
మారిన అభ్యర్థులు
సీటు వచ్చిందన్న ఆనందం గంటల వ్యవధిలో ఆవిరి అవుతుండడం అన్నాడీఎంకే
అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏ అభ్యర్థిని
అమ్మ మారుస్తారో అన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఇందుకు కారణం మంగళ
వారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రంలోపు పదమూడు మంది అభ్యర్థుల్ని
మార్చడమే పల్లావరం సీటు, సినీ నటి సీఆర్ సరస్వతిని వరించింది.
టీనగర్ బరిలో సత్యనారాయణ అలియాస్ టీ నగర్ సత్యను దించారు.
సాక్షి, చెన్నై : మళ్లీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అందరికన్నా ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 227 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు, ఏడు స్థానాలు మిత్రులకు కేటాయించి, అందరూ రెండాకుల చిహ్నం మీద బరిలోకి దిగే విధంగా కార్యాచర ణ సిద్ధం చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటిం చి రెండు రోజులైనా కాక ముందే, పలువురిపై విమర్శలు ఆరోపణలు బయలు దేరి ఉన్నా యి.
ఓ అభ్యర్థి అయితే, సీటు దక్కిందన్న ఆనందంతో పార్టీ జెండా తలకిందులుగా ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. ఇ లా, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న వారితో పాటుగా జెండాను తలకిందులుగా ఎగుర వేసినందుకుగాను ఆ అభ్యర్థి సీటు గం టల్లో గల్లంతు కాక తప్పలేదు. అలాగే, పార్టీలో సీనియర్లుగా, బలమైన నాయకులుగా ఉన్న వాళ్లకు చోటు దక్కక పోవడం చర్చకు దారి తీయడంతో, వారికి అవకాశం కల్పించే దిశగా జాబితాలో మార్పుల దిశగా జయలలిత ముందుకు సాగుతున్నారు.
అభ్యర్థులను మార్చడం జయలలితకు కొత్తేమి కాదన్న విషయం తెలిసిందే. అయితే, సీటు దక్కించుకున్న వాళ్లు ఆనందంలో కేరింత లు కొట్టేందుకు కూడా సాహసించ లేని పరిస్థితి. ఒక వేళ కొట్టిన గంట వ్యవధిలో ఆవిరి అవుతున్నాయి. ఇందుకు కారణం ఎవరి అభ్యర్థిత్వం ఎప్పుడు ఊడుతుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉండడమే. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రంలోపు పన్నెండు మంది అభ్యర్థులను జయలలిత మార్చడం గమనార్హం.
మారిన అభ్యర్థులు : ఇది వరకు ప్రకటించిన జాబితాలో మార్పులు చేర్పులతో కొన్ని స్థానాలకు అభ్యర్థులను మారుస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ప్రకటించిన అభ్యర్థుల్ని తొలగించి కొత్త పేర్లను ప్రకటించారు. ఆ మేరకు పల్లావరం బరిలో సినీ నటి సీఆర్ సరస్వతిని రంగంలోకి దించారు. టీ నగర్ నుంచి సత్యనారాయణ పోటీ చేస్తారని ప్రకటించారు.
మెట్టూరు నియోజకవర్గంలో పార్టీ నిర్వాహక కార్యదర్శి సెమ్మలై, కాట్టుమన్నార్ కోవిల్ కడలూరు వెస్ట్ జిల్లా కార్యదర్శి మురుగమారన్, పూంబుహార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎస్ పొన్‌రాజ్, వేదారణ్యం నుంచి ఓఎస్ మణియన్, మన్నార్ కుడి నుంచి నీడామంగళం పదమూడో వార్డు సభ్యుడు ఎస్ కామరాజ్, నాగుర్ కోవిల్ నుంచి ఎమ్మెల్యే నాంజిల్ మురుగన్, మదురై ఉత్తరం నియోజకవర్గం నుంచి రాజన్ చెల్లప్ప పోటీ చేస్తారని, అరుప్పుకోటై నుంచి వైగై సెల్వన్ బుధవారం జయలలిత ప్రకటించారు.
అలాగే, పుదుచ్చేరిలోని తిరుబువనం నుంచి శంకర్, తిరునల్లారు నుంచి జి మురుగయ్యన్, కారైక్కాల్ నుంచి కేఏ హసన్ పోటీ చేస్తారని ప్రకటించడం గమనార్హం. అభ్యర్థుల మార్పు పర్వానికి అమ్మ శ్రీకారం చుట్టడంతో, ఏ క్షణాన ఏ నియోజకవర్గానికి అభ్యర్థులు మారుతారో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. అలాగే, వాసన్ నేతృత్వంలోని తామాకాతో చర్చలు సాగుతుండటంతో వారికి సీట్ల కేటాయింపు నిమిత్తం, ఎవరి అభ్యర్థితత్వం గల్లంతు కాబోతున్నదో అన్న ఎదురు చూపులు అన్నాడీఎంకేలో బయలుదేరాయి.
అమ్మ దర్శనం కరువు : సీటు వచ్చిందన్న ఆనందంతో పలువురు అభ్యర్థులు చెన్నై పోయెస్ గార్డెన్ బాట పట్టారు. అమ్మను కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వారికి పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకోలేదటా. దీంతో అక్కడి గేట్ నుంచే అమ్మకు అందజేసే విధంగా పుష్పగుచ్చాలను అప్పగించి వెను దిరుగుతుండడం గమనార్హం. ఇక, అన్నాడీఎంకేలోని యాభై జిల్లాల కార్యదర్శుల్ని ఆగమేఘాలపై చెన్నైకు పిలిపించారు. అమ్మ ప్రచార పర్యటన ఏర్పాట్లు, ఎన్నికల కసరత్తులపై పార్టీ సిద్ధాంతల ప్రచార కార్యదర్శి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై వారికి ఉపదేశాలు ఇవ్వడం విశేషం. అదే సమయంలో నాగపట్నం జిల్లా కార్యదర్శిగా వ్యవహరించిన జయపాల్‌ను తొలగించి ఆయన స్థానంలో వేదారణ్యం అభ్యర్థి ఓఎస్ మణియన్‌ను నియమించారు.