చుక్కలు చూపిస్తున్న కబాలి టికెట్ ధరలు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా కబాలి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 4 వేల స్క్రీన్లపై భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు రజనీ అభిమానులు, ప్రేక్షకులు అమితాసక్తి చూపుతున్నారు. టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో థియేటర్ల యజమానులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కబాలి సినిమా టికెట్లను అసలు ధర కంటే ఐదింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇది రజనీ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
తమిళనాడులో కబాలి సినిమా ప‍్రదర్శించనున్న చాలా థియేటర్లలో తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడయినట్టు ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ చెప్పాడు. ఒక్కో టికెట్ను సగటున 600 రూపాయలకు అమ్మారని ప్రేక్షకులు చెబున్నారు. తమిళనాడులో సినిమా టికెట్లను 120 రూపాయలకు అమ్మాల్సిఉండగా, దీనికి ఐదురెట్లు అధిక ధరకు అమ్మారు. అక్కడ చాలా థియేటర్లలో రజనీ అభిమాన సంఘాలకు మొదటి ఆట టికెట్లను కేటాయిస్తుండగా, ఈసారి కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కబాలి తొలిరోజు టికెట్లను బుక్ చేసుకున్నాయి.
కబాలి సినిమా ప్రదర్శన హక్కులను డిస్ట్రిబ్యూటర్ల భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నాయి. దీంతో అసలు ధరకు టికెట్లను అమ్మితే పెట్టుబడి రావడం అసాధ్యమన్న చెబుతున్నారు. దీంతో ఓపెనింగ్ వీకెండ్లోనే సాధ్యమైనంతవరకు కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల కంటే కబాలి సినిమాకు అధికంగా థియేటర్లో అమ్ముతున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ, కబాలి చిత్ర విడుదలపై స్టే విధించాలని దేవరాజన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.