నా మనసు చెబితే ఓకే
తమిళసినిమా: నా మనసు ఓకే చెబితేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. చెల్లెలికి పెళ్లైనా తను మాత్రం ఒంటరిగానే ఉంటున్న ఈ ఉత్తరాది బ్యూటీ నటిగా దశాబ్దకాలాన్ని అధిగమించేశారు. అయినా ఇంకా నాటౌట్‌గా వెలుగొందుతూనే ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో అవకాశాలను రాబట్టుకుంటున్నారు. కోలీవుడ్‌లో మొదట్లో కాస్త నిరాశకు గురైనా ఆ తరువాత నాన్ మహాన్ అల్ల, తుపాకీ, జిల్లా చిత్రాలు ఆమెను విజయాలబాట పట్టించాయి. ఇక తెలుగులో మగధీర చిత్రంతో కాజల్‌కు మహర్దశ వచ్చిందనే చెప్పవచ్చు.
ప్రస్తుతం మహేశ్‌బాబుకు జంటగా తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న బ్రహ్మోత్సవం చిత్రంతో పాటు, జీవాకు జంటగా కవలైవేండామ్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా త్వరలో విజయ్‌కు జంటగా ఆయన 60వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటిగా తన సుదీర్ఘ పయనం గురించి కాజల్ ఏమంటున్నారో చూద్దాం.. నటిగా నా వయసు దశాబ్దం దాటింది. ఇంత కాలం హీరోయిన్‌గా ఎలా మనగలుగుతున్నారని అడుగుతున్నారు. అందుకు కారణం కథల ఎంపికే.
నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేదానిని. అది ఒక రకంగా మంచి అనుభవాన్నే ఇచ్చింది. పరిణితి పెరిగింది. ఇప్పుడు మంచి కథలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. దర్శకులు కథలు చెప్పేటప్పుడే అది బలమైన పాత్రా, అభిమానులకు నచ్చుతుందా, అందులో బాగా నటించగలనా? లాంటి విషయాలను మనసులోనే ఊహించుకుంటాను. అప్పుడు నా మనసు మంచి కథే ఒప్పుకో అని చెబితే ఆ చిత్రాన్ని అంగీకరిస్తాను. అలా ఒప్పుకుని నటించిన మంచి కథలే నన్ను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. ఇక ఇక్కడ నిత్యం భిన్న మనస్తత్వాల మనుషులు కలుస్తుంటారు. వారితో ఎలా ప్రవర్తించాలన్న పరిపక్వత నాలో పెరిగింది.