ఆర్భాటం జాస్తి.. వాస్తవం నాస్తి: జేపీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన ‘ఆర్భాటం జాస్తి – వాస్తవం నాస్తి’ అన్నట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అంతా ఈవెంట్ మేనేజ్‌మెంట్. ప్రతి రోజూ పెద్ద ఆర్భాటం. ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పిస్తున్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో మన పిల్లలకు ఉపాధి కల్పించడం కోసం ఏం చేయాలన్న దానిపై లోతైన అవగాహన, దిశా నిర్దేశం కొరవడింది’ అన్నారు.
విద్య, ఆరోగ్యం విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చేయకుండా మ్యాజిక్‌లు, చిట్కాలతో ఏ రాష్ట్రం బాగుపడలేదని చెప్పారు. ఆర్భాటాలు, ప్రగల్బాల రాష్ట్రంగా, పత్రికల్లో ప్రచారం పొందే రాష్ట్రంగా మిగిలిపోతోందని అన్నారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది అనవసర చర్చ అని, యువతకు ఉపాధి అవకాశాలు కలిగేలా కేంద్రం నుంచి పారిశ్రామిక రాయితీలు పొందాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సీఎంను ఎన్నుకోవాలి : తమిళనాడు ఉదంతం చూస్తుంటే రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు దిగజారుతున్నాయన్నది మరోసారి నిరూపణ అయిందని జయప్రకాష్ నారాయణ అన్నారు. సీఎం పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలకు తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధులు ఎన్నికలప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటూ పార్టీ మారిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.