Ulhasnagar
-
తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి
ముంబై: కష్టపడి పెంచి పెద్ద చేసింది.. తండ్రి లేని లోటును పూడుస్తూ.. అన్నీ తానై వ్యవహరించి స్థితిమంతులుగా తీర్చిదిద్దింది. అటువంటి మాతృమూర్తికి పుట్టిన రోజు సందర్భంగా ఓ తనయుడు అరుదైన కానుక అందించాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ ఎరుగని గిఫ్ట్ ఇవ్వడంతో ఆ తల్లి ఆనందంలో మునిగి తేలింది. ఆమె కళ్లల్లో ఆనందం చూసి ఆ తనయుడు తన్మయత్వం పొందాడు. ఆ తల్లీకుమారుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన రేఖకు ముగ్గురు సంతానం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అర్దాంతరంగా తనువు చాలించాడు. అప్పటి నుంచి పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది. ఇతరుల ఇళ్లల్లో పనిచేసి వీరిని పోషించింది. ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో స్థిరపడేలా శక్తి మేరకు కష్టపడింది. తల్లి కష్టానికి తగ్గట్టు పిల్లలు స్థిరపడ్డారు. అయితే 19వ తేదీన తల్లి 50వ జన్మదినం సందర్భంగా ఆమె చిరకాల కోరిక నెరవేర్చాలని పెద్ద కుమారుడు ప్రదీప్ నిర్ణయించుకున్నాడు. ప్రఖ్యాత్య ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్న కుమారుడు ప్రదీప్ తన చిన్నప్పుడు ఇంటిపై ఉండగా హెలికాప్టర్ వెళ్తుంటే ‘మనం ఎప్పుడైనా అందులో కూర్చోగలమా’ అని తల్లి ఆవేదన చెందింది. ప్రదీప్ ఆ మాటను అప్పటి నుంచి మనసులో దాచుకున్నాడు. ఎలాగైనా అమ్మను హెలికాప్టర్ ఎక్కించాలని ధ్రుడంగా అనుకున్నాడు. ఇప్పుడు స్థితిమంతులుగా కావడంతో కుమారుడు ప్రదీప్ తల్లి 50వ జన్మదినోత్సవం సందర్భంగా హెలికాప్టర్ ఎక్కించాడు. జుహు ఎయిర్‌బేస్‌కు వెళ్లి తల్లితో పాటు కుటుంబసభ్యులను హెలికాప్టర్లో కూర్చొబెట్టారు. ఉల్లాస్‌నగర్ పట్టణమంతా హెలికాప్టర్ రెండు రౌండ్లు చక్కర్లు కొట్టింది. కుమారుడు తన మాటలను గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ కోరిక తీర్చడంతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆకాశం ఎత్తుపై నుంచి భూమిని చూస్తుండగా పిల్లలు కేరింతలు కొట్టగా.. ఆ తల్లి మాత్రం కుమారుడిని చూస్తూ కన్నీళ్లు రాల్చింది. ఆ తల్లీకుమారుడు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తల్లీకుమారుల ప్రేమానుబంధంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన ఆ కుమారుడిని ప్రశంసిస్తున్నారు. -
ప్రధాని మోదీకి సొంత తమ్ముడు షాక్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ షాకిచ్చారు. మోదీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) చెల్లించవద్దని ప్రహ్లాద్ మోదీ వ్యాపారస్తులకు సూచించారు. ‘మోదీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మీ సమస్యలు వినాలి’ అని వ్యాపారస్తులకు చెప్పారు. ‘మనమేమీ బానిసలం కాదు’ అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ‘జీఎస్టీ చెల్లించబోం’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం వ్యాపారుల సదస్సు జరిగింది. ఉల్హాస్నగర్ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు హాజరైన ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్హాస్నగర్ వ్యాపార కేంద్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. ‘గుజరాత్‌లోనైతే వ్యాపారానికి రసాయనాల వినియోగం అనుమతి ఉందని, రసాయన వ్యర్థాల నిర్వహణకు కూడా సరైన ప్రణాళిక ఉంది. గుజరాత్ అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదు’ అని నిలదీశారు. -
స్లాబ్ కూలి భవనానికి పెద్ద రంధ్రం: ఏడుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో స్లాబ్ కుప్పకూలింది. సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు ఆ స్లాబ్ కూలి అది కిందపడి మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్పకూలాయి. దీంతో అపార్ట్‌మెంట్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్డీఆర్ఎఫ్) బృందం స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ట్రాప్ చేసి.. బార్ ఎదుట 30 సార్లు పొడిచి
