ.19 నుంచి 26 వేలుగా, మూడో సంవత్సరం 20 నుంచి 27 వేలుగా పెంచుతూ నిర్ణయించారు. అదనపు కోర్సులు అభ్యసిస్తున్న యూజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం రూ.18 వేలు నుంచి రూ. 25వేలుగా, రెండో సంవత్సరం 19 వేలు నుంచి రూ. 26 వేలుగా వేతనం పెంచారు. ప్రత్యేక ఉన్నత కోర్సుల్ని అభ్యసిస్తూ జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న మొదటి సంవత్సరం వారికి రూ.21 వేలు నుంచి రూ. 30 వేలుగా, రెండో సంవత్సరం రూ.22 నుంచి రూ.30వేలుగా, మూడో సంవత్సరం రూ.23 నుంచి 30 వేలుగా వేతనం పెంచారు. ఎముకల శస్త్ర చికిత్స విభాగం కోర్సుల్ని అభ్యసిస్తున్న యూజీ డాక్టర్లకు నాలుగో సంవత్సరం రూ.21 నుంచి రూ. 30 వేలుగా, ఐదో సంవత్సరం రూ. 25వేలు నుంచి రూ. 30 వేలుగా, ఆరో సంవత్సరం రూ. 30 వేలుగా పెంచుతూ నిర్ణయించారు. యూజీలకు నెలసరి ఉపకార వేతనం రూ.400, యూజీలకు రూ.700 పెంచారు. ప్రభుత్వ ప్రకటనతో జూడాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. జూడాల సంఘం సమావేశానంతరం ఈ వేతనాన్ని ఆహ్వానించడం లేదా, తిరస్కరించడమా అనేది నిర్ణయించనున్నారు.