
అమ్మ బొమ్మపై రచ్చ
సాక్షి, చెన్నై: పురట్చి తలైవి(విప్లవ వనిత)గా జయలలిత పేరు ఒకప్పుడు అన్నాడీఎంకే వర్గాల నోట పలికింది. తమ అధినేత్రి జయలలిత మూడో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అన్నాడిఎంకే వర్గాల నోట ‘అమ్మ’ జపం ఆరంభమైంది. తమ సొంత తల్లిగా జయలలితను భావించే నేతలు, కార్యకర్తలు ఎందరో అమ్మా..అమ్మా...ఎంగల్ అమ్మా...అంటూ ఓ గీతాన్ని సైతం సిద్ధం చేశారు. జయలలిత ఎక్కడెక్కడ సభలకు హాజరవుతారో, అన్నాడీఎంకే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ ఆ పాట మార్మోగాల్సిందే. మూడో సారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక, కొన్ని కఠిన నిర్ణయాలు సైతం జయలలిత తీసుకున్నారు.
ఫ్లెక్సీల్లో, బ్యానర్లలో, ప్రచార వేడుకల్లో ఎక్కడైనా సరే దివంగత నేత ఎంజీయార్ చిత్ర పటం, తన చిత్ర పటం మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అమ్మ జపం రోజు రోజుకూ రాష్ట్రంలో పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల మంత్రులు పోటీ పడి మరి అమ్మ పేరుతో ఏదో ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న కాంక్షతో పరుగులు తీశారు. ఆ దిశగా అమ్మ క్యాంటీన్లు, అమ్మ కూరగాయాల దుకాణాలు, అమ్మ మెడికల్స్, అమ్మ ఉప్పు, అమ్మ మినరల్స్ ఇలా అన్నింట్లోను జయలలిత చిత్ర పటాలే. తాజాగా జయలలిత కారాగార వాసంలో ఉండడంతో ఆ బొమ్మలు వివాదానికి దారి తీశాయి.
అన్నింటిపైనా అదే బొమ్మ: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫొటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరి. ఆ దిశగా అన్ని కార్యాలయాల్లోనూ ఇది వరకు జయలలిత చిత్ర పటాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అమ్మ జపం పాటించే వాళ్లు అత్యుత్సాహంతో రెండు మూడు ఫొటోలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో జయలలిత ఫొటో లేకుండా ఉండే ప్రసక్తే లేదు. ఉచిత పథకాలు, బస్టాండ్లు ఎక్కడ చూసినా జయలలిత చిత్ర పటాలే. తాజాగా జయలలిత జైలుకు వెళ్లడంతో ఆ చిత్ర పటాల్ని తొలగించాల్సిన అవసరం వచ్చింది. అయితే, తమ అమ్మ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశ, బెయిల్ మీద వస్తారన్న కాంక్షతో అన్నాడీఎంకే వర్గాలు ఆ చిత్ర పటాల్ని తొలగించకుండా, ఇంకా అమ్మ మంత్రం పటిస్తూనే ఉండడం రచ్చకెక్కుతోంది.
వివాదం: ఈ బొమ్మ రచ్చను వివాదం చేసే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. డీఎండీకే, డీఎంకే, ఎండీఎంకే, పీఎంకే , బీజేపీ నేతలు ఆ బొమ్మలు తొలగించాలని పట్టుబడుతున్నారు. అయితే, అధికార వర్గాలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారుు. రాష్ట్రంలో అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉన్న దృష్ట్యా, ఎక్కడ పాలకుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న బెంగ అధికారుల్ని వెంటాడుతోంది. ఇక పాలకులంటారా..? తొలగించే ప్రసక్తే లేదన్నట్టుగా అమ్మ బెయిల్ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించారు. దీంతో వివాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పాలకులు బొమ్మలను తొలగించని దృష్ట్యా, రంగంలోకి దిగి రంగులు వేస్తామన్న పరోక్ష హెచ్చరికలకు ప్రతి పక్షాలు సిద్ధమవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ కార్యదర్శికి డీఎంకే అల్టిమేటం ఇవ్వడం అధికార వర్గాలను సందిగ్ధంలో పడేసింది.
అల్టిమేటం: అసెంబ్లీ కార్యదర్శికి డీఎంకే పార్టీ కార్యాలయం గురువారం లేఖ రాసింది. జయలలిత కారాగారవాసాన్ని గుర్తు చేస్తూ, ఆమె చిత్ర పటాల్ని తొలగించేందుకు చర్యలు తీసుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు శిక్షతో అవినీతి మచ్చ పడ్డ జయలలిత చిత్ర పటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పథకాల్లో ఇంకా ఉండడం సమంజసమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవికి జయలలిత అనర్హురాలైనా ఇంత వరకు శ్రీరంగం అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టుగా ఎందుకు ప్రకటించడం లేదని శివాలెత్తారు. ఆమె ప్రాతినిథ్యం వహించిన స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్యాంటీన్లు, మినరల్ వాటర్ బాటిళ్లు, విక్రయ కేంద్రాలు, ఉప్పు ప్యాకెట్లు, ఫార్మసీలు తదితర పథకాల్లో జయలలిత ఫొటోలను 24 గంటల్లో తొలగించకుంటే, కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దీంతో ఎక్కడ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందోనన్న బెంగ అధికార వర్గాల్లో నెలకొంది. ఈ బొమ్మ వివాదం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనను అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.