సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం జీన్స్ తయారీ పరశ్రమపై కూడా పడే అవకాశం కన్పిస్తోంది. జీన్స్ తయారీ సంస్థలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారే అత్యధికం. బంద్ ఇలాగే కొనసాగితే దాని ప్రభావం తమపై పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొన్ని వేల మంది ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జీన్స్ వాష్ కార్ఖానాలు వాడుతున్న రసాయనాలతో కాలుష్యం పెరిగిపోతోందని, వెంటనే వాటిని మూసివేయాలని కాలుష్య నియంత్రణ విభాగం జారీ చేసిన నోటీసులను నిరసిస్తూ ఉల్లాస్‌నగర్‌లోని సుమారు 450 జీన్స్ వాష్ కార్ఖానాలు గత పది రోజులకుపైగా బంద్ పాటిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఉల్లాస్‌నగర్‌లోని కొందరు తెలుగువారితో ‘సాక్షి’ మాట్లాడింది. వారు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే ...
ఇలా అయితే జీన్స్ తయారీ ఆపేయాల్సిందే...
- దాసరి వెంకటేశ్వర్‌రావు, జీన్స్ తయారీ
పరిశ్రమ యజమాని
జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం పరోక్షంగా జీన్స్ తయారీపై కూడా పడనుంది. మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం. 20 ఏళ్ల కిందట ఇక్కడికి ఉపాధి కోసం వచ్చాను. ఇక్కడే జీన్స్ కుట్టడం నేర్చుకున్నాను. ప్రస్తుతం రెండవ నంబర్ ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ తయారీ కార్ఖానాను సొంతంగా పెట్టుకుని పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. మా వద్ద లేడీస్ జీన్స్ ఎక్కువగా తయారవుతాయి. ఈ జీన్స్‌ను కొన్ని రకాల రసాయనాల మిశ్రమంలో వాష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మా వద్ద జీన్స్ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. బంద్ ఇలాగే కొనసాగితే మేం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. అదే జరిగితే వేలాదిమంది రోడ్డున పడాల్సి వస్తుంది.
గతంలో రెండుసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా..
- కముజు శ్రీను, టైలర్
నాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం. 24 ఏళ్లుగా ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పదేళ్ల కిందట ట్యాక్స్ వివాదం చెలరేగి సుమారు మూడు నెలలకు పైగా కార్ఖానాలు బంద్ ఉంచారు. దీంతో టైలర్లు రోడ్డున పడాల్సి వచ్చింది. తిరిగి 2005లో వచ్చిన వరదల కారణంగా చాలా రోజులపాటు పరిశ్రమ మూతపడింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం అంత దయనీయస్థితి లేకపోయినా బంద్ ఇలాగే కొనసాగితే మా పరిస్థితి తిరిగి దయనీయంగా మారే అవకాశముంది.
ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నాను..
- అప్పారి శ్రీను, టైలర్
మాది తూర్పుగోదావరి జిల్లా కావలిపురం మండలం. బాల్యం నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. ఈ బంద్ ఇంకా కొనసాగితే ఇబ్బందులు ప్రారంభమవుతాయి. వేలాదిమంది నాలాంటి ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
బంద్‌తో ఇబ్బందులే..
Published Wed, Jan 1 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement