సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
చెన్నై, సాక్షి ప్రతినిధి: గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగిస్తూ 2011 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకంజ వేయలేదని అన్నారు. ప్రభుత్వ బస్సు ల్లో సీనియర్ సిటిజన్లు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని ఆనాటి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నామని తెలిపారు. 60 ఏళ్ల కు పైబడిన వ్యక్తులకు బస్సు డిపోల నుంచి పది టోకెన్లను పొందవచ్చని, ఈ టోకెన్లను కండక్టరుకు ఇచ్చి ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. సీని యర్ సిటిజన్లు బస్సు డిపోల్లో దరఖాస్తులను భర్తీ చేసి ఫొటో గుర్తింపు కార్డు ను పొందాల్సి ఉంటుందని చెప్పారు. గుర్తింపు కార్డులను ఏఏ డిపోల్లో జారీ చేస్తారో వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. గుర్తింపుకా ర్డు జారీకి తుది గడువు అంటూ ఏమీ విధించలేదని, అవసరమైన వారు ఎప్పుడైనా పొందవచ్చని ఆమె తెలి పారు. తొలిదశగా ఈ సౌకర్యాన్ని చెన్నైలో 24వ తేదీ నుంచి అమలుచేస్తున్నట్లు చెప్పారు.
మంత్రుల వైఖరికి నిరసనగా వాకౌట్:
అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌లోని అంశాలపై డీఎండీకే ఎమ్మెల్యే చర్చ ను లేవనెత్తగా మంత్రులు పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, నత్తం విశ్వనాథన్, పళనియప్పన్, వేలుమణి, తొప్పు వెంకటాచలం వరుసగా అడ్డుతగిలారు. తమ పార్టీతో పొత్తు వల్ల ఎమ్మెల్యేలు అయిన మీరంతా అమ్మ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు కృతజ్ఞతలు చెప్పాలని వ్యాఖ్యానించారు. తాము కూటమిలో చేరకుంటే మీరు మంత్రులు అయ్యేవారు కాదంటూ వారి విమర్శలను చంద్రకుమార్ తిప్పికొట్టారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వేరుపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసీటు కూడా దక్కలేదని మంత్రులు మరోసారి ఎద్దేవా చేశారు.
ఇరుపక్షాలు వాదులాడుకోగా డీఎండీకే ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే తమ మాటలు రికార్డుల నుంచి తొలగిస్తారా అంటూ చంద్రకుమార్ స్పీకర్‌ను నిలదీశారు. ఆధారం లేని ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తామని, తనను ప్రశ్నించే అధికారం మీకు లేదని స్పీకర్ పేర్కొన్నారు. డీఎండీకే ఎమ్మెల్యేలపై మంత్రులు, స్పీకర్ మూకుమ్మడిగా మాటల దాడికి దిగడంతో నిరసనగా వాకౌట్ చేశారు. డీఎండీకేతోపాటు డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి.
అధికారంలో ఉన్న అహంకారంతో మంత్రులు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని విపక్షాలకు చెందిన సభ్యులు ఆరోపించారు. మంత్రుల వైఖరితో విసిగిపోయినందునే అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసినట్లు డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయ ప్రాంగణంలో మీడియాకు తెలిపారు. బడ్జెట్‌లో పొందుపరిచిన పది అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రసంగించేందుకు తాను చేసిన ప్రయత్నాలను మంత్రులు అడ్డుకున్నారని చంద్రకుమార్ తెలిపారు. ఈ పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాల్లో కొనసాగలేక బైటకు వచ్చేశామని వివరించారు.