థానే: మహిళను ఎరగా వేసి.. ఆపై బార్‌కు రప్పించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని ఓ బార్లో మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీపక్ బోయిర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మనేర్ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దీపక్, నరేశ్ చావన్ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. ఓ మహిళ విషయంలో వారిద్దరూ పోట్లాటకు దిగారు. ఇది మనసులో పెట్టుకున్న చావన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతన్ని బార్‌కు రప్పించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్‌కు కాల్ చేసి బార్‌కు రావాలని కోరాడు. ట్రాప్ చేసి బార్‌కు రప్పించి.. దీంతో ట్రాప్‌లో చిక్కుకున్న దీపక్, అతని స్నేహితుడిని తీసుకుని మంగళవారం ఉదయం 1.30కు స్థానిక డ్యాన్స్ బార్‌కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే బార్ బయటికి వచ్చాడు. అయితే అక్కడే కాచుకుని ఉన్న చావన్, ఐదుగురు అనుచరులతో కలిసి వారిని చుట్టుముట్టారు. కత్తులు, తుపాకీలు తీసి వారిపై దాడికి యత్నించారు. దీంతో దీపక్, అతని స్నేహితుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు అందుకున్నారు. కానీ దీపక్ మధ్యలో జారి కింద పడటంతో దుండగులు దీపక్‌పై కత్తితో దాడి చేశారు. చాతీ, పొట్ట, వీపు ప్రాంతాల్లో 30 సార్లు కిరాతకంగా పొడిచి చంపారు. పాత కక్షలతోనే హత్య! ఈ విషయాన్ని దీపక్ స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీపక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అవడంతో, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే చావన్.. దీపక్‌ను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు దొరికిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
క్లాస్ రూమ్‌లో ఊడిపడిన సిమెంట్ పెచ్చులు
ముంబై : మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉల్హాస్‌నగర్‌లోని జులేలాల్ పాఠశాలలోని పదో తరగతి గదిలో విద్యార్థులు పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని జియా(16), ఇషిక(14), దియా(15)గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. కాగా, స్కూల్ యాజమాన్యం ఇది కేవలం చిన్న ఘటనేనని.. విద్యార్థులకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆ తరగతి గదిలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. #WATCH: Three students were injured after a portion of cement plaster collapsed on them while they were attending class in Ulhasnagar's Jhulelal School, Maharashtra yesterday. pic.twitter.com/luXzWD4TAI — ANI (@ANI) June 19, 2019 -
భార్యను చంపి.. సూట్‌కేస్‌లో పెట్టాడు!
ఉల్లాస్‌నగర్: బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు ఆమెను పొడిచిచంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. భార్య మృతదేహాన్ని ఎవరికీ కనపడకుండా తరలించడానికి తనకు సాయం చేయాలని కోరాడు. అయితే, స్నేహితుడు అందుకు అంగీకరించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని బండారం బట్టబయలైంది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉల్లాస్‌నగర్‌లోని విఠల్వాడికి చెందిన రాజేశ్ ఖాన్, జమీల భార్యాభర్తలు. అయితే, భార్య డ్యాన్సర్‌గా పనిచేస్తున్న జమీల పలువురి వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో పదునైన కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి స్నేహితుడు షఫీవుల్లా షేక్‌కు ఫోన్ చేశాడు. అయితే, షేక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజేశ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తానే జమీలను చంపినట్టు అతను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. -
హమ్మయ్య.. అమ్మానాన్నలను చేరింది
థానే: ఎట్టకేలకు ఓ పద్నాలుగేళ్ల బాలిక కిడ్నాపర్ల చెర నుంచి బయటపడింది. దాదాపు నెల రోజుల అనంతరం తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఉలన్ సాగర్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక గత మే 9నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తప్పిపోయినవారి జాబితాలో చేర్చి కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపులు మొదలు పెట్టారు. అయితే, పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నెల జూన్ 16న ఆ బాలిక బందీల చెరనుంచి తప్పించుకుని ముంబయిలోని దాదార్ ప్రాంతానికి చేరుకుంది. ఆమెను పోలీసులు చివరికి తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం కిడ్నాపర్లు ఆమెను గుజరాత్ తీసుకెళ్లి అమ్మేశారు. ఇందులో పూజా షద్దార్ అలియాస్ రుమా, శోభా జాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆ బాలికను గుజరాత్‌లోని గోవింద్ మఖ్వానా (60) అనే వ్యక్తికి రూ.65 వేలకు అమ్మేసినట్లు వివరాలు వెల్లడించారు. దీంతో పోలీసులు మఖ్వానాను, రాజు వాజా అనే ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
బంద్‌తో ఇబ్బందులే..
సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం జీన్స్ తయారీ పరశ్రమపై కూడా పడే అవకాశం కన్పిస్తోంది. జీన్స్ తయారీ సంస్థలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారే అత్యధికం. బంద్ ఇలాగే కొనసాగితే దాని ప్రభావం తమపై పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొన్ని వేల మంది ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జీన్స్ వాష్ కార్ఖానాలు వాడుతున్న రసాయనాలతో కాలుష్యం పెరిగిపోతోందని, వెంటనే వాటిని మూసివేయాలని కాలుష్య నియంత్రణ విభాగం జారీ చేసిన నోటీసులను నిరసిస్తూ ఉల్లాస్‌నగర్‌లోని సుమారు 450 జీన్స్ వాష్ కార్ఖానాలు గత పది రోజులకుపైగా బంద్ పాటిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఉల్లాస్‌నగర్‌లోని కొందరు తెలుగువారితో ‘సాక్షి’ మాట్లాడింది. వారు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే ... ఇలా అయితే జీన్స్ తయారీ ఆపేయాల్సిందే... - దాసరి వెంకటేశ్వర్రావు, జీన్స్ తయారీ పరిశ్రమ యజమాని జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ ప్రభావం పరోక్షంగా జీన్స్ తయారీపై కూడా పడనుంది. మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం. 20 ఏళ్ల కిందట ఇక్కడికి ఉపాధి కోసం వచ్చాను. ఇక్కడే జీన్స్ కుట్టడం నేర్చుకున్నాను. ప్రస్తుతం రెండవ నంబర్ ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ తయారీ కార్ఖానాను సొంతంగా పెట్టుకుని పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను. మా వద్ద లేడీస్ జీన్స్ ఎక్కువగా తయారవుతాయి. ఈ జీన్స్‌ను కొన్ని రకాల రసాయనాల మిశ్రమంలో వాష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీన్స్ వాష్ కార్ఖానాల బంద్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మా వద్ద జీన్స్ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. బంద్ ఇలాగే కొనసాగితే మేం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. అదే జరిగితే వేలాదిమంది రోడ్డున పడాల్సి వస్తుంది. గతంలో రెండుసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. - కముజు శ్రీను, టైలర్ నాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం. 24 ఏళ్లుగా ఉల్లాస్‌నగర్‌లో జీన్స్ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పదేళ్ల కిందట ట్యాక్స్ వివాదం చెలరేగి సుమారు మూడు నెలలకు పైగా కార్ఖానాలు బంద్ ఉంచారు. దీంతో టైలర్లు రోడ్డున పడాల్సి వచ్చింది. తిరిగి 2005లో వచ్చిన వరదల కారణంగా చాలా రోజులపాటు పరిశ్రమ మూతపడింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం అంత దయనీయస్థితి లేకపోయినా బంద్ ఇలాగే కొనసాగితే మా పరిస్థితి తిరిగి దయనీయంగా మారే అవకాశముంది. ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నాను.. - అప్పారి శ్రీను, టైలర్ మాది తూర్పుగోదావరి జిల్లా కావలిపురం మండలం. బాల్యం నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను. ప్రస్తుతం టైలర్‌గా పనిచేస్తున్నాను. ఈ బంద్ ఇంకా కొనసాగితే ఇబ్బందులు ప్రారంభమవుతాయి. వేలాదిమంది నాలాంటి ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.